చర్లలో లొంగిపోయిన మహిళా మావోయిస్టులు
వివరాలు మీడియాకి వెల్లడించిన ఎస్‌పి సునీల్‌దత్
(భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో – విజయం న్యూస్):-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఎస్‌పి సునీల్‌దత్ సమక్షంలో లొంగిపోయారు. మీడియా సమావేశంలో ఎస్‌పి సునీల్‌దత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల మండలం రాళ్ళపురం గ్రామానికి చెందిన ఎల్‌జీఎస్ సభ్యురాలు మూసికి సుఖి @ విమల ( 18 ), చెన్నాపురం గ్రామానికి చెందిన మణుగూరు ఎల్‌వోఎస్ మెంబర్ మడకం ప్రమీల @ పాలె ( 18 ) అనువారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, 141 సీఆర్‌పిఎఫ్ బెటాలియన్ పోలీసుల ముందు లొంగిపోయారు. ముస్కీ సుక్కి @ విమల, మడకం ప్రమీల @ పాలీ అనువారు 14 ఏళ్ళ వయస్సులోనే మావోయిస్టు పార్టీచే బలవంతంగా రిక్రూట్ చేయబడ్డారని ఎస్‌పి తెలిపారు. ఏది మంచిదో ఏది చెడో అనేది అంచనా వేయలేని స్థితిలోనే చాలామంది మైనర్ పిల్లలను మావోయిస్టులు ఇలాగే పార్టీలో బలవంతంగా చేర్చుకున్నారని తెలిపారు.
also read :-టీఆర్ఎస్ ప్లీనరీని విజయవంతం చేయండి
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు ఆజాద్, దామోదర్, రాజిరెడ్డి, మధు వంటివారు పార్టీలో చేర్చుకున్న మైనర్ గిరిజన బాలికలతో వంట చేయించడం, వారి సామాన్లు మోయించడం, బట్టలు ఉతికించడం వంటి పనులు చేయిస్తున్నారని ఎస్‌పి తెలిపారు. పార్టీ మహిళా కేడర్‌తో, పిల్లలతో మావోయిస్టు నాయకులు చెడుగా ప్రవర్తిస్తారని, సీనియర్ నేతలను పెళ్లి చేసుకోమని గిరిజన యువతులను బలవంతం చేయడం, వారిని లైంగికంగా దోపిడి చేస్తున్నారని ఎస్‌పి ఆరోపించారు
మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు దామోదర్ గిరిజన యువతి రజితను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఎస్‌పి ఆరోపించారు. ఆరోగ్యం బాగాలేకుంటే పెద్ద కేడర్‌కి ఒక విధంగా, చిన్న క్యాడర్‌కి మరోవిధంగా చికిత్స అందిస్తారని, మహిళల అనారోగ్య సమస్యల గురించి అసలు పట్టించుకోరని ఎస్‌పి తెలిపారు.
also read :-కాంగ్రెస్ కు పికె హ్యండ్
అందుకే ఈ ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. వీరి మాదిరిగానే మావోయిస్టు నాయకులు, దళ సభ్యులు, మిలీషియా సభ్యులంతా శాంతియుత సమాజ అభివృద్ధిలో భాగమై జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్‌పి విజ్ఞప్తి చేశారు. ఎవరైనా లొంగిపోయి మెరుగైన జీవితాన్ని గడపడానికిగాను వారి బంధువులు నేరుగా పోలీసులను సంప్రదించాలని ఎస్‌పి సునీల్‌దత్ విజ్ఞప్తి చేశారు. ఎస్‌పి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఎస్‌పి రోహిత్ రాజ్, చర్ల సీఐ అశోక్, సీఆర్‌పిఎఫ్ అధికారి ప్రమోద్ పవార్ తదితరులు పాల్గొన్నారు.