17 లక్షల భారతీయఖాతాలపై వాట్సాప్ నిషేధం..
: భారతీయ యూజర్లకు వాట్సాప్ షాకిచ్చింది. సుమారు 17,59,000 వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, యూజర్స్ నుంచి అందిన ఫిర్యాదులు, వినతులు ఆధారంగా భారత ఐటీ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. ఈ ఖాతాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించామని వాట్సాప్ వెల్లడించింది.
‘‘ 2021 భారత ఐటీ నిబంధనలను అనుసరించి 2021 నవంబరు నెలలో ఆరు నెలలకు సంబంధించి యూజర్ సేఫ్టీ రిపోర్టును పబ్లిష్ చేశాం. ఇందులో యూజర్స్ నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యలు, యూజర్స్ భద్రతకు వాట్సాప్ ముందుస్తుగా తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి’’ అని వాట్సాప్ తెలిపింది. 2021 అక్టోబరులో కూడా సుమారు 2 మిలియన్ ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధించింది. మొత్తంగా 2021లో సుమారు 400 మిలియన్ల భారతీయ ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధించింది.
ALSO READ:-ఐటీ హబ్ దేశానికే అదర్శం
వాట్సాప్‌ను ఉపయోగించే యూజర్స్‌కు భద్రతపరంగా మెరుగైన సేవలందించేందుకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షణ కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలానే త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ ఆధారిత సేవలను పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. వాట్సాప్ నిషేధించిన 95 శాతం ఖాతాలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపింది. వీటిలో స్పామ్ మెసేజ్‌లు, బల్క్ మెసేజ్‌లు పంపే ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలో పేర్కొంది.