Telugu News

ఖమ్మం జడ్పీ సమావేశంలో ప్రశ్నల వర్షం

తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, న్యాయం చేస్తామన్న : జడ్పీ చైర్మన్

0

ఖమ్మం జడ్పీ సమావేశంలో ప్రశ్నల వర్షం

== విద్యాశాఖపై మండిపడిన జడ్పీ సభ్యులు

== తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, న్యాయం చేస్తామన్న : జడ్పీ చైర్మన్

ఖమ్మం, జనవరి 4(విజయంన్యూస్):

జడ్పీలో సభ్యులుప్రశ్నల వర్షం కురిశాయి. సభ్యులు పదేపదే ప్రశ్నలు అడగటంలో స్పందించిన జడ్పీచైర్మన్ తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్, జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు. సమావేశంలో విద్యుత్, గ్రామీణాభివృద్ధి, విద్య, కంటి వెలుగు కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణకు జిల్లాలో 55 బృందాలను ఏర్పాటు చేసినట్లు, 18 జనవరి న ప్రారంభించి, 100 రోజులు పనిదినాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయుటకు కార్యాచరణ చేసినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: పొంగులేటికి  బిగ్ షాక్

ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల్లో 300, పట్టణ ప్రాంతాల్లో 400 మందికి స్క్రీనింగ్ చేయనున్నట్లు ఆయన అన్నారు.  ఏ గ్రామంలో, ఏ ప్రదేశంలో, ఏ రోజున కంటి వెలుగు శిబిరం నిర్వహించేది ముందస్తుగా ప్రజలకు టాం టాం ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ప్రజాప్రతినిధులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.  రాష్ట్రంలో రైతులకు ఉచిత 24 గంటల విద్యుత్ సరఫరాకు 5 సంవత్సరాలు అయిందని అన్నారు.  లూజ్ వైర్, రోడ్ల నిర్మాణం సందర్భంగా విద్యుత్ స్తంభాల విషయమై చర్యలు తీసుకోకపోవడంతో రోడ్ల మధ్యలో స్తంభాలు వస్తున్నాయని వీటిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. వైకుంఠదామాల్లో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన విద్యుత్ సమస్యలపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ కారణంగా విద్యార్థులు దాదాపు రెండు సంవత్సరాలు పాఠశాలలకు దూరం కావడంతో పాఠశాల విద్యలో తీవ్రమైన అభ్యాసన సంక్షోభం నెలకొన్నదని, దీనిని అధిగమించుటకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమం అమలుచేస్తున్నదని అన్నారు. తొలిమెట్టును సమర్థవంతంగా అమలుచేసి, జిల్లాను విద్యాపరంగా ప్రధమ స్థానంలో నిలుపుటకు కృషిచేయాలన్నారు. మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌళిక వసతులను మరింత మెరుగు పరిచే బృహత్తర కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం క్రింద జిల్లాలో మొదటి విడతగా 426 పాఠశాలలను ఎంపిక చేసి, పనులు ప్రారంభించినట్లు ఆయన అన్నారు. ఇందులో ఇప్పటి వరకు 62 పాఠశాలల్లో పనులు పూర్తి కాగా, 359 పాఠశాలల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

 

ఇది కూడా చదవండి: ‘పేట’ కాంగ్రెస్ కు నాయకుడేడి..?

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద  జిల్లాకు 2022-23 ఆర్థిక సంవత్సరంనకు 81.16 లక్షల పని దినములతో రూ. 347.37 కోట్లతో లేబర్ బడ్జెట్ ను తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా ఇచ్చినట్లు ఆయన అన్నారు. ముఖ్యమంత్రి గిరివికాసం పథకం క్రింద రూ. 877.86 లక్షల నిధులు మంజూరు కాగా, ఇప్పటికి రూ. 684.47 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. వీటితో బోర్లు వేయడం, మోటార్లు అందించడం జరిగిందన్నారు. జిల్లాలో వివిధ రకాల మొత్తం 1,92,297 పించనులు మంజూరుకాగా, అక్టోబర్ 2022 మాసములో రూ. 4,263.31 లక్షల మొత్తం పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో పించను సమస్యలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.     సమావేశంలో పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి మాట్లాడుతూ, కంటి వెలుగు కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకొనేల చర్యలు తీసుకోవాలని అన్నారు.  కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించే వారు నైపుణ్యం కల్గివుండాలని, వారికి శిక్షణ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం చేపట్టినట్లు, ఈ దిశగా ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనలో అవగాహన కార్యక్రమం చేపట్టాలన్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి నిర్ణయమేంటి..? ఆయన మాటలో అంతర్యమేంటి..?

సమావేశంలో పాల్గొన్న ఎంపిపి, జెడ్పిటిసిలు వారి వారి ప్రాంతాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.     ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, జిల్లా అధికారులు, ఎంపిపిలు, జెడ్పిటిసి లు పాల్గొన్నారు.