Telugu News

వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి

** ధనిక రాష్ట్రంలో రూ.11 వేల కోట్లు లేవా..?

0

వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి

** ధనిక రాష్ట్రంలో రూ.11 వేల కోట్లు లేవా..?

** ధరల పెంపుపై సర్కారుతో సమరమే

** కేంద్ర మంత్రివి అడ్డగోలు అబద్ధాలు

** దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా?

** పాదయాత్రలో కేంద్రరాష్ర్టాలను ప్రశ్నించిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క

** మొక్కజొన్న చేను కి వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్న భట్టి

** భట్టి పాదయాత్రకు అశేష జనవాహిని

(చింతకాని/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రంలో పండే ధాన్యం పంటను తెలంగాణ ప్రభుత్వం కొనలేదా..? ధనికరాష్ట్రంలో రూ.11వేల కోట్లు లేవా..? అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు తెలంగాణ బీజేపీ ఎంపీలు అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ తరువాత కేంద్రంతో యుద్ధం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కొరకు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం చింతకాని మండలం నేరడ, గంగమ్మ దేవాలయం, కోమట్లగూడెం, నాగలిగొండ, పొద్దుటూరు గ్రామాల్లో కొనసాగింది.

also read;-మొక్కజొన్న చేలకు వెళ్లి రైతులను కలిసిన భట్టి

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సిపిఐ తెలుగుదేశం కార్యకర్తలు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి తెలంగాణలో ఎందుకు కొనడం లేదని నిలదీశారు. తెలంగాణ దేశంలో అంతర్భాగం కాదా అని మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధాన్యాన్ని కేంద్రం కొనక్కుంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కొనుగోలు చేసి ఆ తర్వాత కేంద్రంపై యుద్ధం చేయాలన్నారు. అందుకు తెలంగాణలోని అన్ని పక్షాలు సహకరిస్తాయని తెలిపారు. కేంద్రం కొనుగోలు చేయడం లేదనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి రైతులను మభ్య పెట్టడం కోసం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

also read;-అంగరంగ వైభవంగా యాదాద్రి ఆలయం ప్రారంభం..

అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజల సమస్యను పరిష్కరించాల్సిన పాలకులు రాస్తారోకోలు ధర్నాలు చేస్తే రైతులకు కలిగే ప్రయోజనం ఏంటని అడిగారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద 12 వేల కోట్ల రూపాయలు లేవా అని ప్రశ్నించారు. లక్షల కోట్లు వెచ్చించి ప్రాజెక్టులు కట్టామని ప్రగల్భాలు పలుకుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని సూచించారు. రైతుల జీవితాలతో రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు.

** కల్తీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, మిర్చి ,మొక్కజొన్న పంటలను సాగు చేయాలని ప్రచారం చేసిన పాలకులు కల్తీ విత్తనాలు అరికట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతులు ఈ ఏడు చాలా తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. కల్తీ విత్తనాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలను తీవ్రతరం చేయనున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెంచడం వల్ల ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరల పై పడిందని అన్నారు. దీంతో సామాన్యులు, పేదలు మూడు పూటలా తిండి తినే పరిస్థితి లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా కరెంటు చార్జీలను పెంచి ప్రజల పై తీరని భారం మోపిందని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ, ప్రతి ఊరిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నగర కమిటీ అధ్యక్షుడు ఎండీ. జావీద్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, మొక్కాశేఖర్ గౌడ్, బొడ్డుబొందయ్య, దొబ్బల సౌజన్య, యడ్లపల్లి సంతోష్, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, పెండ్ర అంజయ్య, అజయ్ బాబు, రాందాసునాయక్, బుల్లెట్ బాబు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, మధిర మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, జెర్రిపోతుల అంజని, బచ్చలకూర నాగరాజు, యడవల్లి నాగరాజు, బోయిని వేణు, తదితరులు హాజరైయ్యారు.