Telugu News

పంజాబ్‌ లో కాంగ్రెస్‌ అందుకే ఓడిందా..?

సొంతపార్టీ గొడవలే కొంప ముంచాయా..?

0

పంజాబ్‌ లో కాంగ్రెస్‌ అందుకే ఓడిందా..?
== సొంతపార్టీ గొడవలే కొంప ముంచాయా..?
== అన్నింటికి ఆయనే బాధ్యుడా..?
(చండీఘడ్‌-విజయంన్యూస్):-
పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సుమారు 15 శాతం ఓట్లను కోల్పోయినట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది. దీనికి కారణాల్లో ఒకటి ఆ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వ్యవహార శైలి అనే ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి. నాయకత్వ లోపంతో పాటు సిఎంగా కెప్టెన్‌ అమరీందర్‌ను తప్పించడం, సిద్దూను అతిగా ప్రోత్సహించడం కూడా వ్తయిరేకతను తెచ్చి పెట్టింది.

దీనికితోడు ఆప్‌ హావిూలు కూడా బాగా పనిచేశాయి. మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్ధూ మధ్య విభేదాలను సరైన రీతిలో చక్కదిద్దలేకపోవడం కాంగ్రెస్‌ అధిష్ఠానం చేసిన పెద్ద తప్పిదమని విశ్లేషకులు చెప్తున్నారు. కెప్టెన్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనపై సిద్ధూ అనేక విమర్శలు చేస్తూ ఉంటే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంకలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో జరగరాని నష్టం జరిగిపోయిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. చివరికి కెప్టెన్‌ సింగ్‌కు ఇష్టం లేకపోయినా పీసీసీ అధ్యక్ష పదవిని సిద్ధూకి కట్టబెట్టారని, ఆ పదవిని పొందిన తర్వాత కూడా సిద్ధూ సంయమనం పాటించకుండా కెప్టెన్‌పై విమర్శలు గుప్పించడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు.

also read ;-యూపిలో స్పష్టమైన ఆధిక్యం దిశగా బిజెపి

దళిత ఓటుబ్యాంకును నమ్ముకుని చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్‌ సత్ఫలితాలను సాధించలేకపోయింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతుల పోరాటానికి మద్దతివ్వడం వల్ల కాంగ్రెస్‌కు ప్రయోజనం దక్కలేదు. రైతుల ఉద్యమానికి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ గట్టి మద్దతుదారు అని బీజేపీ ఆరోపిస్తూ ఉండేది. దీంతో ఆ క్రెడిట్‌ అంతా కెప్టెన్‌ సింగ్‌కు వెళ్ళిపోయింది. ఆయన ఆ పార్టీని వీడటంతో రైతులు కూడా కాంగ్రెస్‌వైపు చూడలేదని విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు పంజాబ్‌ డీజీపీ ఇక్బాల్‌ ప్రీత్‌ సింగ్‌ సహోటాను సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకించి, వివాదం సృష్టించారు

. ఆయనను మార్చి సిద్దార్థ ఛటోపాధ్యాయను డీజీపీగా నియమించే వరకు పట్టువీడలేదు. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ, హోం మంత్రి సుఖ్‌జిందర్‌ రణధవా సంపూర్ణంగా సహోటాకు మద్దతుగా నిలిచినప్పటికీ సిద్ధూ తన పంతం వీడలేదు. సహోటాను డీజీపీగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి కూడా సిద్ధూ రాజీనామా చేశారు.

ఆ తర్వాత రాజీనామానుఉపసంహరించుకున్నప్పటికీ, డీజీపీ నియామకానికి అధికారులతో కూడిన కొత్త ప్యానెల్‌ను యూపీఎస్‌సీ ప్రకటించినపుడు, కొత్త అడ్వకేట్‌ జనరల్‌ను నియమించినపుడు మాత్రమే తాను మళ్ళీ పీసీసీ చీఫ్‌ పదవిని స్వీకరిస్తానని షరతు విధించారు. కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఏర్పాటు చేసిన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభావం కొంత మేరకు కనిపిస్తోందని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత దళిత నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఆయనతో కూడా సిద్ధూ మొదట్లో విభేదించారు.

also read;-నేటినుంచి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర
ఎన్నికల ప్రచారానికి కేవలం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మాత్రమే నాయకత్వం వహించారు. సీనియర్‌ నేతలు సునీల్‌ జక్కర్‌, నవజోత్‌ సింగ్‌ సిద్ధూ వంటివారు ప్రచారానికి మనస్ఫూర్తిగా సహకరించలేదని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సిద్ధూ, చన్నీలలో ఎవరో ఒకరిని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవాలని కోరుతూ ఆ పార్టీ నిర్వహించిన పోల్‌లో ఎక్కువ మంది చన్నీకి ఓటు వేశారు. దీంతో చన్నీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో సిద్ధూ కేవలం తాను పోటీ చేస్తున్న అమృత్‌సర్‌ ఈస్ట్‌ నియోజకవర్గానికే పరిమితమై ప్రచారం చేశారు. అదేవిధంగా పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ జక్కర్‌ తన మేనల్లుడు సందీప్‌ జక్కర్‌ పోటీ చేస్తున్న అబోహర్‌ నియోజకవర్గంలో మాత్రమే ప్రచారం చేశారు. విధంగా సీనియర్‌ నేతల మధ్య విభేదాలు కాంగ్రెస్‌ పార్టీ పరాజయానికి కారణమయ్యాయి.