Telugu News

జర్నలిస్టుల రుణం తీర్చుకుంటా: మంత్రి పువ్వాడ

ఖమ్మం ప్రెస్ క్లబ్ కు రూ.40 లక్షల నిధులు ప్రకటించిన ప్రజాప్రతినిధులు

0

జర్నలిస్టుల రుణం తీర్చుకుంటా: మంత్రి పువ్వాడ
— కొత్త ఏడాదిలో మీ కోరిక తీరుతుంది
— ఖమ్మంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి రోల్ మోడల్ గా నిలుస్తా
— ఎమ్మెల్యేలతో కూర్చుని అన్ని నియోజకవర్గాల్లోను కేటాయింపునకు కృషి
— టీఆర్ఎస్ కు టీజేఎఫ్ తో పేగు బంధం
— టీయూడబ్ల్యుజే 3వ మహాసభలో మంత్రి అజయ్
— ఖమ్మం ప్రెస్ క్లబ్ కు రూ.40 లక్షల నిధులు ప్రకటించిన ప్రజాప్రతినిధులు

ఖమ్మం, డిసెంబర్ 18(విజయంన్యూస్):

జిల్లాలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపును నూతన సంవత్సరంలో పూర్తిచేసి విలేకరుల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉద్ఘాటించారు. జిల్లాలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించి జన్మ సార్థకం చేసుకుంటానని ప్రకటించారు. ఆదివారం ఖమ్మంలోని ఎస్సార్ గార్డెన్లో టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన మూడో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా నలు మూలల నుంచి తరలివచ్చిన వెయ్యి మంది జర్నలిస్టుల హర్షద్వానాల నడుమ మంత్రి అజయ్ కుమార్ జర్నలిస్టుల సమస్యలను ఉద్దేశించి ప్రసంగించారు. ఖమ్మంలో ఇప్పటికే జర్నలిస్టుల కోసం 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మాణం అవుతున్నాయని, మరో వంద ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు.

ఇది కూడ చదవండి: “పంచముఖ పోరులో పాలేరు-అభివృద్ధి ని ఆకాంక్షిస్తున్న ప్రజలు”

ఖమ్మంలో ఇళ్ల స్థలాలను కేటాయించి రోల్ మోడల్ గా నిలుస్తానని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కూడా ఈ సమస్యను తన సమస్యగా భుజాన వేసుకుని పరిస్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల ఈ ప్రధాన సమస్య పరిష్కారంపై నేను ఎమ్మెల్యేలందరికీ దిక్సూచిగా నిలుస్తానని పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ఇళ్ల స్థలాల కేటాయింపు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సమక్షంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు.

== టీజేఎఫ్ తో పేగు బంధం..
టియుడబ్ల్యూజే కు టిఆర్ఎస్ తో పేగు బంధం ఉన్నదని మంత్రి అజయ్ కుమార్ అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో తెలంగాణ సారధి కేసీఆర్ కు టియుడబ్ల్యూజే బాసటగా నిలిచిందని గుర్తు చేశారు. ఆ సమయంలో కేసీఆర్ తో కలిసి పోరాడిన అతి కొద్దిమంది ప్రముఖుల్లో అల్లం నారాయణ ఒకరని పేర్కొన్నారు.

== పోరాడి సాధించుకుందాం: అల్లం నారాయణ
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు సమస్య తీవ్రమైనదని, ఇంకా అనేక సమస్యలను పోరాడి సాధించుకుందామని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు ఒకటే కాదని ఎన్నో సమస్యలను సాధించుకున్న ఘనత టియుడబ్ల్యూజే యూనియన్ కు ఉందని ఉద్ఘాటించారు. 2001లో తెలంగాణ జర్నలిస్టుల సంఘం ఏర్పడిందని తెలంగాణ ఏర్పడ్డాక కూడా తెలంగాణలో ఏకైక సంఘంగా నిలిచినది టీయుడబ్ల్యూజే మాత్రమే అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: సిటి బస్టాండ్ గా ‘ఖమ్మం పాత బస్టాండ్’

రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో మన యూనియన్ ఒక చుక్కానిగా నిలిచి, సబ్బండ వర్ణాలను ముందుకు నడిపించిందని గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను జర్నలిస్టుల ఎదుటికీ తీసుకొచ్చినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో తెలంగాణలో 4,000 మందికి రూ.7 కోట్ల నిధిని పంపిణీచేసి వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నది మీడియా అకాడమీ అని గుర్తు చేశారు. దేశంలో మౌలిక తత్వాలను దెబ్బతీసే ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఒక విధంగా చెప్పాలంటే మనం ప్రకటిత ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టులు మెలకువతో వ్యవహరించి అసాంఘిక శక్తుల కుట్రలను బయటపెట్టాలని పిలుపునిచ్చారు.

