కార్మిక, కర్షకులకు మేడే శుభాకాంక్షలు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
(ఖమ్మం-విజయం న్యూస్);-
రాష్ట్రంలో పనిచేస్తున్న కార్మికులకు, కర్షకులకు, అసంఘటిత కార్మికులకు, వ్యవసాయ కూలీలకు, ఉద్యోగులకు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క 136వ మేడే (అంతర్జాతీయ కార్మిక దినోత్సవ) శుభాకాంక్షలు తెలిపారు. ఈ దేశాన్ని దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలను, చట్టాలను తీసుకు వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వము నాలుగు కార్మిక కోడ్ లను మార్చడానికి చేస్తున్న కుట్రలను మేడే స్ఫూర్తితో కార్మికులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీతో కార్మికులు కలిసిరావాలని కోరారు. కార్మిక హక్కుల సాధన, కార్మిక చట్టాల అమలు కాంగ్రెస్ అధికారంలోకి రావడం తోనే సాధ్యం అవుతుంది అని అన్నారు.
also read :-లారీ ఢీ కొనడంతో నలుగురికి గాయాలు: ఒకరి పరిస్థితి విషమం…
గ్రామాల్లో వలసలు నివారించడానికి యూపీఏ చైర్ పర్సన్ గా కొనసాగిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకువచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఏటా బడ్జెట్లో నిధుల కోత విధిస్తూ వ్యవసాయ కూలీలతో చేయించాల్సిన పనులకు బదులు మెటీరియల్ పనులను ఈ పథకంలో తీసుకువచ్చి కూలీలకు పనులు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ సర్కారు బుద్ధి చెప్పడానికి వ్యవసాయ కూలీలు సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
also read :-పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థలో విజ్ఞాన భాండాగారం
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను దెబ్బతీసిందని ధ్వజ మెత్తారు. కార్పొరేట్ శక్తుల అయినా అంబానీ ఆదానీలకు ఈ దేశ సంపదను దారాదత్తం చేయడానికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను చట్టాలను సైతం బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్న దని దుయ్యబట్టారు. కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి కార్మికులను సంఘటిత ఉద్యమాలు నిర్వహించాలని కోరారు