Telugu News

ఎమ్మెల్సీ నామినేషన్ రాజీ వెనుక మౌనం ఎందుకు..?

ఎన్.ఎస్.యూ.ఐ నేషనల్ కన్వీనర్ జెఆర్ దినేష్ సాగర్.

0

ఎమ్మెల్సీ నామినేషన్ రాజీ వెనుక మౌనం ఎందుకు..?

ఎన్.ఎస్.యూ.ఐ నేషనల్ కన్వీనర్ జెఆర్ దినేష్ సాగర్.

షాద్ నగర్ లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్ కు ఫిర్యాదు

షాద్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జ్ అని చెప్పుకునే వారు ప్రజల ముందుకు రావాలని డిమాండ్

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల స్థానానికి నామినేషన్ వేసిన వ్యవహారాల్లో కాంగ్రెస్ నేత, ఎలికట్ట ఎంపిటిసి కావలి శ్రీశైలం నామినేషన్ ఉపసంహరణ పై కాంగ్రెస్ వర్గాలు ఎందుకు మౌనం వహించారని ఎన్ఎస్ యుఐ నేషనల్ కన్వీనర్ దినేష్ సాగర్ ప్రశ్నించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దినేష్ సాగర్ తో పాటు టిపిసిసి కార్యదర్శి ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ పట్టణ మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మధు సీనియర్ నేత సుధీర్, శ్రీకాంత్ గౌడ్, వంశీ గౌడ్, భాస్కర్, నరేందర్, ప్రవీణ్, అరుణ్, సంతోష్ ,జిజో,సొహైల్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఆదేశాలతో ఆత్మ గౌరవం కోసం అధికార పార్టీని ఎదిరించి నామినేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపిటిసి కావలి శ్రీశైలం మీడియా సాక్షిగా ప్రకటన విడుదల చేశారని అయితే ఒక్క రోజులోనే ఏం జరిగిందో తెలియదు కానీ నామినేషన్ ఉపసంహరించుకోవడం ఎందుకని ప్రశ్నించారు. శ్రీశైలం కు మద్దతుగా పదిమంది కాంగ్రెస్ ఎంపిటిసిలు కూడా మద్దతు పలికి సంతకాలు చేశారని ఈ మొత్తం వ్యవహారంలో షాద్ నగర్ కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.

నామినేషన్ వేసిన ప్రతి నిమిషం నుండి శ్రీశైలం వెంట ఉన్న బడా నాయకులు బుధవారం రాత్రి ఏం చేశారో తెలియదా అని ప్రశ్నించారు. షాద్నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ అని చెప్పుకుని తిరిగే వారి వెనుక చలామణి అవుతున్న వ్యక్తులు కాంగ్రెస్ నాయకులు కొందరు పథకం ప్రకారం నామినేషన్ వేసి గూడుపుఠాణిగా అధికార పార్టీ నాయకులకు అమ్ముడు పోయారని దినేష్ సాగర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో అపఖ్యాతి పాలైందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో శ్రమపడి పార్టీ అభివృద్ధికి పాటు పడుతుంటే ఇలా పార్టీ భవిష్యత్తును సర్వనాశనం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

నామినేషన్ వేసినప్పటి నుండి చివరిదాకా ఎవరెవరు ఏం మాట్లాడారు మీడియా ముందు ఏం చెప్పారు ఆ తర్వాత బుధవారం రాత్రి ఓ ఎంపీకి చెందిన ఫార్మా కంపెనీలో ఏం జరిగిందో అన్ని ప్రజలకు, పార్టీ అధిష్టానానికి వివరిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ కు లిఖితపూర్వకంగా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు దినేష్ సాగర్ స్పష్టం చేశారు. పార్టీకి నష్టం చేస్తున్న వ్యక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ వ్యవహారంలో ఎంతవరకైనా వెళ్తామని దినేష్ సాగర్ స్పష్టం చేశారు. పార్టీ ముసుగులో అధికార పార్టీ నాయకులకు అమ్ముడుపోయిన ఈ వ్యవహారంపై అధిష్టానం పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దినేష్ సాగర్ డిమాండ్ చేశారు.. కేపి