Telugu News

కిం..కర్తవ్యం!

0

( విజయం – భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ) :

మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వేడుకలకు సన్నద్ధమైంది…! నేటి నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు…! ఈ మేరకు ఇందుకు సంబంధించి కరపత్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విడిచిపెట్టారు…! మావోయిస్టు అగ్ర నేతలను ఓవైపు కరోనా కాటువేయగా, మరోవైపు అరెస్టులు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఇటీవల కాలంలో పెద్దఎత్తున నష్టపోయింది…! ఈ క్రమంలో పార్టీని  పటిష్టపరచడం పై మావోయిస్టులు ప్రధానంగా దృష్టి సారించినట్లు  తెలుస్తోంది,..! ఈసారి జరిగే పార్టీ ఆవిర్భావ వారోత్సవాల లోనే  మావోయిస్టు నూతన కమిటీ నియామకం జరుగుతుందన్న ప్రచారం కూడా ఉంది…! మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉండగా, వారం రోజుల పాటు జరగనున్న మావోయిస్టు ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఏజెన్సీలో నెలకొంది.  ఇదిలా ఉండగా పోలీసులు అప్రమత్తమయ్యారు…! మన్యం పై గట్టి నిఘా పెంచి మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నట్లు వినికిడి.
  నేటి నుంచి మావోయిస్టు పార్టీ 17 వ వార్షికోత్సవం : 
మావోయిస్టు పార్టీ 17వ వార్షికోత్సవం జరుపుకునేందుకు సమాయత్తమైంది. మంగళవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు మావోయిస్టులు ఆవిర్భావ వారోత్సవాల నిర్వహణకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వెలిసాయి. ఇందులో భాగంగా 27వ తేదీన భారత బందు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మీడియాకు లేఖలు సైతం విడుదల చేయడం జరిగింది. 2004 వరకు పీపుల్స్ వార్ పార్టీ గా ఉండగా అప్పటినుంచి మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించింది. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరగగా, దాని ప్రభావం సమీప తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు లో ఉన్న అటవీ పల్లెల పై ప్రభావం చూపుతూనే ఉంది. భద్రాచలం ఏజెన్సీలో దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు తదితర మండలాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నాయి. నిత్యం మావోయిస్టు కార్యకలాపాలు గతంలో యదేచ్ఛగా  జరగగా…. ఇటీవల కాలంలో కాస్త తగ్గుముఖం పట్టాయి. పోలీసు బలగాలు పెద్ద ఎత్తున ఏజెన్సీలో మకాం పెట్టడం, ఏజెన్సీ చుట్టూ సిఆర్పిఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయటం, పోలీసులు గట్టి నిఘా ఉంచడం తదితర పోలీసు చర్యలు మావోయిస్టుల కదలికలకు కళ్లెం వేయడం జరిగింది.
భద్రగిరి ఏజెన్సీలో హై అలర్ట్ :
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో భద్రగిరి ఏజెన్సీలో హై అలర్ట్ నెలకొంది. పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీసులు మన్యం పై గట్టి నిఘా ఉంచారు. కొత్తగూడెం ఓఎస్డి తిరుపతి దుమ్ముగూడెం, చర్ల పోలీస్ స్టేషన్లను సందర్శించి పోలీసులకు తగిన సూచనలు సలహాలు అందజేయడం జరిగింది.  భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు తదితర మండలాల్లో పోలీసులు గత రెండు రోజులుగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితుల పై ఆరా తీస్తున్నారు. మావోయిస్టు సానుభూతి పరుల కదలికలపై నిఘా పెట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్టీసి బస్సు సర్వీసులను కొన్ని నిలిపి వేయడం జరిగింది.
పార్టీ పటిష్టత పై మావోయిస్టుల చూపు :  
అడవుల్లో ఉండే మావోయిస్టులను కూడా కరోనా కబలించింది. కరోనా మూలంగా పెద్ద ఎత్తున మావోయిస్టులు  నష్టపోయారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి హరి భూషణ్ కరోనా కాటుకు బలయ్యారు. ఇంకా పలువురు మృతి చెందారు. అగ్రనేతలను కరోనా మట్టుబెట్టడం తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు చత్తీస్గఢ్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు,మిలీషియా సభ్యులు లొంగిపోయారు. భద్రాచలం నియోజకవర్గంలో కూడా మావోయిస్టులు, మిలీషియా సభ్యులు పలువురు ఇటీవల పోలీసులకు  లొంగిపోయారు. ఈ పరిణామాలు మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది అని చెప్పవచ్చు. ఈ క్రమంలో జరుగుతున్న మావోయిస్టు పార్టీ 17 వ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ పటిష్టత పై మావోయిస్టులు ప్రధానంగా దృష్టి సారించేందుకు  నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారని ప్రచారంలో ఉంది. కొత్త కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారని తెలుస్తోంది. తద్వారా మళ్లీ తమ ఉనికిని చాటుకోవాలని మావోయిస్టులు తగు వ్యూహరచన పన్నినట్లు ప్రచారంలో ఉంది.