తమ్ముడు సమాధిపై గులాబీలు చేరకముందే అన్నకు అంత్యక్రియలు.
—ఉక్రెయిన్‌లో హృదయవిదారక ఘటన..!!
(ఉక్రెయిన్ విజయం న్యూస్);-
ఉక్రెయిన్ విజయం న్యూస్:- రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర విషాదాన్ని నింపుతున్నది. ఉక్రెయిన్ శవాలదిబ్బగా మారిపోతున్నది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది తల్లులు పుత్రశోకంలో మునిగిపోతున్నారు. ఓ ఉక్రెయిన్ తల్లి పదిరోజుల వ్యవధిలోనే తన ఇద్దరి కొడుకుల మృతదేహాలను పక్కపక్కనే పాతిపెట్టిన హృదయవిదారక ఘటన అందరినీ కలచివేస్తున్నది.
ఉక్రెయిన్‌కు చెందిన అహఫియా వైశివానాకు ఇద్దరు కొడుకులు వాసిల్ వైశివాని(28) , కైరిలో వైశివాని (35) ఉన్నారు. ఇద్దరూ ఉక్రెయిన్ తరఫున రష్యాతో యుద్ధంలో పాల్గొన్నారు. కాగా, రష్యా దాడిలో మార్చి 3న మైకోలోవ్ ప్రాంతంలో తమ్ముడు వాసిల్ వైశివాని మృతిచెందాడు. అతడి అంత్యక్రియలు ముగిసి పదిరోజులుకూడా గడవకముందే మార్చి 13న అన్న కైరిలో వైశివాని లివివ్ సమీపంలో రష్యా క్షిపణి దాడిలో నేలకొరిగాడు. కైరిలో వైశివాని అంత్యక్రియలకు ఊరుఊరంతా కదిలింది. మొత్తం 3000 మంది పాల్గొన్నారు. దేశంకోసం అతడు చేసిన త్యాగానికి గుర్తుగా తుపాకీని గాల్లోకి నాలుగు రౌండ్లు పేల్చి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఆ ఇద్దరిని పక్కపక్కకు పాతిపెట్టిన తల్లి కన్నీటిపర్యంతమైంది.
also read :-వైసిపికి బిగ్ షాక్.. టీడీపీలోకి ఫైర్ బ్రాండ్..! కారణం అదేనా.?
చర్చిలోపల పూజారులు “ది సఫరింగ్ మదర్” అనే శ్లోకాన్ని పఠించారు. కైరిలో ధైర్యసాహసాలు, అతడు తన దేశం, ప్రజల కోసం చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. కాగా, కైరిలో వైశివానిని పాతిపెట్టే సమయంలో పక్కనే ఉన్న తమ్ముడు వాసిల్ వైశివాని సమాధిపై ఉంచిన గులాబీపూలు వాడిపోయి చెదరకుండా అట్లే ఉన్నాయి. చిన్న కొడుకు సమాధిపై గులాబీలు చెదరకముందే పెద్దకొడుకుకు అంత్యక్రియలు నిర్వహించిన ఆ తల్లిని చూసి అందరి హృదయాలు చలించిపోతున్నాయి.
ఈ అంత్యక్రియలకు సంబంధించిన హృదయ విదారక ఫొటోలు, వీడియోలను ప్రముఖ జర్నలిస్ట్ క్రిస్టోఫర్ ముల్లర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ భయంకరమైన యుద్ధంలో తాను చూసిన అత్యంత హృదయ విదారకమైన, కదిలించే విషయాల్లో సైనికుడు కైరిలోవైశివాని అంత్యక్రియలు ఒకటని ముల్లర్ పేర్కొన్నారు.