తెలంగాణ ధాన్యం తప్పక కొనాల్సిందే!
—కేంద్రంపై మరింత ఉధృతంగా ఉద్యమం
—ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
( ఖమ్మం విజయం న్యూస్):-
తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎండనక, వాన అనక మరీ కష్టపడి పండించిన వరి పంటను కేంద్ర ప్రభుత్వం తప్పక కొనాల్సిందేనని టీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. లేనిపక్షంలో కేంద్రంపై కేంద్రం పై పోరాటం మరెంత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యం కోనుగోలుపై అవలంభిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ పార్లమెంటరీ సభ్యులతో నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
also read :-మంత్రులకు శాఖలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం
అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి విధించిన డెడ్ లైన్ మేరకు, 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించాలని ఎంపీ నామ నాగేశ్వరరావు సూచించారు. లేదంటే తాము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ నేత దండం పెట్టి మరీ కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారని గుర్తు చేశారు. కేంద్రం ఇప్పటికీ స్పందించకపోతే రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని చెప్పుకొచ్చారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం…. రైతులు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్టు చరిత్రలో లేదని ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ధాన్యం కొనమంటే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజానీకాన్ని నూకలు తినమనటం దారుణం అన్నారు. దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని ఎంపీ నామ చెప్పారు.
also read :-12న బొమ్మలో జాతీయ స్థాయి ఫెస్ట్..
రైతు నిరసన దీక్ష అనంతరం ఢిల్లీలోని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అధికారిక నివాసంలో పలువురు కీలక నేతలు మధ్యాహ్న భోజనం చేశారు. ఆయనతో కలిసి లంచ్ చేసిన వారిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాత మధుసూదన్, రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రీ రవి), డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, టీడబ్ల్యూఆర్డీసీ చైర్మన్ వి ప్రకాష్, ఖమ్మం జిల్లా గ్రంధాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా టి.ఆర్.ఎస్ నాయకులు కనకమేడల సత్యనారాయణ, బాణాల వెంకటేశ్వర్లు, చిత్తారు సింహాద్రి, ఆత్మ కమిటీ చైర్మన్ హరికృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.