Telugu News

కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధం కావాలి

★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు

0

కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధం కావాలి

★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు

(ఖమ్మం విజయం న్యూస్):-

ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో యుద్ధానికి సన్నద్ధం కావాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రైతులకు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రైతులపై వివక్ష మానుకొని వెంటనే వడ్లను కొనుగోలు చేయాలని కేంద్రాన్ని మంత్రి అజయ్ కోరారు.

రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన రెండో విడత ఉద్యమ కార్యాచరణ ప్రకారం ఈనెల 4 నుంచి 11 వరకు రైతుల పక్షాన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసనలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయవంతం చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

దేశంలో ఆహార ఉత్పత్తుల నిల్వలు, ఎగుమతులు, దిగుమతులతో పాటు ధరల పెరుగుదల, నియంత్రణ కేంద్రం ఆధీనంలోనే ఉంటాయని వివరించారు. కేంద్రం ఈ ప్రక్రియను నిలిపివేస్తూ, రైతుల వ్యతిరేక పద్ధతులు అవలంబిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలను దృష్టిలో పెట్టుకొని మూడేండ్లకు సరిపడ ఆహార నిల్వలు ఉంచుకోవాలని ఆహార భద్రత చట్టం నిర్దేశించిదని పేర్కొన్నారు. గోధుమలు, వడ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయని, అవి ఎక్కడ పండినా, తప్పనిసరిగా సేకరించి మిగిలిన ప్రాంతాలకు సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను అస్థిర పరుచాలనే కుట్రతో కేంద్రం ఒకరకంగా, రాష్ట్ర బీజేపీ నేతలు మరో రకంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో దేశీయ అవసరాలు తీర్చడానికి పార్‌బాయిల్డ్‌ రైస్‌ మిల్లులను ఏర్పాటు చేయించింది, ఎక్కువ దిగుబడి కోసం దొడ్డు రకం వడ్లను ప్రోత్సహించింది కేంద్రం కాదా? అని మంత్రి పువ్వాడ అజయ్ ప్రశ్నించారు.

also read :- ధరల పెరుగుదలను నిరసిస్తూ సిపిఎం విన్నూతన నిరసన

తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం ముందుకు రావడం లేదని, ఇదే విషయాన్ని ముందే గ్రహించి రైతులకు ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించినట్టు చెప్పారు. అయితే యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని కేంద్ర మంత్రులు చెప్పడం సరికాదన్నారు. ప్రజల ప్రయోజనాలు పట్టని గుడ్డి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నదని దుయ్యబట్టారు. ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకుల అబద్ధాలకు అంతు లేకుండా పోతున్నదని, తాను మాట్లాడేవన్నీ అబద్ధాలు, అసత్య ఆరోపణలని తెలిసీ పదేపదే అవే వల్లె వేస్తున్నారన్నారు. మొదటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వంపై బట్ట కాల్చి మీదేసే వైఖరి అవలంబిస్తున్నారని మంత్రి అజయ్ ఆరోపించారు.

also read :-కష్టపడి పనిచేసే వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ కచ్చితంగా గుర్తిస్తారు

కేంద్రానికి క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని తీర్మానాలు పంపి నాలుగైదు రోజులైనా దున్నపోతుపై వానపడ్డ చందంగా వ్యవహరిస్తున్నదని, ఉలుకూ పలుకూ లేని కేంద్రం తీరును ఎండగట్టాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయం తీసుకొన్నదని చెప్పారు. తెలంగాణ రైతులను, పౌరులను అవమానించిన ఏవరినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ నెల 4న మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6న జాతీయ రహదారిపై రాస్తారోకో, 7న జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 8న గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం, నిరసన ప్రదర్శన, ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయడం, మున్సిపాలిటీల్లో బైక్‌ ర్యాలీలు, నల్లజెండాలు ఎగురవేయడం, 11న ఢిల్లీలో ప్రజాప్రతినిధుల నిరసన దీక్షలు ఉంటాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.