Telugu News

దేశాన్ని అమ్ముతున్న మోడీ షాలు

== దేశ సంపదను కొల్లగొడుతున్న తామర, గులాబీ పాలకులు

0

దేశాన్ని అమ్ముతున్న మోడీ షాలు

== దేశ సంపదను కొల్లగొడుతున్న తామర, గులాబీ పాలకులు

== వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతున్న మోడీ, కేసీఆర్

== చూస్తూ ఊరుకుంటే మనల్ని కూడా నిలువున అమ్మేస్తరు

== పెట్రో, గ్యాస్ ధరలు తగ్గించకపోతే వాటితోనే ప్రజలు తగలేడతరు

== కేంద్ర రాష్ట్ర సర్కార్ ల పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్

== పీసీసీ నేతల సంఘీభావం.. పాదయాత్రలో హాజరు

(చింతకాని/ఖమ్మం-విజయంన్యూస్);-

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్ముతున్న మోడీ, అమిత్ షాలు ప్రజలు మౌనంగా ఉంటే దేశాన్ని కూడా అమ్ముతారని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. పత్తి పంటను గులాబీ పురుగు, మిర్చి పంటను తామర పురుగు పీల్చిపిప్పి చేసినట్టే, కేంద్రంలోని తామర పువ్వు బిజెపిపార్టీ, రాష్ట్రంలోని గులాబీ రంగు పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను పీల్చిపిప్పి చేసి ఆర్థిక సంపదను కొల్లగొడుతున్నాయని దుయ్యబట్టారు.

ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారం చింతకాని మండలం చిన్న మండవ, తిమ్మినేనిపాలెం, తిరుమలాపురం, నాగులవంచ గ్రామాల్లో జరిగింది. ఈ సందర్భంగా జనాలు రోడ్లపైకి వచ్చి పాదయాత్రకు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. మహిళలుల మంగళ హారతులు పట్టి ఆహ్వానం పలికారు. యువత కేరింతలు కొడుతూ దారి పొడవునా బంతి పూల వర్షం కురిపించారు. డప్పు వాయిద్యాలు ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాలు, మహిళలకు కోలాట నృత్యాలు జనాలను హుషారెత్తించాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభలలో భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ

also red :-గద్వేల్ లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత

వ్యవసాయ రంగాన్ని కావాలనే ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లు సంక్షోభంలోకి నెడుతున్నారని ఆరోపించారు. బడా వ్యాపారులు కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పచెప్పే కుట్రలో భాగంగానే ధాన్యం కొనుగోలు చేయమని ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్నాయని మండిపడ్డారు. యాసంగి వరి ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా మెడలు వంచుతామని, రైతులు అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణ పేరిట దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్మేందుకు చూస్తున్న మతఛాందస వాదుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే దేశాన్ని, ప్రజలను కాపాడుతుందని వివరించారు. దేశంలో పేదలు అభివృద్ధి చెందడం కోసం కాంగ్రెస్ పార్టీ అనేక సంస్కరణలు తీసుకువచ్చి అండగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాంగ్రెస్ పాలకులు కష్టపడి సృష్టించిన జాతి సంపదను విచ్చిన్నకర శక్తుల అమ్మకానికి పెడితే కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉందని అన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వకుండా, విద్య, వైద్యం, అందించకుండా, వంతెనలు నిర్మించకుండా, ఇస్తామని ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, రుణమాఫీ అమలు చేయకుండా, పంట నష్టపరిహారం చెల్లించకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రాబడిని కొల్లగొడుతున్నరని ధ్వజమెత్తారు. పావలా వడ్డీ రుణాలు సైతం ఇవ్వకుండా మహిళలను మోసం చేసి తెలంగాణ అభివృద్ధి చేశామని టిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో వైన్స్ దుకాణాలను పెంచి అభివృద్ధి చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకుల తీరును ఎండగట్టేందుకు, ప్రజాసమస్యల పరిష్కారం కొరకై పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నని, ఇది ఎన్నికల యాత్ర కాదని స్పష్టం చేశారు.

