Telugu News

ధాన్యం కొనాల్సిన వారు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది.

** గల్లీ, ఢిల్లీ ధర్నాలతో రైతులకు ఒరిగేది ఏంటి

0

ధాన్యం కొనాల్సిన వారు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది.

 

** గల్లీ, ఢిల్లీ ధర్నాలతో రైతులకు ఒరిగేది ఏంటి

 

** మోడీ, కేసీఆర్… రైతుల జీవితాలతో రాజకీయాలొద్దు

 

** కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తూర్పారబట్టీన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

 

** విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి

 

** ఇలాంటి వారి కోసమే పాదయాత్ర చేస్తున్న

 

** మహాత్మ జ్యోతిరావు పూలే కు ఘన నివాళి

(బోనకల్/ఖమ్మం; విజయం న్యూస్);-

వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన పాలకులు అధికారంలో ఉండి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేస్తుంటే …. కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ తెలంగాణ గల్లీలల్లో ధర్నాలు చేయడం సిగ్గుచేటుగా ఉందన్నారు. 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అధికారంలో ఉన్న పాలకులు ధర్నాలు చేయడం ఇప్పటి వరకు చూడలేదన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యతను విస్మరించి, ధాన్యం కొనుగోలు చేయడం తమతో కాదని చేతులెత్తేసిన టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు పాలకులుగా ఉండడం దౌర్భాగ్యం అని దుయ్యబట్టారు. సోమవారం బోనకల్ మండల కేంద్రంలోని సాయిబాబా గుడి నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రను ప్రారంభించారు. బోనకల్ రైల్వే బ్రిడ్జి మీదుగా రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాల్లో (సుమారుగా 12 కిలోమీటర్లు) పాదయాత్ర కొనసాగింది.

also read :-సీఎం కేసీఆర్ ఓ ఊసరవెల్లి

రాత్రి రామాపురంలోని నల్లమోతు సత్యనారాయణ ఇంట్లో బస చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వరి ధాన్యం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఉంటాయా? లేక పాకిస్తాన్, అమెరికా ప్రభుత్వాలు వచ్చి కొనాలా? అసలు ధాన్యం కొనాల్సింది ఎవరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. మోడీ కేసీఆర్ లో ఆడుతున్న రాజకీయ రాక్షస క్రీడ లో రైతులను సమిధలు చేయోద్దని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కాకపోవడంతో ఇప్పటికే రాష్ట్రంలో దళారులు, మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

also read :-తెలంగాణ ధాన్యం త‌ప్ప‌క కొనాల్సిందే!

మద్దతు ధర కంటే దళారులు రైతుల నుంచి క్వింటాకు ఆరువందల రూపాయలకు తక్కువగా వరి ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ కెసిఆర్ రాజకీయ డ్రామాలు బందు చేసి వెంటనే దాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడం సరికాదన్నారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కొనుగోలు చేసి ఆ తర్వాత కేంద్రం తో యుద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమై ధాన్యం మార్కెట్ కు వస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనకుండా జాప్యం వహిస్తే రైతుల ఆగ్రహాన్ని వాళ్లు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి అయినా వరి ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడవద్దు అని సూచించారు.

డెవలప్మెంట్ చార్జీల బాదుడు ఏంటి

నిత్యావసర ధరలు పెంచి బిజెపి ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుంటే.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా
తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్ పేరిట కరెంటు చార్జీలను పెంచి ప్రజలపై భారాలు మోపడం అన్యాయమని అన్నారు. బోనకల్లు మండల కేంద్రానికి చెందిన మర్రి చిన్నం వెంకులుకు నెలకు 450 రూపాయల కరెంట్ బిల్లు రాగా, ఈ నెల 12వేల కరెంటు బిల్లు వస్తే ఎలా చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఇదేవిధంగా పేదల పైన కరెంటు చార్జీల భారం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెంచిన కరెంటు ఛార్జీలను, డెవలప్మెంట్ పేరిట వేస్తున్న అదనపు చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.

* ఇలాంటి వారి కోసమే నా పాదయాత్ర

బోనకల్ ఎస్టీ కాలనీకి చెందిన మోతిలాల్ రమ పాదయాత్రకు ఏదురొచ్చి ఒకే ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నామని, పిల్లలు, పెద్దలం కలిసి మొత్తం 15 మంది ఒకే ఇంట్లో ఉండటం చాలా ఇబ్బందిగా ఉందని, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ చంటి పిల్లల తో కాలం వెళ్లదీస్తున్నామని, గత ఎనిమిది సంవత్సరాలుగా వందల సార్లు దరఖాస్తు చేసుకున్నా ఇల్లు ఇవ్వడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముందు విలపిస్తూ తన గోడును వెళ్లబోసుకున్నది.

also read :-తెలంగాణ ధాన్యం త‌ప్ప‌క కొనాల్సిందే!

అదేవిధంగా మిర్చి కాలంలో పనిచేసిన వ్యవసాయ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మూడు సంవత్సరాలుగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఇవ్వడంలేదని దొంతి సరస్వతి, నాలుగు సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వడం లేదని వల్లపురం హేమ, కోటేశ్వరరావులు తమ సమస్యలను చెప్పుకున్నారు. బీటెక్ చదివిన నిరుద్యోగి అనూష ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది. ఇలాంటి పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాను పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్నాని ఆయన తెలిపారు. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అసెంబ్లీలో ప్రజల గొంతుక ప్రభుత్వాన్ని నిలదీసి సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వంతో పోరాడి సాధిస్తానని వారికి భరోసా ఇచ్చారు.

బోనకల్లులో భట్టి పాదయాత్రకు సిపిఐ సంఘీభావం

ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సోమవారం బోనకల్లు మండల కేంద్రంలో సిపిఐ నాయకులు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, జిల్లా కమిటీ సభ్యులు తోట రామాంజనేయులు, మండల సహాయ కార్యదర్శి పవన్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి జగ్గా నాగభూషణం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రకు వెల్ కమ్ చెప్పారు. సీఎల్పీ నేత విక్రమార్క అడుగులో అడుగులు వేస్తూ పాదయాత్రలో కదం తొక్కారు.

సాయిబాబా ఆలయంలో భట్టి దంపతుల పూజలు

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు ప్రజా సమస్యల పరిష్కారం కొరకై చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సోమవారం బోనకల్లు మండల కేంద్రంలోని సాయిబాబా గుడి నుంచి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా సాయిబాబా, నవదుర్గాదేవి ఆలయాల్లో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. దైవ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

మహాత్మ పూలేకు నివాళి
మహాత్మా జ్యోతిరావు పూలే 195 జయంతి సందర్భంగా బోనకల్ మండల కేంద్రంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాళ్ళు అర్పించారు.