Telugu News

వ్యవసాయ చట్టాలను రద్దు ఆమోదం తెలపనున్న కేంద్ర కెబినెట్

వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మో

0

వ్యవసాయ చట్టాలను రద్దు ఆమోదం తెలపనున్న కేంద్ర కెబినెట్

దిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా బుధవారం కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలపనుంది. ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశంలో ‘వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021’ని ఆమోదించి, ఈ నెల 29న మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తొలిరోజే దానిని ప్రవేశపెడతారు. మంగళవారం రాత్రి విడుదలైన లోక్‌సభ సభా వ్యవహారాల జాబితా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. మూడు చట్టాల రద్దుకు కలిపి ఒకే బిల్లును వ్యవసాయ మంత్రిత్వ శాఖ రూపొందించినట్లు సమాచారం. దేశంలో కొన్ని మినహా మిగతా ప్రైవేటు క్రిప్టో కరెన్సీల రద్దు/ నియంత్రణ, అధికారికంగా డిజిటల్‌ ద్రవ్యాన్ని జారీ చేయడానికి ఆర్‌బీఐని అనుమతించడం వంటి అంశాలతో పాటు మొత్తం 26 బిల్లుల్ని ఈసారి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

విత్తనాలపై బిల్లు: నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా ఒక బిల్లు పార్లమెంటు ఆమోదానికి రానుంది. నకిలీ విత్తనాలు అమ్మినవారికి జరిమానా చాలా స్వల్పంగా ఉండగా, కొత్త బిల్లులో దానిని రూ.5 లక్షలకు పెంచారు. విత్తనాలకు ధర నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానిదే. ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో బిల్లును ప్రభుత్వం తీసుకురానుంది. హైకోర్టు/ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు- సేవా నిబంధనల సవరణ బిల్లు, విద్యుత్తు సవరణ బిల్లు వంటివి ప్రవేశపెట్టనున్నారు. యాచకులకు పునరావాసం కల్పించి, వారి పిల్లలకు విద్య, జీవన నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా పార్లమెంటుకు రానుంది. హైదరాబాద్‌ సహా పది నగరాల్లోని యాచకులందరికీ తక్షణం పునరావాసం కల్పించాలన్నది లక్ష్యం. ఐదేళ్ల పాటు అమలయ్యే ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.100 కోట్లు కేటాయించింది.

also read :- తెలంగాణలో నామినేషన్ల పర్వం.