==ఇళ్ల స్థలాల కేటాయింపు పెద్ద సమస్య ఏమి కాదు:ఎంపీ వద్దిరాజు

జిల్లాలో ప్రధాన సమస్యగా జర్నలిస్టులు పరిగణిస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపు పెద్ద సమస్య ఏమి కాదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరితో ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తే ఈ సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని మంత్రి అజయ్ కుమార్ కు ఆయన సూచించారు. కొత్త సంవత్సరంలో ఇళ్ల స్థలాల కేటాయింపును జర్నలిస్టులకు కానుకగా అందివాలని విజ్ఞప్తి చేశారు.   ఇది కూడా చదవండి:  షర్మిళ నీ బాష మార్చుకో: తాతామధు
== నాలుగు స్తంభాల్లో జర్నలిస్టులే మూలస్తంభం:ఎంపీ నామ
ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు మూల స్తంభంలాంటి వారని ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మీడియా ద్వారానే ఈ సమాజంలో అన్ని విషయాలు ప్రజల చెంతకు చేరుతున్నాయని, అలాంటి కీలక భూమిక వహిస్తున్న మీడియా మిత్రులు నీతి నిజాయితీలే ఆయుధాలుగా ధరించి ప్రజల పక్షాన నిలవాలని సూచించారు.

== మీ శీనన్న ఎప్పుడు మీ వెంటే: మాజీ ఎంపీ పొంగులేటి
జర్నలిస్టులు ఎలాంటి ఆపదలో ఉన్న ఈ శీనన్న మీ వెంటే ఉంటాడని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా బయటపెట్టే సమాజ సేవకులు జర్నలిస్టులని, అలాంటి జర్నలిస్టులకు శ్రీనన్న ఎల్లప్పుడు తోడుగా నిలుస్తాడని తెలిపారు.

== ఆ సమస్యకు మీ వద్ద పరిష్కారం: జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ

జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి జిల్లా ప్రజా ప్రతినిధులే పరిష్కార మార్గం చూపాలని టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నాడు ఆంధ్ర పాలకులతో కొట్లాడిన టియుడబ్ల్యూజే జర్నలిస్టులు ఇప్పుడు సంక్షేమం కోసం కొట్లాడుతున్నారని చెప్పారు. జిల్లాలో 2000 సంవత్సరం తర్వాత ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరగలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న మంత్రి అజయ్ కుమార్ ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రలు..

ఇది కూడా చదవండి: ఆరుగురు సజీవదాహనం

ఈ సమస్యను తమ సమస్యగా భావించి సీఎంతో కొట్లాడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలోని దళిత జర్నలిస్టులకు దళిత బంధు వర్తింపజేసి వారి అభివృద్ధికి దోహదపడాలని కోరారు. ప్రెస్ క్లబ్ నిర్మాణానికి నిధులను కేటాయించాలని, హెల్త్ కార్డుల సమస్యను కూడా పరిష్కరించాలని సూచించారు. టియుడబ్ల్యూజే రాష్ట్ర, జిల్లా నాయకత్వాలని బలహీనపరచాలని కొందరు తీవ్రస్థాయిలో కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రయత్నాలు సూర్యుడుపై ఉమ్మి వేయడం లాంటివేనని హితవుపలికారు.

== కార్పొరేట్ చేతుల్లో మీడియా: – ఎమ్మెల్సీ తాతా మధు
దేశంలో అవాంఛనీయ పోకడ కొనసాగుతుందని, ప్రస్తుతం మీడియా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఎమ్మెల్సీ తాత మధు పేర్కొన్నారు. జర్నలిస్టులు నీతి, నిజాయితీగా వ్యవహరిస్తూ సమాజ ఉద్ధరణకు పాటుపడుతున్నప్పటికీ కొన్ని యాజమాన్యాలు కార్పొరేట్ చేతిలోకి వెళ్లి ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రశ్నార్థకంగా మార్చాయని వాపోయారు. జర్నలిస్టు మిత్రులు అలాంటి పోకడలకు తలొగ్గకుండా ప్రజా పక్షాన నిలవాలని సూచించారు.

== నూతన ప్రెస్ క్లబ్ కు 40 లక్షల నిధులు..

ఖమ్మంలో నూతన ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు విరివిగా తమ నిధులను కేటాయించారు. మంత్రి అజయ్ కుమార్ రూ 10 లక్షల నిధులను కేటాయించగా, ఎంపీ నామా నాగేశ్వరరావు, రూ. 10 లక్షలు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ. 10 లక్షలు, ఎమ్మెల్సీ తాతా మధు మరో రూ. 10 లక్షలు కేటాయించారు.

ముందుగా మహాసభలో కళాకారులు జర్నలిస్టులపై పాడిన పాటలు ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. ఈ మహాసభలో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఖమ్మం నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, టెమ్జూ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకల కళ్యాణ్ చక్రవర్తి, రమణ కుమార్, కవిత విద్యాసంస్థల చైర్మన్ పారుపల్లి ఉషా కిరణ్, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, న్యూ డెమోక్రసీ ప్రజాపందా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, యూనియన్ జిల్లా నాయకులు వెన్నబోయిన సాంబశివరావు, బొల్లం శ్రీనివాస్, చిర్రా రవి, ప్రశాంత్ రెడ్డి, వి. రామకృష్ణ, సంతోష్, ఉపేందర్, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు కల్లోజు శ్రీనివాస్, బాలబత్తుల రాఘవ, గుద్దేటి రమేష్ బాబు, యలమందల జగదీష్, తోట కిరణ్, దానకర్ణ, ప్రేమ్ చంద్, వినోద్, రాజేష్, బాలయోగి తదితరులు పాల్గొన్నారు.