సీనియర్ నటి జమున కన్నుమూత
== అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లో మృతి
== సిని ఇండస్ట్రిలో విషాదం
(సినిమా- విజయంన్యూస్)
తెలుగు సిని పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. ఇటీవలే ఉన్నత సిని యాక్టర్లు ఒకరి తరువాత ఒకరు చనిపోతుండగా, శుక్రవారం మరో సిని దిగ్గజ స్టార్ జమున కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున హైదరాబాద్ లోని తన నివాసంలో చనిపోయారు. అలనాటి అందాల నటి, రాజమహేంద్రవరం పార్లమెంటు మాజీ సభ్యురాలు… అపర సత్యభామగా..గౌరమ్మ గా వెండితెర మీద చెరగని ముద్ర వేసుకున్న జమున(86) ఇక లేరు. ఈరోజు ఉదయం ఆమె మృతి చెందారు. 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు…ఈ రోజు ఉదయం అనారోగ్య కారణాల వలన హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు…
జీవిత విశేషాలు :-
*జమునకు తెలుగు మాతృభాష కాకపోయినా తెలుగునేలలో పెరిగి, తెలుగు చలన చిత్రాలలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తార.
జమున 1936 ఆగష్టు 30 న హంపీలో పుట్టారు.
*ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. ఆయన ఒక వ్యాపారవేత్త. బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో..
* జమునకు ముందుగా నిర్ణయించిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో మధ్యలో ‘ము’ అక్షరం చేర్చి జమునగా మార్చారు..
*జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు..
* మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు *పుట్టిల్లు (1953) సినిమాలో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె.
*ఆ తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించింది.
*ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది#సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటిటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్నట్టుగా నటించిందీమె.
*వినాయకచవితి చిత్రంలో మొదటి సారి #సత్యభామలో జమున కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేసింది. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు..
* కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని పాత్రే ఆమెకు పేరు తెచ్చింది.
#మూగ మనసులు సినిమాలో ఆమె #గౌరమ్మ పాత్ర మరవ రానిది. గోదావరి చూస్తే అమే గుర్తు వస్తుంది.
జమున. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది.
ఇది కూడా చదవండి: తెలుగు సిని పరిశ్రమలో విషాదం..కైకాల ఇక సెలవు
*ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.
తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె #198 సినిమాలు చేశారు.
*పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.
*1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు.
* జమున.. వెండితెర వేల్పు, అభిమానుల ఇలవేల్పు…
* ఆమె క్రీగంట చూస్తే జేగంటలే. చిత్రసీమకు కాసుల పంటలే. స్వర్ణయుగ సినిమా కాలంలో ఆ వయ్యారిభామ కళ్లెత్తితే కనకాభిషేకాలు. అభినయానికి మెచ్చి అభిమానలోకం పుష్పాభిషేకాలు. అనేక చిత్రాల రజతోత్సవాలు. సొగసైన కళ్లతోనూ నటించిన నటవిదుషీమణికి వెండితెర పాతికేళ్లు పట్టాభిషేకం చేసుకుంది. అగ్రకథానాయకిగా గౌరవించింది. ఆమెనే జమున. *ఆమె కరుణిస్తే మలయమారుతం. ఆగ్రహిస్తే ప్రళయ జంఝామారుతం. ఆ కళ్లు వయ్యార మొలికిన నయగారాలు. నయన నయాగరాలు. కలువల్లాంటి కళ్లు. చక్రాల్లాంటి కళ్లు.. అభివర్ణనలు ఏవైనా అభినేత్రి జమున విశాలనేత్రి. కళ్లతో కోటిభావాలు ప్రకటించారు. కనుబొమ్మల భాషలో, కనులతో నటించారు. నాలుగు భాషల్లో, 200చిత్రాలలో నటించిన మేటి నటి.
ఇది కూడా చదవండి: దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు
జగమే ఊయలలూపిన వెండితెర వెన్నెల. మహిళల స్వాభిమాన జమీందారిణి. ఆత్మవిశ్వాసం నిండుగా నింపిన ‘జమునా తీరం’.. కళామతల్లి మణిహారం.హంపిలో పుట్టిన కన్నడ కస్తూరి జమున. తెలుగువారి దత్తపుత్రిక. తల్లిదండ్రులతో చిన్నప్పడే గుంటూరు జిల్లా దుగ్గిరాల వచ్చి స్థిరపడటం వల్ల జమున తెలుగమ్మాయిగా మారిపోయింది. తన వెండితెర ప్రయాణానికి ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు సినిమా ‘ పుట్టిల్లు’ తొలిమజిలీ అయ్యింది. తెలుగు నేల ఆమె పుట్టిల్లయ్యింది. ఆకర్షణీయ రూపం, స్పష్టమైన వాచకం, భాషా ఉచ్ఛారణలో స్ఫటిక స్వచ్ఛత, స్పష్టత నేర్చిన జమున.. సంగీత, నాట్యాలతో తనను తాను తీర్చిదిద్దుకున్నారు.
