బాలుడు సమాధానం.. ఫిదా అయిన కేటీఆర్
** పేపర్ వెస్తూ చదువుకుంటే తప్పైతదా..?
** ఇప్పుడు కష్టపడితే పెద్దైయిన తరువాత సుఖపడతం కదా అన్న బాలుడు..
పేపర్ వేస్తే తప్పెంటీ..? పేపర్ వేస్తే తప్పు అవుతదా..? చిన్న పిల్లవాడినే కానీ పొద్దుగల ఏం చేస్తం.. చదువుకుంటూ పేపర్ వేస్తున్నాను.. ఇప్పుడు కష్టపడితే పెద్దయిన తర్వాత సుఖపడతా..? ఆయన తప్పేమిటి .? అని ఓ బాలుడు ఇచ్చిన సమాధానానికి వీడియో తీసిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఈ వీడియో ఇప్పుడు పెద్ద వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యాడు. పూర్తి వివరాలు చూద్దాం.
(హైదరాబాద్-విజయం న్యూస్)
ఓ వైపు చదువుకుంటూ మరోవైపు ఇంటింటికీ వార్తాపత్రికలు వేస్తున్న విద్యార్థి చెప్పిన సమాధానం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జగిత్యాలకు చెందిన జయప్రకాశ్ అనే విద్యార్థి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ రోజూ ఉదయం ఇంటింటికి వార్తాపత్రికలు వేస్తుంటాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి కుర్రాడి వద్దకు వెళ్లి.. చదువుకునే వయసులో పేపర్లు ఎందుకు వేస్తున్నావ్? అని ప్రశ్నించగానే ‘ఏం పేపర్ వేయొద్దా?’ అని సమాధానమిచ్చాడు. చదువుకునే వయసులో పని చేస్తున్నావు కదా! అని సదరు వ్యక్తి అనగానే.. చదువుకుంటున్నా, పనిచేసుకుంటున్నా.. అందులో తప్పేముందంటూ తిరిగి ప్రశ్నించాడు. ఇప్పుడు కష్టపడితే పెద్దయ్యాక ఏం చేయాలన్నా ఈజీగానే ఉంటుందంటూ స్ఫూర్తిదాయక సమాధానమిచ్చాడు.
ఈ మొత్తం సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో ఆ వీడియో చూసిన మంత్రి కేటీఆర్ కుర్రాడి సమాధానానికి ఫిదా అయ్యారు. ఈ మేరకు ట్విటర్లో ఆ వీడియోను పోస్ట్ చేసి విద్యార్థి జయప్రకాశ్ను అభినందించారు. ‘‘జగిత్యాల పట్టణం నుంచి వచ్చిన ఈ వీడియో చాలా నచ్చింది. ఆ విద్యార్థి ఆత్మవిశ్వాసం చూసి చాలా సంతోషపడ్డా. అతడి ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానంలో స్పష్టత చూసి చాలా సంతోషం అనిపించింది. చదువుతున్న వయసులో పనిచేయడం తప్పేంటని ఆ విద్యార్థి ప్రశ్నించాడు. అతడు భవిష్యత్తులో మంచి స్థితిలో స్థిరపడాలి’’ అని కేటీఆర్ ఆకాంక్షించారు.
జయప్రకాశ్ చెప్పిన సమాధానం, చెప్పేటప్పుడు కనిపించిన ఆత్మవిశ్వాసం ఈ దిగువ వీడియోలో చూసేయండి…