పొలిటికల్ అట్రాక్షన్ పొంగులేటి
జేజేలు అందుకుంటున్న జనహృదయ నేత
పినపాకపై ఎందుకంత గురి
(ఖమ్మం విజయం న్యూస్):-
ఎక్కడ తగ్గాలో కాదు. ఎక్కడ నెగ్గాలో కూడా మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాగా తెలుసు. అవమానం చవిచూసిన చోటే అఖండ ఆదరణ పొంది దటీజ్ పొంగులేటి అని నిరూపించుకున్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిథిలోని కరకగూడెం, పినపాక మండలాల్లో జరిగిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన అభిమానులు ఆశించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది. పొంగులేటి పర్యటనకు పోవద్దు అంటూ గులాబీ నేత హుకూం జారీచేసినా కార్యకర్తలు గుంపులుగా వెళ్ళి పొంగులేటి పట్ల కొండంత అభిమానం చూపించడం గమనార్హం. పినపాకలో పొంగులేటి శీనన్న పట్టున్న నాయకుడని మరోమారు రుజువైంది.
పినపాక నియోజకవర్గంలో గెలుపు, ఓటమిలను ప్రభావితం చేయగల నాయకుడనే చర్చ రాజకీయ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ అనుకూల, ప్రతికూల పరిస్థితులను అంచనా వేయగల సమర్థత కలిగిన ఆయన ఏ విషయంలో తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేయడంలో దిట్ట. ఆ క్రమంలోనే అభిమానుల బలం, ప్రజాదరణ అధికంగా ఉన్న పినపాక నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఈసారి తన అనుచరుడిని అసెంబ్లీకి పంపాలనే పట్టుదల, కసి కనిపిస్తోంది.
also read :-బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ..
నమ్మిన వారికి భరోసానిచ్చే నేత
కష్టమొచ్చినా, నష్టమొచ్చినా అధైర్య పడకండి. అండగా ఉంటానంటూ కార్యకర్తలకు భరోసా కల్పించి నడిపించే నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అభిమానులు నమ్ముతారు. అందుకే జనం ఆయన పర్యటనలో ప్రవాహంలా పాల్గొని వెన్నంటే నడుస్తారు. పదవుల దర్పం కంటె ప్రజాభిమానమే ముఖ్యమని నమ్మే పొంగులేటి జనహృదయ నేత అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. పలకరింపులు, పరామర్శలు, ఆర్థిక సహాయం చేస్తూ తనదైన శైలిలో ఆత్మీయతని పంచే పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజమైన ప్రజా నాయకుడు అనేది జనవాక్కు. ఆయన టీఆర్ఎస్‌లో కొనసాగినా లేదా భవిష్యత్తులో మరో పార్టీ జెండా పట్టుకున్నా ఆయన అభిమానులంతా వెన్నంటే నడుస్తారనేది యధార్థం. ఆయన ఎటువైపు అడుగులు వేస్తే తమ అడుగులు అటువైపే అని అభిమానులు చెప్పడం పొంగులేటికి ఉన్న ప్రజాదరణకు నిదర్శనం. అందుకే ఆయన ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయనే కీలకం అనేది జనాభిప్రాయం. అందుకే అందరి చూపు ఇపుడు పొంగులేటిపై పడింది. ఆయన తీసుకొనే నిర్ణయాలపైనే ఆసక్తి నెలకొంది.