మహిళా బిల్లుపై సవితిప్రేమేనా..?
బిజెపి అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు కావస్తోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ సమయంలో బిజెపి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకుని వస్తుందా..లేదా అన్న సమాధానం సూటిగా చెప్పాలి. తన చిత్తశుద్దిని చాటుకుంటుందా లేదా అన్నది తేల్చాలి. ఊకదంపుడు ఉపన్యాసాలు కట్టిపెట్టి తమ నిజాయితీని నిరూపించాలి. బేటే బచావో..బేటీ పడావో నినాదంగా ఇది కాకూడదు. అలాగే బిజెపి మహిళా నేతలు మంత్రులుగా ఉన్న వారు ఈ మేరకు ప్రధాని మోడీ విూద ఒత్తిడి తెస్తారా లేదా అన్నది కూడా చెప్పాలి. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు దీనిపై స్పందించాలి. ఆనాటి స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా మహిళా బిల్లు గురించి ప్రస్తావించారు. పూర్తి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా కూడా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: మహిళ బిల్లు సంగతేంటి..?
అయినా బిజెపి ఎందుకు వెనక్కి పోతుందో చెప్పాలి. ఢల్లీలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టగానే హైదరాబాద్ బిజెపి కార్యాలయం లో, ఢల్లీలో పోటీ దీక్షలు చేపట్టడం ద్వారా బిజెపి కుత్సిత రాజకీయాలను బయట పెట్టుకుంది. రాజకీయాల్లో పోటీతత్వం అభివృద్దిలో చూపాలి. తాము ఈ అభవృద్దిని చేసి చూపామని చెప్పగలగాలి. మహిళా బిల్లును సాధించామని గర్వంగా ప్రకటించుకునేలా చేయాలి. అలా ప్రజలకు ఛాలెంజ్ చేసి చూపాలి. లిక్కర్ కేసులో కవిత ఉంటే విచారణ చేస్తున్నారు. విచారణకు హజారవుతానని కవిత చెప్పారు కూడా. ఆ కేసు వేరు. మహిళా బిల్లు వేరు. దీనిపై సమాధానం చెప్పాల్సింది బిజెపి నేతలే. కనీసం ప్రధాని మోడీని బహిళా బిల్లు గురించి ఏం చేద్దామని అడిగే ధైర్యం ఈ మహిళా మంత్రులకు, ఇక్కడ దీక్షలు విమర్శలు చేస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఉందా అన్నది చెప్పాలి. రాజకీయాలు, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందడంలో విఫలమవుతున్నాయి. ప్రస్తుత లోక్‌సభలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం గతంలో కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, రాజకీయ పరంపరలో మహిళలు ఇప్పటికీ అట్టడుగున కొనసాగుతున్నారు. మహిళా బిల్లును 9 ఏళ్లుగా ఎందుకు తీసుకుని రాలేక పోతున్నారో కనీసం జాతికి సమాధానం చెప్పే దమ్ముందా అన్నది కూడా చెప్పాలి. పార్లమెంటులో దేనికీ సమాధానం చెప్పలేని వారు.. పోటీ ధర్నాలతో రాజకీయాలు చేయడం మినహా ఏవిూ చేయలేరని బిజెపి నేతలు నిరూపించుకున్నారు.
ఇదికూడా చదవండి: పొంగులేటికి ‘దయ’ చూపడం లేదా..?
కవిత లిక్కర్ స్కామ్ వేరు. ఆమె ధర్నా చేస్తున్న అంశం వేరు. ఈ రెంటినీ ఒకే గాటన కట్టి విమర్శలు చేయడం సరికాదు. అలా అయితే లిక్కర్ కేసులో స్పందించినట్లుగానే మహిళా బిల్లుపైనా స్పందించాలి. దేశ ప్రజలను ఇంకెంత కాలం ఇలా మోసం చేస్తారన్నది కూడా తెలుస్తుంది. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఉదాత్త ఆశయాన్ని ఎవరు తుంగలో తొక్కారో ప్రజలకు తెలియదనుకోవద్దు. జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యాన్ని నీరుగార్చింది ఎవరో కూడా ప్రజలకు తెలుసు. వారిని రాజ్యాధికారానికి దూరంగా ఉంచడం అన్నది పురుషాధిక్య అమంకారానికి పరాకాష్టగా చూడాలి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ప్రధాని మోదీ పదేపదే చెప్తున్న ’బేటీ పడావో.. బేటీ బచావో’ అనే నినాదం బీజేపీ ఊకదంపుడు ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమైందని చెప్పాలి. మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుని రావాలంటే ముందుగా రిజర్వేషన్లు అమలు చేయాలి. మహిళల చదువులకు ఉదారం గా సాయం అందించాలి. పార్లమెంట్‌లో తొలి సారి 1996 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. 27 ఏండ్లు గడిచినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదంటే ఎవరు కారణమో కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలి. దీంతో ఎవరు దీనికి మోకాలడ్డారో తెలుస్తుంది. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువసభ ఆమోదం పొందింది.
