Telugu News

నదులపై కేంద్ర గెజిట్‌తో జల సంక్షోభం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి

0

నదులపై కేంద్ర గెజిట్‌తో జల సంక్షోభం: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

★ త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పూర్తి
(ఖమ్మం ప్రతినిధి-వఇజయం న్యూస్);-

గోదావరి, కృష్ణా నదులను తన పరిధిలోకి తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌తో జల సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కేంద్ర బీజేపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాధీనానికి జారీచేసిన నోటిఫికేషన్‌ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి డిమాండ్‌ చేశారు

నదుల అనుసంధానం పేరుతో, రాష్ట్ర సమ్మతి లేకుండా చుక్కనీరు కూడా తీసుకెళ్లే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఇప్పటికే సీఎం కేసిఆర్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారని మంత్రి చెప్పారు. రాష్ట్ర సమ్మతిని కేంద్రం అతిక్రమించాలని చూస్తే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు వెనుకాడబోమని వెల్లడించారు. చట్టవిరుద్ధమైన చర్యలు తీసుకోవడం ద్వారా కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ర్టాల స్వయం ప్రతిపత్తి, హక్కులను హరిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ నేతల తీరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే చందంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. దమ్ముంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా, నీటి హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీయాలని బీజేపీ నేతలకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సవాల్ చేశారు.

also read;-గ‌త మూడేండ్ల‌లో రైల్వేల్లోని నియామ‌కాలెన్ని: నామా నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 ప్రాజెక్టులను చేపడితే 4 దాదాపుగా పూర్తయ్యాయని ఈ ప్రాజెక్టుల ద్వారా 36 లక్షల 53 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని మంత్రి అజయ్ పేర్కొన్నారు. ఇప్పటికి 7 లక్షల 53 వేల ఎకరాలకు నీరందుతున్నదని గెజిట్‌ ఆదేశాలు పాటిస్తే మొత్తం అన్ని ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.70 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయని ఇప్పటికే 37 వేల కోట్లు వెచ్చించిన నేపథ్యంలో కేంద్రం ఈ ప్రాజెక్టులన్నీ అడ్డుకోవాలని చూస్తోందని, కేంద్రం జలాక్రమణకు ప్రయత్నిస్తుందని మంత్రి అజయ్‌ ధ్వజమెత్తారు.

also read;-సీఏల్పీ నేత భట్టి విక్రమార్క చిట్ చాట్.. .

సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీటిని రైతులకు అందించాలన్న సంకల్పంతో యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా నిర్మాణ పనులను కొనగుతున్నాయని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6,74,387 ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందిస్తామని మంత్రి అజయ్ పునరుద్ఘాటించారు. అలాగే ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లోని నాగార్జునసాగర్‌ చివరి ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వెల్లడించారని మంత్రి గుర్తుచేశారు. కృష్ణానదిలోను మన హక్కును కోల్పోమని దానిని పరిరక్షించుకొనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. సీఎం కేసిఆర్ సూచనల మేరకు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి, చర్చిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.