Telugu News

జీవో నెంబర్ 111 ఎత్తివేతకు కేబినెట్‌ ఆమోదం..

అస‌లేమిటీ జీవో 111? ఎందుకు ఎత్తేస్తున్నారు..?

0

జీవో నెంబర్ 111 ఎత్తివేతకు కేబినెట్‌ ఆమోదం..

అస‌లేమిటీ జీవో 111? ఎందుకు ఎత్తేస్తున్నారు..?

(హైద‌రాబాద్  విజయం న్యూస్):-

హైద‌రాబాద్ చుట్ట‌ప‌క్క‌ల అభివృద్ధికి గొడ్డ‌లిపెట్టులా మారిన జీవో 111ను ఎత్తివేయాల‌ని తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యించింది. హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో ఉన్నా భూములను వ్య‌వ‌సాయేత‌ర కార్య‌క‌లాపాల‌కు వినియోగించుకునేందుకు అనుమ‌తిలేక ఇబ్బందిప‌డుతున్న‌ ఆయా గ్రామాల ప్ర‌జ‌ల క‌ళ్ల‌ల్లో సంతోషం నింపింది. తెలంగాణ స‌ర్కారు 111 జీవో ఎత్తివేస్తున్న నేప‌థ్యంలో ఈ జీవో ఏంటి..? దీంతో ఎవ‌రికి లాభం? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం.

also read :-సొసైటీ చైర్మన్‌పై దాడి ఘటనలో 9 మంది సస్పెండ్

హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించేందుకు నిజాం పాలకుల హయాంలో జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లను నిర్మించారు. చాలా ఏళ్ల‌వ‌ర‌కు ఈ జలాశయాలే హైద‌రాబాద్ తాగునీటి అవ‌స‌రాలు తీర్చాయి. కాగా, ఈ జ‌లాశ‌యాల‌ను క‌లుషితం, క‌బ్జా కాకుండా కాపాడుకునేందుకు 1996లో అప్ప‌టి స‌ర్కారు జీవో 111 తీసుకొచ్చింది. ఈ జీవో కార‌ణంగా సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం క‌లుగుతున్న‌ది.

ప్రస్తుతం నగర తాగునీటి అవసరాలు గండిపేట, హిమాయత్ సాగర్‌పై ఆధారపడి లేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ నేపథ్యంలో 111 జీవో ఉద్దేశ్యం సంబద్ధతను కోల్పోయింది. ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్ 111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది.

also read :-మా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచుకి దక్కిన అరుదైన గౌరవం

అదే సమయంలో గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినేట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలను కాళేశ్వరం జలాలతో అనుసంధానం చేసే పనులు వేగంగా నడుస్తున్నాయి. ఈ జలాశయాల ద్వారా తాగునీటి సరఫరా కోసం ఏర్పడి ఉన్న ప్రస్తుత వ్యవస్థను నగరంలో పచ్చదనం పెంపొందింపజేసే నీటి సరఫరాకు ఉపయోగించుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఈ జలాశయాల ద్వారా నీటిని మూసీలోకి వ‌దిలేందుకు తగిన పథకం గతంలోనే రూపొందింది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ విధంగా ఈ రెండు జలాశయాలు ఉపయోగంలోఉంటాయి. మూసీ సుందరీకరణతో నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నగర పర్యావరణం మెరుగుపడుతుంది. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేయాలని, ఇతర పథకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం చీఫ్ సెక్రటరీగారి అధ్యక్షతన, పురపాలక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ భాగస్వామ్యంతో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

also read :-ఖమ్మంలో కాంగ్రెస్ ఆందోళన

ఈ కమిటీ ద్వారా రెండు జలాశయాల పరిరక్షణ కోసం నియమ,నిబంధనలు, ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని కేబినేట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలలోనూ మూసీ, ఈసా నదులలోనూ కాలుష్య జలాలు చేరడానికి వీలు లేకుండా కొత్త జీవోను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆమోదం ద్వారా రూపొందించాలని ముఖ్యమంత్రి కమిటీని ఆదేశించారు.

జీవో 111 ఎత్తేస్తే ఎవ‌రికి లాభం?

జీవో 111 కిందికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప‌రిధిలోని 84 గ్రామాలు వ‌స్తాయి. ఇదంతా బ‌యో క‌న్జ‌ర్వేష‌న్ జోన్‌గా ఉంది. ఈ ప్రాంత విస్తీర్ణం 538 చదరపు కిలోమీటర్లు. అంటే ఇది దాదాపు జీహెచ్ఎంసీ విస్తీర్ణానికి సమానం. ఈ 84 గ్రామాల్లోని 1 లక్షా 32 వేల ఎకరాల భూములున్నాయి. నగరానికి చేరువలో మరో భాగ్యనగరం పట్టేంత విస్తీర్ణంలో భూములున్నా అలాంటి భూముల్లో వ్యవసాయేతర కార్యకలాపాలు చేపట్టడంపై జీవో 111 ప్ర‌కారం ఆంక్ష‌లున్నాయి. ఇక్క‌డ వ్య‌వ‌సాయేత‌ర కార్య‌క‌ల‌పాలపై నిషేధం ఉంది.

దీంతో ఇక్క‌డ అభివృద్ధికి అడ్డుక‌ట్ట‌ప‌డింది. ఆయా గ్రామాల ప్ర‌జ‌లు మ‌హాన‌గ‌రానికి ద‌గ్గ‌ర ఉన్నా అభివృద్ధికి ఆమ‌డ దూరంలో ఉండిపోయామ‌ని మ‌న‌వేద‌న చెందుతున్నారు. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకుని కేబినెట్‌ జీవో 111 ఎత్తివేత‌కు ఆమోదం తెలిపింది. దీంతో ఇక్కడి భూముల ధరలు భారీగా పెరుగ‌నున్నాయి. ఈ గ్రామాలుకూడా హైద‌రాబాద్‌లా అభివృద్ధి బాట‌ప‌ట్ట‌నున్నాయి.