Telugu News

బండి సంజయ్ మీ పాదయాత్ర ఎవరికోసం?

మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై పాదయాత్ర చేయండి

0

బండి సంజయ్ మీ పాదయాత్ర ఎవరికోసం?

—-మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై పాదయాత్ర చేయండి

—-జాతిని విడగొట్టడానికి అడుగులు వేయోద్దు

—-ఫెడరల్ స్ఫూర్తికి ద్రోహం చేస్తున్న బిజెపి పాదయాత్ర చేయడం విడ్డూరం

—-పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో మోడీ సర్కార్ వైఫల్యాలను తూర్పారబట్టిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

—–అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రాణం

—-కల్వర్టు నిర్మాణానికి నిధులు ఇస్తానని హామీ

—-పాదయాత్రకు తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ సంఘీభావం
(ఖమ్మం  -విజయం న్యూస్):-
దేశంలో ఉన్న అన్ని మతాలు, కులాలకు సమానత్వం కల్పించి జాతి నిర్మాణం చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున మనువాదం పేరిట జాతిని విడగొట్టాలని రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఫెడరల్ స్ఫూర్తికి ద్రోహం చేసే విధంగా, దళిత, గిరిజన బలహీన వర్గాలను మరింత వెనుక బడేటట్లుగా చేసి, మనువాదాన్ని ముందుకు తీసుకుపోవాలని బండి సంజయ్ చేపట్టిన సంగ్రామ యాత్ర పట్ల లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల శక్తులు, అప్రమత్తంగా ఉండాలన్నారు.

also read :-7 200 టీషర్ట్స్ టోపీ ఆవిష్కరణ

బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర దేశంలో లౌకిక వాదం లేకుండా చేయడానికి, భావ స్వేచ్ఛను హరించడానికి, ఫెడరల్ స్ఫూర్తిని విఘాతం కలిగించడానికి చేస్తున్న యాత్రగా ఉందని విమర్శించారు. అచ్చే దిన్ తీసుకువస్తానని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దేశ ప్రజలకు సచ్చే దిన్ తీసుకువచ్చాడని బండి సంజయ్ పాదయాత్ర చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. సామాన్యులపై మోడీ సర్కార్ అనేక భారాలను మోపుతూ.. సంపన్నులకు మాత్రం 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మొండి బకాయిలుగా చూపిస్తూ మాఫీ చేసిన విషయాన్ని పాదయాత్రలో బండి సంజయ్ ప్రజలకు వివరిస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సంగ్రామ యాత్ర రణ నినాదం చేస్తుందా అని నిలదీశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించకుండా, కార్పొరేట్ సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచడానికి పరోక్షంగా ప్రధాని మోడీ సహకరిస్తున్న నిజాలను పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ప్రజలకు చెబితే ఆయన పాదయాత్రకు అర్థం ఉంటుందన్నారు.

also read :-ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా అమలు చేయకుండా దేశ ప్రజలను ప్రధాని మోడీ మోసం చేశారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరిట అంబానీ ఆధానీలకు దారాదత్తం చేస్తూ.. ఉన్న ఉద్యోగుల ఉపాధిని మోడీ సర్కార్ దెబ్బతీస్తుందని దుయ్యబట్టారు. ఇలా కేంద్రం అనుసరించే ప్రజావ్యతిరేక విధానాలపై సంగ్రామం చేయకుండా, కులాల మతాల మధ్య చిచ్చు పెట్టి , విభజించి పాలించు విధానంతో రాజ్యాధికారం లోకి రావాలని తహ తహ లాడుతూ పాదయాత్ర చేస్తే ప్రజలకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

భిన్నత్వంలో ఏకత్వం అయిన భారత దేశంలో భాష, మతం పేరిట విద్వేషాలను సృష్టిస్తున్న మోడీ సర్కార్ ను ప్రశ్నిస్తున్న వారిపై రాజద్రోహం కేసులు పెట్టి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన భావ స్వేచ్ఛను, బ్రతికే హక్కును బిజెపి ప్రభుత్వం హరిస్తున్నదని మండిపడ్డారు. ఎనిమిది సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల బాధలను చూసి చలించి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పాదయాత్ర చేస్తున్నానని ఇది ఎన్నికల యాత్ర కాదని స్పష్టం చేశారు. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకొని, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారం కొరకు ప్రజా ఉద్యమాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వుంచడానికి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి ప్రాణం

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా॥ బి.ఆర్. అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా గురువారం బోనకల్ మండలం కలకోట గ్రామంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుందని వివరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన భావ స్వేచ్ఛ, బ్రతికే హక్కు, లౌకికవాదం అమలు చేయడమే అంబేద్కర్ కి అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు.

also read :-భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం

కల్వర్టు నిర్మాణానికి నిధులు ఇస్తానని హామీ
బోనకల్ మండలం రాయన్నపేట గ్రామంలో తువ్వచేలకు వెళ్ళే దారిలో వాగుపై కల్వర్టు లేకపోవడంతో పొలాల వద్దకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని బాధిత రైతులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు మొరపెట్టుకున్నారు. వాగుపై చిన్న కల్వర్టు నిర్మించి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరడం తో ఏ సి డి పి నిధులు 2 లక్షల రూపాయలు మంజూరు చేసి కల్వర్టు నిర్మాణం చేయిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

పాదయాత్రకు తెలుగుదేశం, సిపిఎం ,సిపిఐ సంఘీభావం
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు గురువారం బోనకల్లు మండలం రాయన్నపేటలో తెలుగుదేశం సిపిఎం, సిపిఐ నాయకులు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. జనాలు రోడ్లపైకి పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రకు వెల్ కమ్ చెప్పారు.సబ్బండ ప్రజలు తరలివచ్చి పీపుల్స్ మార్చ్ అడుగులో అడుగులు వేయడంతో రాయన్నపేట జన జాతరను తలపించింది. రోడ్ల మీద జనాలు కిక్కిరిసిపోయారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ పాదయాత్రకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. డప్పుల దరువు, కోలాటం మహిళల నృత్యాలు, కార్యకర్తల నినాదాలతో పాదయాత్ర హోరేత్తింది.