== తిమ్మినేని పాలెంలో గుండెల నిండా ప్రేమతో

చింతకాని మండలంలోని తిమ్మినేని పాలేంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఆ ఊరి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారి స్వాగతానికి దాసుడైన భట్టి విక్రమార్క మాట్లాడుతూ గుండెల నిండా ప్రేమతో నా పాదయాత్రకు స్వాగతం పలికిన తిమ్మినేని పాలెం గ్రామ ప్రజలకు ధన్యవాదాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా మొద్దు నిద్రలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాని తెలిపారు. 8 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి… ఇల్లు, ఫించన్, ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు, కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్పా ఈ గ్రామంలో టిఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. విద్యుత్ ధర పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, మోడీ పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 9 రకాల రేషన్ సరుకులు ఇస్తే.. ..

also read :-కేసీఆర్‌ పాలనలో రూ.4లక్షల కోట్ల అప్పులు

బంగారు తెలంగాణలో 18 సరుకులను ఇవ్వాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సరుకులను బంద్ చేసి పేదల కడుపు కొడుతుందని దుయ్యబట్టారు. ఒక రైతు చెప్పాడు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెసల విత్తనాలు సబ్సిడీ లో ఇచ్చే వారు, ఈరోజు అవి ఇవ్వట్లేదు ..గిట్టుబాటు ధర కూడా కల్పించలేదని చెప్పడం జరిగిందన్నారు. ఒక్కొక రైతు ఒక్కొక బాధ చెపుతున్నారని, పత్తిని గులాబీ పురుగు,మిర్చిని తామేర పురుగు నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే గులాబీ పార్టీ పాలకులు రాష్ట్రాన్ని, తామర పువ్వు పార్టీ పాలకులు దేశాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తల పైన ఉన్నదని పిలుపునిచ్చారు.

also read :-ఆహ్లాదంగా ఖమ్మం హైటెక్ బస్ స్టాండ్

ఊరకుంటావుంటే మనల్ని కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిలువునా అమ్మెస్తారని, అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా పోరాడాల్సిన అవసరం, మనజీవితాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. పేదవాడికి అండగా సంస్కరణ లు చేసిన కాంగ్రెస్ మాత్రమే ఈ దేశాన్ని,దేశ ప్రజలను కాపాడుతుందన్నారు. లేకుంటే మోడీ,అమిత్ షా ఈ దేశాన్ని అమ్మడమే కాకుండా మనల్ని కూడా నిలువున అమ్మెస్తారని, యువత మేలుకో..తస్మత్ జాగ్రత్తగా ఉండి అమ్మడానికి వచ్చిన వారిని మనమే అమ్మెయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.

== పీసీసీ నేతల సంఘీభావం

పీసీసీ కార్యదర్శులు శివకుమార్, మహమ్మద్ అయూబ్, వరంగల్ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లే రాహుల్ రెడ్డి, వర్ధన్నపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నెమల్ల శ్రీనివాస్,హసన్ పర్తి నియోజకవర్గ నాయకులు రవీందర్, హనుమకొండ ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ గంగారపు నాగరాజులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు శుక్రవారం చింతకాని మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చేరుకొని మద్దతు ప్రకటించారు.

== పెద్దపల్లి ఒగ్గుడోలు కళాకారుల సంఘీభావం

పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగ పల్లి గ్రామానికి చెందిన ఎల్ల బోయిన రమేష్ ఆధ్వర్యంలో ఒగ్గు డోలు కళాకారులు 17మంది శుక్రవారం చింతకాని మండలం తిమ్మినేనిపాలెం లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిర్వహించిన పాదయాత్ర వద్దకు వచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాకారులు తొమ్మిది రకాల విన్యాసాలు చేసి పాదయాత్రలో ఉత్తేజాన్ని నింపారు. ఒగ్గుడోలు కళాకారులు గుర్రం, కమాన్, అడ్డవెలుగు, జెండా, తొట్టి, బొంగరం, శివ అవతారం తదితర విన్యాసాలు ప్రదర్శించి ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారు. డోలు కళాకారులతో భట్టి విక్రమార్క డోలు వాయించి పాదయాత్రలో జోష్ ను పెంచారు.