== 1955 మిస్సమ్మ
ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1955లో వచ్చిన హాస్యభరిత చిత్రం ‘మిస్సమ్మ’ ఒక క్లాసిక్. జమున నటిగా తనను తాను నిరూపించుకున్న సినిమా. ఇందులో ‘ బృందావనమది అందరిదీ..గోవిందుడు అందరివాడేలే’ పాటకు జమున అభినయం అపూర్వం. సావిత్రితో పోటీపోటీగా నటించింది. భాగ్యరేఖ(1957)లో బీఎన్ రెడ్డి దర్శక ప్రతిభ చూడాలంటే మరో సినిమాలో ఈ పాట సందర్భాన్ని గమనించాలి. పువ్వులు కోస్తున్న కథానాయకి ఏకకాలంలో అటు దైవానికి , ఇటు తన మనోభిరాముడికి చేసే నివేదన దర్శక సమయస్ఫూర్తికి నిదర్శనం. అనంతరం అప్పుచేసి పప్పుకూడు, గులేబకావళి కథ, బొబ్బిలి యుద్ధం, రాముడు-భీముడు, మంగమ్మ శపథం, గుండమ్మ కథ, మూగమనసులు, మంచి మనిషి, లేతమనసులు, రాము, మూగనోము, పండంటి కాపురం, కలెక్టర్ జానకి, మనుషులంతా ఒక్కటేలో జమున నటన తారస్థాయిలో ఉంది.
== అగ్రహీరోలతో..
విశాలనేత్రి, అందాల అభినేత్రి జమున ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరావుతో అత్యధిక సినిమాలలో నటించారు. ఎన్టీఆర్, ఏయన్నార్‌తో పొరపొచ్ఛాల వల్ల కొంతకాలం వారి సినిమాలలో అవకాశాలు రాలేదు. దాంతో ఆ సమయంలో ఆమె జగ్గయ్య, హరనాథ్, కృష్ణ, శోభన్ బాబులతో కలసి 15 సినిమాలలో నటించారు. వాటిలో అత్యధిక సినిమాలు విజయం సాధించాయి. హీరో కృష్ణ తో అమాయకుడు, అల్లుడే మేనల్లుడు, దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో నటించారు. 1974లో వచ్చిన దేవుడు చేసిన మనుషులులో అతిథి పాత్రలో మెరిశారు.
సత్యభామంటే జమునే
== తెలుగువారి నర్గీస్ జమున
జమున.. తెలుగు, కన్నడ, తమిళం, హిందీలో ఆమె 198 సినిమాల్లో నటించారు. తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్థాపించి పాతికేళ్లుగా సామాజిక సేవ చేస్తున్నారు. అభిమానులు జమునను హంపీ సుందరిగా, తెలుగువారి నర్గీస్గా అభివర్ణిస్తారు. జమున అసమాన నటనా విశిష్టతను గుర్తిస్తూ 1999లో తమిళనాడు ప్రభుత్వం ఎంజీఆర్ పురస్కారంతో, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో గౌరవించాయి. 85 వసంతాల వయసు. అదే చలాకీ తనం. అదే ఉత్సాహం.. ఇటీవల మిస్సమ్మ సినిమాలో తన పాటకు తనే మళ్లీ అభినయించిన దృశ్యాలు వీక్షకులను ఆశ్చర్యపరిచాయి.
== హంపి టూ గుంటూరు
హంపిలో పుట్టిన కన్నడ కస్తూరి జమున. తెలుగువారి దత్తపుత్రిక. తల్లిదండ్రులతో చిన్నప్పడే గుంటూరు జిల్లా దుగ్గిరాల వచ్చి స్థిరపడటం వల్ల జమున తెలుగమ్మాయిగా మారిపోయింది. తన వెండితెర ప్రయాణానికి ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు సినిమా ‘ పుట్టిల్లు’ తొలిమజిలీ అయ్యింది. తెలుగు నేల ఆమె పుట్టిల్లయ్యింది. ఆకర్షణీయ రూపం, స్పష్టమైన వాచకం, భాషా ఉచ్ఛారణలో స్ఫటిక స్వచ్ఛత, స్పష్టత నేర్చిన జమున.. సంగీత, నాట్యాలతో తనను తాను తీర్చిదిద్దుకున్నారు.
== అభిమానుల ఇలవేల్పు..
అభినయం ఒక ఆశయం. నిత్యవసంతం. ఇగిరిపోని గంధం. జన్మజన్మల కళానుబంధం. ఎనభై ఐదు వసంతాలలో ఉత్సాహం. ‘మళ్లీ మళ్లీ మావిడి కొమ్మ పూయును లె’ ఆమె పాటే చెబుతుంది. చిత్ర విజయాల బాటే చెబుతుంది. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి జమున వెండితెర జీవితం నిలువెత్తు నిదర్శనం. అన్నపూర్ణమ్మగారి మనవడు సినిమాలో అతిథిపాత్రతో అలరించి నటన ఎప్పటికీ తన ‘తోడూ-నీడ’ అని జమున నిరూపించారు. ఆమె వెండితెర వేల్పు. నేటికీ నీరాజనాలు అందుకుంటున్న అభిమానుల ఇలవేల్పు.