Telugu News

అచ్చే దిన్ కాదు సచ్చె దిన్

వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు విలవిల

0

అచ్చే దిన్ కాదు సచ్చె దిన్

** వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు విలవిల

** దేశ సంపదను కార్పొరేట్లకు పంచుతున్న మోడీ

** ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడంలో పోటీ పడుతున్న మోడీ, కేసీఆర్

** కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తాం

** పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్);-

దేశ ప్రజలకు అచ్చే దిన్ తీసుకొస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ రోజు రోజుకు ధరలను పెంచుతూ ప్రజలకు సచ్చే దిన్ తీసుకువచ్చాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. 2014 సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 350 రూపాయల ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను మోడీ సర్కార్ 8 ఏళ్ల పాలనలో 1,050 రూపాయలకు పెంచి ప్రజలపై తీవ్రమైన భారాలు మోపిందని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు గురువారం చింతకాని మండలం పాతర్ల పాడు నుంచి రైల్వే కాలనీ, నాగులవంచ, సీతంపేట, చిన్న మండవ గ్రామాల్లో పాదయాత్ర చేశారు.

also read;-అమెరికా సదస్సులో కూసుమంచి మండల యువకుడి అద్భుత స్పీచ్

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభలలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అచ్చే దిన్ అంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, టోల్ చార్జీల ధరల పెంచడంతో పాటు పేద, సామాన్యులు జ్వరం వస్తే వేసుకునే గోలీల పైన కూడా పన్నుల భారం వేయడమేనా అని విమర్శించారు. పేదలపై పన్నుల భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, సంపన్నులకు బడ్జెట్లో రాయితీలు కల్పించి సబ్ కా వికాస్ అని ప్రచారం చేసుకోవడానికి సిగ్గుండాలి అని విమర్శించారు. డీజిల్ ధర వంద రూపాయలు దాటితే దాని ప్రభావం వ్యవసాయం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల మీద పడిందని వివరించారు.

also read;-కేంద్రం కుటీల రాజ‌కీయాలు చేస్తోంది: నామా

ఎనిమిదేళ్ల మోడీ పాలనలో పేద సామాన్యులకు ఒరిగిందేమీ లేదని బడా కార్పొరేట్ శక్తులకు మాత్రం దేశ సంపదను పంచి పెడుతున్నారని దుయ్యబట్టారు. బిజెపి అవలంబింస్తున్న విధానాలు, మోడీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపడుతున్న ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ధరలు పెంచడం లో కేంద్రంతో పోటీపడుతూ రాష్ట్రప్రభుత్వం కూడా విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల పైన భారం వేస్తున్నదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పెంచుతున్న ధరలతో పేద, సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

also read;-మోడీజీ… మీరిచ్చిన మాటేమాయే

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకై పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నానని వివరించారు. పాదయాత్రలో తనతో కలిసి వేసిన అడుగుల సవ్వడి పాలకుల గుండెలు అదిరే విధంగా ఉండాలని, ఇందుకోసం తాను తలపెట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తన అడుగుల్లో అడుగులు వేస్తూ ప్రజలు కదం తొక్కితే పాలకుల కోటలు కూలిపోతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు తీసుకొస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుబంధు తో పాటు రైతులకు వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలు, సబ్సిడీపై విత్తనాలు ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్ లు ఏర్పాటు చేసుకోవడానికి నిధులు ఇస్తామని వెల్లడించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు ఆత్మగౌరవంతో తలెత్తుకు జీవించేలా రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలను తీవ్రతరం చేయనున్నామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని ఇది రాజకీయ ఎన్నికల యాత్ర కాదని స్పష్టం చేశారు.

also read :-గద్వేల్ లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత
** భట్టి పాదయాత్రలో జన జాతర
చింతకాని మండలం పాతర్ల పాడు నుంచి రైల్వే కాలనీ, నాగులవంచ, సీతంపేట, చిన్న మండవ గ్రామాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహించిన పాదయాత్ర జన జాతరను తలపించింది. సబ్బండ వర్గాలు రోడ్లపైకి వచ్చి పాదయాత్రకు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని భట్టి విక్రమార్క తన పాదయాత్రను కొనసాగించారు. మహిళలు మంగళహారతులు పట్టిన వీరతిలకం దిద్ది ఆశీర్వదించగా కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు దారి పొడవునా బంతిపూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.‌