ఇదికూడా చదవండి: “తగ్గేదేలే అంటున్న” ఇసుక మాఫియా
కానీ, దీన్ని లోక్‌సభ సుమారు నాలుగేళ్లు పక్కన పెట్టింది. 15వ లోక్‌సభ ముగింపుతో ఈ బిల్లు సైతం వీగిపోయింది. రాష్టాల్ర అసెంబ్లీల లో మహిళల ప్రాతినిధ్యం 15 శాతం కంటే తక్కువగా ఉన్నది. ప్రస్తుతం దేశంలోని పశ్చిమబెంగాల్‌కు మాత్రమే ఒక మహిళ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. 1998, 1999లో కూడా రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు లోక్‌సభలో మూడిరట ఒక వంతు మేర రిజర్వేషన్‌ను కల్పించడానికి ఉద్దేశించిన బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే వీటి విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఎప్పుడూ కుదరలేదు. 2008లో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు కొంతమంది సభ్యులు మంత్రి చేతిలో నుంచి బిల్లు ప్రతులను లాక్కోవడానికి ప్రయత్నించి వికృతంగా ప్రవర్తించారు. బిల్లులో రిజర్వేషన్లు రావాలని పట్టుబట్టింది కూడా లాలూ, ములాయం పార్టీలే. లెఫ్ట్ పార్టీలు కూడా ఈ తరహానే డిమాండ్ చేస్తూ వచ్చాయి. నిజానికి ముందుగా మహిళా బిల్లును ఆమోదించి తరవాత.. అందులో ఏ వర్గానికి ఎంత శాతం కేటాయించాలన్నది చర్చించాలి. ఈ బిల్లు పట్టాలకెక్క పోవడంలో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అందరి పాత్రా ఉందనే చెప్పాలి. ఈ బిల్లుపై ఎంపీలకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతున్నది.
ఇది కూడ చదవండి: ఆరోగ్య మహిళ.. ఆడ బిడ్డకు వరం..: మంత్రి పువ్వాడ
2019 లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ, కాంగ్రెస్ ఈ అంశాన్ని చేర్చాయి. మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం సీట్ల రిజర్వేషన్ కల్పిస్తామని ఈ పార్టీలు పేర్కొన్నాయి. అయితే పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం కోసం కేంద్రం తీసుకున్న చర్యలపై 2019 డిసెంబర్‌లో అప్పటి న్యాయ శాఖామంత్రి, బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్ రాజ్యాంగ సవరణ కోసం ఒక బిల్లును పార్ల మెంటులో ప్రవేశపెట్టడానికి ముందు అన్ని రాజకీయపార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకుని రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. కానీ ఆ ప్రయత్నాలు చేయలేదు. ఇప్టపికైనా బిజెపి మహిళా బిల్లుపై నోరు మెదపాలి. కుత్సిత రాజకీయాలు పక్కన పెట్టాలి. కవిత రాజకీయం చేస్తే..బిజెపి కూడా రాజకీయం చేస్తుందా అన్నది చెప్పాలి. రాజకీయాలు చేస్తూపోతే మహిళా బిల్లు వస్తుందా అన్నది కూడా బిజెపి నేతలు చెప్పాలి. అందువల్ల ఇలాంటి రాజకీయాలను పక్కన పెట్టి కవితతో సంబంధం లేకుండా మహిళా బిల్లుపై చిత్తశుద్దిని బిజెపి చాటుకోవాలి.