Telugu News

అద్భుతమైన శిల్ప నైపుణ్యం రామప్ప.

* తెలంగాణ వారసత్వ మహత్వానికి దక్కిన ఘన గౌరవం రామప్ప.

0

అద్భుతమైన శిల్ప నైపుణ్యం రామప్ప.
** తెలంగాణ వారసత్వ మహత్వానికి దక్కిన ఘన గౌరవం రామప్ప.
** రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.
(ములుగు-విజయం న్యూస్):-

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.శనివారం ములుగు జిల్లాలోని ప్రముఖ దేవాలయం రామప్పను సతీసమేతంగా సందర్శించారు.
ఎనిమిది వందల యేళ్ళ క్రితం ఆకృతి దాల్చిన రామప్పకు యునెస్కో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం గర్వకారణమని చెప్పారు. ఇసుక పునాదులపై ఆలయాన్ని నిర్మించడం, నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని తీర్చిదిద్దడం, శతాబ్దాలు గడిచి పోతున్నా దేవాలయం నిర్మాణానికి వాడిన రాయి నేటికీ రంగు వెలిసిపోకుండా చెక్కు చెదరకుండా కాంతులీనడం, రామప్ప యొక్క విశిష్టత విశ్వవ్యాప్తం కావడానికి ప్రధానపాత్ర వహించాయన్నారు.

పాలంపేటలో రూపుదిద్దుకున్న రామప్ప గుడి అపూర్వమైన శిల్ప సంపదకు నెలవుగా అలరారుతోందని,కాకతీయ రాజుల పాలనకాలంలో రేచర్ల రుద్ర దేవుడు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలున్న ఈ ఆలయం,జాయప సేనాని రాసిన వృత్త రత్నావళికి భూమిక కావడం మరో విశేషమన్నారు.ఈ ఆలయంలోని శిల్ప కళా కృతుల్లో ‘నాగిని’,నవరస సమ్మేళనంగా వీక్షకుల పై చెరగని ముద్రవేస్తుందని, శిల్పాలు,శిల్పి కళ కళ్ళకు కనపడుతున్నాయని వందల యేళ్ళ క్రితమే మన పెద్దలు అపూర్వ సాంకేతిక నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్నారనే వాస్తవం ఋజువైనదని చెప్పారు.ఈ మహోన్నత నిర్మాణం శిల్పిపేరిట రామప్ప గుడిగా ప్రజల పలుకుబడిలో ఉండడం విశేషమని,పేరిణి శివతాండవంగా పేరొందిన వీరనాట్యం ఈ దేవాలయ శిల్పాల్లో దాగి ఉండడం మరో విశేషమని చెప్పారు.ఇన్ని అంశాల సమాహారమైన రామప్పగుడికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడం చాలా సంతోషమని చెప్పారు.

తెలుగు నేలపై గొప్ప గుర్తింపు పొందిన తొలి చారిత్రక కట్టడంగా,రామప్ప పేరు విశ్వవీధుల్లో నేడు మారుమోగుతోందని తెలంగాణలో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో కొలువై ఉన్న రామప్ప ఆలయం నేడు విశిష్ట కట్టడాల సరసన సగర్వంగా చేరడం సంతోషమని చెప్పారు.
యునెస్కో సమావేశంలో రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ హెూదాను కల్పించినట్లు వెల్లడించారు.
మన దేశం నుంచి ఈ గుర్తింపు ఘనతను సాధించిన మహానిర్మాణం మన రామప్ప ఆలయమని హోదా ఇచ్చిన యునెస్కో సైతం ఆ అద్భుత శిల్ప కళాప్రతిభకు ఆశ్చర్యచకితమవుతున్నదని చెప్పారు. రామప్ప గుడికి ప్రపంచ వారసత్వ హెూదా దక్కడం సముచితం. సమున్నతం, సంతోషభరితమన్నారు.ఇది కాకతీయ కళాప్రాభవానికి, తెలంగాణ వారసత్వ మహత్వానికి దక్కిన ఘన గౌరవం. ఈ విభవానికి పునాదులై నిలచినవారు ప్రధానంగా ఇద్దరు మహనీయులు.మహాశిల్పి రామప్ప,కాకతీయ రేచర్ల రుద్రుడు (రేచర్ల రుద్రసేనాని)లను గుర్తు చేసుకున్నారు.

