Telugu News

కోల్ బెల్ట్ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వెలుగులు

- సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ (పా) ఎన్. బలరాం

0

కోల్ బెల్ట్ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వెలుగులు
– సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ (పా) ఎన్. బలరాం
(భద్రాద్రి కొత్తగూడెం-విజయ తెలంగాణ):

సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వెలుగులు ఇవ్వనున్నామని సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ (పా) ఎన్. బలరాం అన్నారు. చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామపంచాయతీ లో నూతనంగా ఏర్పాటు చేసిన 37 మెగావాట్ల విద్యుత్ సోలార్ పవర్ ప్లాంట్ ను బుధవారం డైరెక్టర్ బలరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 157 ఎకరాల్లో ఈ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ పవర్ ప్లాంట్ ద్వారా లక్షా ఎనభై వేల యూనిట్లు ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. సింగరేణిలో బొగ్గుతో తయారయ్యే విద్యుత్ ను ఆదా చేసేందుకు సోలార్ విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. కొత్తగూడెం కోల్ బెల్ట్ లో 37 మెగావాట్లు, మణుగూరులో 30 మెగావాట్లు, ఎల్లందులో 39 మెగావాట్లు, రామగుండం లో 50 మెగావాట్లు, మందమరి-1, 2లో 28, 15 మెగావాట్లు, ఎన్ టి పి సిలో 10 మెగావాట్లు, భూపాలపల్లి 10 మెగావాట్లు, మరో ఎన్టీపీసీలో 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఇక్కడ జరిగే విద్యుత్ ఉత్పత్తి భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ మైన్ లకు సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రికల్ ఈ అండ్ ఎం సత్యనారాయణరావు మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధిలో భాగంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను సింగరేణి వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ల ద్వారా జరిగే విద్యుత్ ఉత్పత్తిని ముందుగా పాల్వంచ సీతారాం పట్నం సబ్ స్టేషన్ కు ఇచ్చి అక్కడ నుండి సింగరేణికి విద్యుత్ సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. బెల్లంపల్లిలో పెనుబల్లి లో సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభానికి కృషిచేసిన ఏరియా జిఎం నరసింహారావును అభినందించారు. అనంతరం ఏరియా జిఎం నరసింహారావు మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, ఆయనను ఆదర్శంగా తీసుకొని సింగరేణి కంపెనీని అభివృద్ధి చేసేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏరియా టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు ఎండీ రజాక్ మాట్లాడుతూ సిరుల తల్లి సింగరేణి అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు చెప్పారు. గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ యూనియన్ ద్వారా కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్తగా కొన్ని హక్కులను సాధించి పెట్టడం జరిగిందని వివరించారు. కార్మికుల సంక్షేమం లక్ష్యంగా తమ యూనియన్ ముందుకు పోతుందని స్పష్టం చేశారు. అనంతరం సింగరేణి డైరెక్టర్లను సోలార్ ఆదాని కంపెనీ బృందం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో ఏరియా సింగరేణి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

దండోర యాత్రలో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క.