నెరవేరుతున్న యువత పోలీస్ కల
భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
ఇప్పటికే 28,277 పోలీస్ కొలువుల భర్తీ
తాజాగా మరో 18,334 పోస్టులకు అనుమతి
(విజయం న్యూస్):-
పోలీస్ యూనిఫాం వేసుకొని ప్రజలకు సేవ చేయాలనే యువత కలను తెలంగాణ సర్కారు నెరవేరుస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దసంఖ్యలో పోలీస్ కొలువులను భర్తీ చేసింది. తాజాగా మరో 18,334 పోలీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంతో యువతలో ఆనందం వ్యక్తమవుతున్నది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సై, కానిస్టేబుళ్లు కలిపి వివిధ విభాగాల్లో 28,277 పోస్టులను భర్తీ చేసింది. సబ్ ఇన్స్పెక్టర్లు 1,810 మంది, కానిస్టేబుళ్లుగా 26,467 మంది నియమితులయ్యారు. వీరంతా రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
భర్తీ ప్రక్రియలో వేగంగా
తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కొలువుల భర్తీ ప్రక్రియ వేగంగా సాగడం నిరుద్యోగుల్లో భరోసా నింపుతున్నది. తాజాగా ముగిసిన నియామక ప్రక్రియలోనూ మొత్తం 16 వేల మందికి కొవిడ్-19 పరిస్థితుల్లోనూ 12 నెలల శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు. ఒక దశలో నేషనల్ పోలీస్ అకాడమీలో సైతం పోలీస్ శిక్షణ ఆగినా.. మన తెలంగాణ పోలీస్ అకాడమీ.. ఇతర శిక్షణ కేంద్రాల్లో మాత్రం ఆగలేదు. పూర్తిస్థాయి జాగ్రత్తలు పాటిస్తూ 16 వేల మందిని సుశిక్షితులైన పోలీసులుగా తీర్చిదిద్దారు.