ఎనిమిది వందల సంవత్సరాల క్రితం.కాకతీయ రేచర్ల రుద్రుడు కట్టించిన మహానిర్మాణంలోని అద్భుతాలకు మూలపురుషుడు మహాశిల్పి రామప్ప,అది రామలింగేశ్వర (రుద్రేశ్వర) దేవాలయం అయినప్పటికీ,రామప్ప గుడిగా,ఆ వహించడం అబ్బురం కలిగించే విశేషమని చెప్పారు.పేరుతోనే ఘనత ఈ కోవెల అణువణువూ సొగసు సోయగాలకు నెలవు. అత్యంత కీలకమైన ద్వారబంధాలు,స్థంభాలు, పైకప్పు,నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు అత్యంత కఠినమైన నల్లశానపు రాయుని (బ్లాక్ డోలరైట్) వాడారని చెప్పారు. ఆలయ నిర్మాణంలో ఎర్ర ఇసుకరాయిని వినియోగించుకున్నారని, దాదాపు ఆరడుగుల ఎత్తుతో నక్షత్రాకారపు ఉపపీఠం (ప్రదక్షిణ పథం)ఏర్పాటుచేసి, దాని మీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు.

ఇదే విలక్షణం. పైకప్పుపై రాతిచూరు ఏర్పాటుచేయడం వల్ల వాననీళ్లు దూరంగా ఎగసి పడతాయి.నాట్యగణపతి, సాయుధులైన యోధులు, భటులు, భైరవుడు, మల్లయుద్ధ దృశ్యాలు, నృత్యభామలు, వాయిద్యకారులు, వేణుగోపాలుడు,నాగిని, సూర్య,శృంగార శిల్పాలు కనువిందు చేస్తాయి. ఆలయంలోని భారీ రాతి స్థంభాలు,శిల్పాలు అద్దంలాంటి అందంతో మెరిసిపోతుంటాయి. ఇలాంటివి ఎన్నో అడుగడుగునా శిల్ప చిత్ర కళాశోభతో కళకళలాడుతూ ఉంటాయి.నంది కోసం ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించారు.గర్భాలయంలోకి ప్రవేశించే ముందు గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహం విశిష్ట కళానిపుణతకు దర్పణం.ఆ విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు వినిపిస్తాయి. భారీ గండ శిలలు,శిల్పాలు, నగిషీలు ఉపయోగించడం వల్ల బరువు పడకుండా,నీటిపై తేలియాడే ఇటుకలను శిఖర నిర్మాణంలో వాడారు.ప్రపంచ నిర్మాణాలలో ఈ తరహా నిర్మాణ రచన ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా చెయ్యలేదు.
తెలంగాణ చారిత్రక వైభవానికి,ఆధ్యాత్మిక సంస్కృతికి పూర్వవైభవం తెచ్చేందుకు
రామప్పగుడికి దక్కిన యునెస్కో విఖ్యాతిని ఎల్లరూ గుర్తించి అభినందిస్తున్నారు.

రామప్ప సందర్శనకు విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులకు హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, హై కోర్ట్ న్యాయవాదులు ఉజ్జల్ భూయన్,రాజశేఖర్ రెడ్డి, వరంగల్ పి.నవీన్ రావు,జిల్లా 9వ అదనపు జిల్లా జడ్జి అనిల్ కుమార్,జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ మహేష్ నాధ్, ములుగు జూనియర్ సివిల్ జడ్జ్ రామచందర్ రావు,
జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మహముబాబాద్ పార్లమెంట్ సభ్యులు కవిత,ములుగు శాసన సభ్యులు సీతక్క, ప్రణాళిక సంగ ఉపాధ్యక్షులు వినోద్,రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్,అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి,డిఆర్వో రమాదేవి, వెంకటాపూర్ తసిల్డార్ మంజుల తదితరులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.శ్రీ రామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.ఆయల అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య,ములుగు తహసిల్దార్ సత్యనారాయణ, తాడ్వాయి తహసిల్దార్ శ్రీనివాస్,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

also read :-కాట శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ…