Telugu News

రాజ్యాంగ రక్షణ దేశ రక్షణ.

== మనువాదుల కుట్రలను తిప్పికొడదాం

0

రాజ్యాంగ రక్షణ దేశ రక్షణ
మనువాదుల కుట్రలను తిప్పికొడదాం
 రాజ్యాంగ రక్షణకు ప్రతిన బూనుదాం
మోడీ, కేసీఆర్ లది రాచరిక పాలన
తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మల్లు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ రక్షణ అని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకున్న సందర్భంగా సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబెద్కర్ స్ఫూర్తి అజరమారమని ఆయన కొనియాడారు. దేశంలో అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించారన్నారు.

also read;-వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

భారత రాజ్యాంగం దేశంలోని సకల సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పారు. భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే దేశంలో సమానత్వం, సౌభ్రాతృత్వం వెల్లి విరుస్తుందని వివరించారు. సమాజం మీద ఆధిపత్యం చేయాలనుకునే కుట్రదారులు భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేసి దేశంలోని ప్రజలందరికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాదాన్ని అమలు చేయాలని ఇప్పుడు బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు కుట్ర చేస్తున్నాయని ధ్వజ మెత్తారు. లౌకిక వాదులు, దేశభక్తులు మనువాద కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

also read :-బెల్ట్ తీయరా..?

ప్రజాస్వామిక వాదులు, సమతా వాదులు భారత రాజ్యాంగాన్ని రక్షించుకుని దేశాన్ని సమానత్వంలో ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. దేశానికి కాంగ్రెస్ ప్రసాదించిన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని హరించి మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు రాచరిక పాలన చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, ఉద్యమిస్తే నిర్బంధాన్ని ప్రయోగిస్తూ పౌరుల భావప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చి మనువాద సిద్ధాంతాన్ని దేశంలో అమలు చేయాలని కుట్ర చేస్తున్న బీజేపీ సర్కారును గద్దె దించడానికి దేశ ప్రజలు మరో స్వాతంత్ర్య సంగ్రామానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గణతంత్ర వేడుకల సందర్భంగా భారత రాజ్యాంగ రక్షణకు, దాని అమలు కోసం మనందరం ప్రతినబూని, పునరంకితం అవుతామని, అదే నిజమైన గణతంత్ర దినోత్సవం అని అన్నారు.