Telugu News

దివాళా దిశగా సింగరేణి

- సి.ఎం.డి, కెసిఆర్ ల పైకి తిరగబడాలి

0

దివాళా దిశగా సింగరేణి
– సి.ఎం.డి, కెసిఆర్ ల పైకి తిరగబడాలి
– ఆర్ధిక దోపిడిని అడ్డుకుంటేనే సింగరేణి సంస్థకు మనుగడ
– రాజకీయ జోక్యం, ఆర్ధిక దోపిడిపై కేంద్రం స్పందించాలి
– నికర లాభాల్లో నుంచి 35శాతం కార్మికులకు వాటా చెల్లించాలి
– సొంతింటి పథకం, నూతన భూగర్భగనుల హామీని విస్మరించిన ముఖ్యమంత్రి
– మీడియా సమావేశంలో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య
(భద్రాద్రి కొత్తగూడెం-విజయం న్యూస్):

సింగరేణి సంస్థను దివాలా తీయించే స్థాయిలో జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక దోపిడిని అడ్డుకుంటేనే సంస్థకు, కార్మికులకు మనుగడ ఉంటుందని, తిరుగుబాటు ఉద్యమాలతోనే దోచుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్, దోచిపెడుతున్న సంస్థ సిఎండికి బుద్ధి చెప్పాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య కార్మికవర్గానికి పిలుపునిచ్చారు. స్థానిక శేషగిరిభవన్‌లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సీతారామయ్య మాట్లాడారు. సింగరేణి సంస్థ ఖజానాపై కన్నేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులు కష్టించి సాధించి పెడుతున్న లాభాలను దోచుకుంటూ వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితికి తీసుకువచ్చాడని విమర్శించారు. గత ఆర్ధిక సంవత్సరంలో డిఎంఎఫ్ రూపంలో 2,742 కోట్లు, సిఎస్ఆర్ పేరుతో రూ.263కోట్లు ప్రభుత్వం దోచుకుందని, మరో రూ.40కోట్లు కరోణా సహాయం క్రింద సిఎం రిలీఫ్ ఫండ్ పేరుతో సంస్థ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి దోచి పెట్టారని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ.రెండు కోట్లు అప్పనంగా దోచిపెట్టారని, కార్మికుల కష్టార్జితాన్ని దోచిపెట్టే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి మల్లిస్తూ కార్మికులకు మొండిచేయి చూపుతున్నారని, గత ఆర్ధిక సంవత్సరంలో కేవలం రూ.223కోట్లు మాత్రమే లాభాలు వచ్చాయని కాకిలెక్కలు చూపుతూ కార్మికులకు ఆర్ధిక నష్టానికి గురిచేస్తున్నారన్నారు.

also raed : కోల్ బెల్ట్ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వెలుగులు

వాస్తవ లాభాలు ప్రకటించి వాటిలోనుంచి కార్మికులకు రావాల్సిన వాటా ధనం 35శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థలో జరుగుతున్న ఆర్ధిక దోపిడి, మితిమీరిన రాజకీయ జోక్యంపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కార్మిక శాఖ స్పందించి కార్మికులను, సింగరేణి సంస్థను పరిరక్షించాలని కోరారు. 25 భూగర్భగనులు ప్రారంభిస్తామని, కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామని, ఇన్కమ్ టాక్సు రద్దుచేయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏండ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదన్నారు. సంస్థలో పర్మినెంట్ కార్మికుల సంఖ్య తగ్గుతుంటే కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ఘననీయంగా పెరుగుతోందని తెలిపారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమానికి ముప్పు వాటిల్లుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల విధానాలతో తిరోగమిస్తున్న సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన భాద్యత కార్మికులు, కోల్ బెల్ట్ ప్రాంతాల ప్రజలపై ఉందన్నారు. మీడియా సమావేశంలో కార్పోరేట్ శాఖ కార్యదర్శి వంగా వెంకట్, కొత్తగూడెం ఏరియా శాఖ కార్యదర్శి గనిగళ్ళ వీరస్వామి, నాయకులు జె.గట్టయ్య, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

also raed : దండోర యాత్రలో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క.