Telugu News

పెట్రోల్‌, గ్యాస్ ధ‌ర‌ల పెంపుకి… కేంద్రంపై భ‌గ్గుమ‌న్న ప్ర‌తిప‌క్షాలు

టీఆర్ఎస్ స‌హా టీఎంసీ, డీఎంకే లోక్‌స‌భ నుంచి వాకౌట్‌

0

పెట్రోల్‌, గ్యాస్ ధ‌ర‌ల పెంపుకి… కేంద్రంపై భ‌గ్గుమ‌న్న ప్ర‌తిప‌క్షాలు

టీఆర్ఎస్ స‌హా టీఎంసీ, డీఎంకే లోక్‌స‌భ నుంచి వాకౌట్‌

మోడీ సర్కారు నిరంకుశ పోకడలపై ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు తీవ్ర ఆగ్ర‌హం

 (ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

పెట్రోల్‌, డీజీల్‌, వంట గ్యాస్ ధ‌ర‌ల పెంపుకి కేంద్రంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు భ‌గ్గుమ‌న్నాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో కేంద్ర స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. పెంచిన ధ‌ర‌లు త‌క్ష‌ణ‌మే త‌గ్గించాల‌ని డిమాండ్ చేశాయి. ఉద‌యం స‌భ ప్రారంభంగా కాగానే స‌భ నుంచి త‌న నిర‌స‌న తెలిపేందుకు టీఆర్ఎస్ స‌హా టీఎంసీ, డీఎంకే స‌భ్యులు వాకౌట్ చేశారు. సామాన్య ప్ర‌జానీకంపై భారాలు మోపడం స‌రికాద‌ని పేర్కొన్నారు. దాంతోపాటు, ప‌లు అంశాల‌కి సంబంధించి రాష్ట్రాల‌పై పెత్త‌నం ప్ర‌ద‌ర్శిస్తున్న మోదీ స‌ర్కారు నిరంకుశ విధానాల‌పై మండిప‌డ్డారు. పెద్ద ఎత్తున నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో స‌భ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో తీవ్ర గంద‌గోళపూరిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌తిప‌క్ష పార్టీల నిర‌స‌న‌లు, నినాదాలు, ఆందోళ‌న‌ల న‌డుమ‌నే స్పీక‌ర్ ఓంబిర్లా స‌భ‌ను కొన‌సాగించ‌డంతో స‌భ్యులు ఆగ్ర‌హించి, వాకౌట్ చేశారు.

also read :-పోదం పావే బిడ్డో సర్కార్ కూసుమంచి దవఖానకు

 సామాన్యులపై భారాలు… రాష్ట్రాల‌పై పెత్త‌నం స‌రికాదుః ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఒక‌వైపు పెట్రోలియం ఉత్ప‌త్తులు, గ్యాస్ ధ‌ర‌లు, వంట నూనెల రేట్లు పెంచుతూ సామాన్య ప్ర‌జానీకంపై భారాలు… రాష్ట్రాలు సొంత వ‌న‌రుల‌తో పంట‌లు పండిస్తున్నా కొన‌కుండా చేస్తూ ఇబ్బందుల‌కు గురి చేయ‌డం స‌రికాద‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భ ప‌క్ష నేత, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వ‌రరావు పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద‌న్న పాత్ర పోషించాల‌ని, రాష్ట్రాల‌ను తొక్కి పెట్టే ప‌నులు హ‌ర్ష‌ణీయం కాద‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా రాష్ట్ర ప్ర‌భుత్వం కోరుతున్న డిమాండ్ల‌పై దృష్టి సారించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. లేనిప‌క్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు.