కళ్యాణానికి సీఎం కెసిఆర్ మళ్ళీ డుమ్మా..!
===రామయ్య భక్తులను ఈసారీ నిరాశపర్చిన కెసిఆర్
===భద్రాద్రి రామయ్య భక్తుల ఆశలపై సీఎం కెసిఆర్ మరోమారు నీళ్ళు చల్లారు.
(భద్రాద్రికొత్తగూడెం బ్యూరో-విజయంన్యూస్);-
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు తీసుకరావాల్సింది సీఎం. ఇది తరతరాలుగా వస్తున్న దేవాలయ సంప్రదాయం. ముఖ్యమంత్రిగా గడిచిన 8 ఏళ్ళ కాలంలో రెండుసార్లు మాత్రమే సీఎం కెసిఆర్ భద్రాచలం కళ్యాణానికి వచ్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు, మంత్రులు, అధికారులు కలిసి రామయ్య కళ్యాణానికి పట్టువస్త్రాలు పట్టుకొచ్చి సమర్పిస్తున్నారు. సీఎం కెసిఆర్ గతంలో భద్రాచలం వచ్చినపుడు దేవస్థానం అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించి ఆనాడు ప్రశంసలు పొందారు.
also read;-దాసరదీ.. కరుణాపయోనిది..
ఆ హామీ తర్వాత మళ్ళీ భద్రాచలం వైపు తిరిగి చూడలేదు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నంతకాలం భద్రాద్రి ఆలయ అభివృద్ధిప్రణాళికపై కొంత ఫాలోఅప్ చేశారు. ఆయన ఓటమిపాలై శాసనసభ, మంత్రి మండలి నుంచి నిష్క్రమించడంతో భద్రాచలం ఆలయ అభివృద్ధి గురించి ఇపుడు దృష్టి పెట్టేవారులేరు. సీఎం ప్రకటించిన వంద కోట్ల నిథులు విడుదల చేయించడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి పట్టించుకోవడంలేదని భద్రాద్రి ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.
వంద కోట్లు.. ఐదు పంచాయతీలు
ఇపుడు భద్రాచలంలో ప్రతినోట ఇదేమాట వినిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం శివారు ప్రాంతం నుంచి ఏకపక్షంగా విడదీసి ఆంధ్రాలో కలిపిన ఐదు గ్రామపంచాయతీలను తిరిగి కలిపితేనే భద్రాచలం పట్టణానికి భవిష్యత్తు ఉంటుందని, అలాగే సీఎం కెసిఆర్ ప్రకటించిన వంద కోట్లు రిలీజ్ చేస్తేనే దక్షిణ అయోధ్యగా చెప్పుకునే భద్రాచల రామాలయం అభివృద్ధి చెందుతుందని భద్రాద్రివాసులు, జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఈ సమస్యల సాధన కోసం గత రెండు నెలలుగా రాజకీయాలకు అతీతంగా అందరు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు. రామయ్య కళ్యాణం సందర్భంగా ప్రధానమైన ఈ రెండు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశపడి భద్రాద్రి ప్రాంత ప్రజలు వేయికళ్ళతో ఎదురుచూశారు.
also read :-ఖమ్మంలో రూ.75 లక్షల విలువైన గంజాయి పట్టివేత
కానీ ఈసారీ నిరాశే కలిగింది. రాష్ట్రంలో టీఆర్ఎస్, బిజెపి నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆనవాయితీ ప్రకారం సీఎం కెసిఆర్ భద్రాద్రి రాములోరి కళ్యాణానికి రారని, అందుకే ఈసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని తీసుకొచ్చి పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలని ఆశపడిన బిజెపికి నిరాశే ఎదురైంది. అమిత్ షా వస్తున్నట్లుగా రెండువారాల ముందు నుంచి బిజెపి వాళ్ళు మీడియాకి లీకులు ఇచ్చి వార్తలు రాయించుకొని లాభపడే ప్రయత్నం చేసినా కమలం నేతల ఎత్తుకడ బెడిసికొట్టింది. ఇటు కెసిఆర్, అటు అమిషా కూడా రాకపోవడంతో భద్రాద్రి రామయ్య భక్తులు భగ్గున మండిపడుతున్నారు. సోమవారం జరిగే శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ వస్తుండటంతో బిజెపి వాళ్ళకు కొంత ఊరట కలిగించింది. సీఎం రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ రామయ్య భక్తుల ఎదుట దోషిగా నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.