ఉగాది తరువాత కేంద్రానికి వణుకే : మంత్రి పువ్వాడ
★ రైతులను పట్టించుకునే స్థితిలో కేంద్రం లేదు
★ ఉగాది తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి
★ తీవ్ర పరిణామాలుంటాయని మంత్రి హెచ్చరిక
★ బీజేపీ పాలనలో ఆకలి కేకలు పెరిగాయి
★ సీఎం కేసిఆర్ పాలనలో సర్వతోముఖాభివృద్ధి
★ కాంగ్రెస్ సహయాంలో తెలంగాణ నుంచి రైతులు వలసబాట
★ టీఆర్ఎస్ సహాయంలో పనుల కోసం తెలంగాణకు వస్తున్న కూలీలు
★ విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
ధాన్యం కొనుగోలు పై కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఉగాది తరువాత కేంద్రానికి టీఆర్ఎస్ అంటే వణుకు పుట్టడం ఖాయమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో రైతుల స్థితిగతులను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఖమ్మం నగరంలోని తెరాస జిల్లా కార్యాలయం నందు మంత్రి అజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ ఆకలి సూచికలో 116 దేశాల్లో సర్వే చేస్తే భారత దేశం స్థానం 101 అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని ధ్వజమెత్తారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల తర్వాత మన దేశం స్థానం ఎక్కడుందో చూసుకోవాలన్నారు.. నాడు ఓ విప్లవ కవి అన్నట్లు ‘అన్నపు రాశులు ఒకవైపు.. ఆకలి కేకలు ఇంకోవైపు’ అని ప్రస్తుతమున్న పరిస్థితి అలానే ఉందని భారతదేశంలో ఆకలి కేకలు పెరిగాయి అని మంత్రి అజయ్ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
also read :-నూతన ఖమ్మం మున్సిపల్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
దశాబ్దాల అరిగోస తర్వాత ఇప్పుడిప్పుడే సన్నబువ్వ తింటున్న తెలంగాణ నిరుపేదల ఆత్మగౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం దెబ్బతీసిందని అన్నారు. వడ్లు వేయండి కేంద్రంతో కొనేలచేస్తానన్న బండి సంజయ్ ఆ దిశగా కృషి చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్ల తెరాస ప్రభుత్వ పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందితే, బీజేపీ పాలనలో దేశం సర్వ నాశనమై, హక్కులను కాలరాసే కుట్ర రాజకీయాలు సాగుతున్నాయని చెప్పారు. హరితవిప్లవం వల్ల పంజాబ్‌లో వరి ఉత్పత్తి పెరిగింది అలాంటి కేంద్ర ప్రోత్సాహం లేకుండానే వరిలో అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని స్పష్టం చేశారు. కేంద్రం తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతుందని రైతులకు మెడమీద కత్తి పెట్టింది కేంద్ర ప్రభుత్వమేనని మంత్రి అజయ్ విమర్శించారు. పంజాబ్‌లో కొన్నట్లే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణలో కేంద్రానిది ముమ్మాటికీ వైఫల్యమేనని కేంద్ర ప్రభుత్వం తన అసమర్థతను ఒప్పుకోవాలన్నారు.
also read :-తుమ్మలకు అడుగడుగున నిరాజనం
ధాన్యం కొనలేమంటున్న కేంద్రం ఎందుకు కొనరో నేరుగా, వివరంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం సమస్యకు పరిష్కారం చూపమంటే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. బాయిల్డ్ రైసు విధానాన్ని కేంద్ర ప్రభత్వమే ప్రవేశపెట్టిందని రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్రానిదేనని తెలిపారు. రైతుల విషయంలో కేంద్రానిది అవకాశవాద ధోరణిలా కనిపిస్తోందని ఒక్కో ప్రభుత్వ సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. ధాన్యం విషయంలో పీయూష్ గోయల్ పచ్చి అబద్దాలు మాట్లాడారని కేంద్రంలోనిది వ్యాపారాత్మక ప్రభుత్వమని వ్యవసాయాధారిత దేశాన్ని పాలించే ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలు దానికి లేకపోవడం దౌర్భాగ్యమని నిప్పులు చెరిగారు. ఇప్పుడు కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమంటే రాష్ట్రంలో పండించే మొత్తం రైస్ తీసుకోమని చెప్పినట్లేనని విమర్శించారు. రాజకీయాల కోసం రైతులను, ప్రజలను భాజపా మోసం చేస్తోందని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు రైతుల పక్షాన పోరాడే సత్తా లేదని దుయ్యబట్టారు.
రైతుల కోసం పార్లమెంట్‌లో పోరాటం చేసేది తెరాస మాత్రమేనని మంత్రి అజయ్ తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతుభీమా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిందని ఇన్ని చేసినందుకు మాది రైతు వ్యతిరేక ప్రభుత్వమా? పండిన ధాన్యం కొనాల్సిన బాధ్యత ఉన్న కేంద్రం నిరాకరించడం దుర్మార్గమన్నారు. రైతుల ఆదాయం 2022 వరకు రెట్టింపు చేస్తామన్న కేంద్రం కనీసం రైతులు పండించిన పంటలను కొనకపోవడం సిగ్గుచేటని ఈ దేశంలో ప్రజలను అన్ని విషయాలలో కేంద్రం మోసం చేసిందని మంత్రి దుయ్యబట్టారు. దశాబ్దాలుగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి రైతులను వలసబాట పట్టించింది కాంగ్రెస్ నాయకులేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో అన్నదాతలకు ఇది స్వర్ణయుగమని మంత్రి కొనియాడారు.
also read;-మంత్రి అజయ్ చొరవతో ఖమ్మం నగరానికి రూ. 49.49 కోట్లు
రైతుల సంక్షేమ కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్ సరఫరా, రసాయన ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు, ఎరువులు, విత్తనాలు కూడా దొరక్క రైతులు పోలీస్ స్టేషన్లలో పడిగాపులు కాసి లాఠీదెబ్బలు తిన్నారని ఆరోపించారు. అన్నదాత మరణిస్తే ఆ కుటుంబాలకు అండగా ఉండాలనే ముందుచూపుతో కేసీఆర్ రైతుబీమా ప్రవేశపెట్టారని చెప్పారు. ఏడాదికి దాదాపు రూ.60 వేలకోట్ల రూపాయలు వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతామధుసూధన్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, విత్తనాభివద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఆర్ జేసీ క్రిష్ణా, నగరక మిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.