Telugu News

*ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి.

-- జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ*

0

*ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి:
— జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ*
— ఉపాథి కల్పన పెంపొందించుటకు బ్యాంకర్లు సహకరించాలి.
–బ్యాంకులకు వస్తున్న వివిధ రుణ దరఖాస్తుల నివేదిక అందజేయాలి.
— ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే దిశగా ప్రత్యేక క్యాంపుల నిర్వహణ.
— స్వశక్తి రుణాల రికవరీ పై దృష్టి సారించాలి.
— రైతు రుణాలను రెన్యూవల్ చేసుకునేలా అవగాహన కల్పించాలి.
— బ్యాంకర్లతో డిసిసి, డిఎల్ఆర్సి సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్.

(పెద్దపల్లి –విజయం న్యూస్):
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ కోరారు . ఎస్సి కార్పోరేషన్ ల రుణాలు, ఆర్థిక అక్షరాస్యత, ఇతర అంశాల పై గురువారం డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ప్రజల ద్వారా బ్యాంకులకు అందిన వివిధ రుణ దరఖాస్తులు (వ్యవసాయరుణాలు, విద్యా రుణాలు, గృహ రుణాలు, ఎంఎస్ఎంఈ….) బ్యాంకుల వారీగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. 2021 వానాకాలం పంటకు రూ.868 కోట్ల పంట రుణ లక్ష్యానికి సెప్టెంబర్ చివరి వరకు 43684 మంది రైతులకు రూ.551.14 కోట్లు రుణాలు అందించామని అధికారులు తెలిపారు. రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం పై వారికి అవగాహన కల్పించాలని తెలిపారు.

రైతు రుణ లక్ష్యాల పై కలెక్టర్ బ్యాంకర్ల వారీగా సమీక్షించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐసీఐసీఐ యాక్సిస్ బ్యాంకులు పంట రుణాల లక్ష్యాలు చేరుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారని, దీనికి గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని 14 బ్యాంకులకు సంబంధించిన 98 బ్రాంచ్ లు ప్రతి మాసంలో 3వ శుక్రవారం రైతు వేదికల్లో వ్యవసాయ శాఖ సమన్వయంతో రైతు రుణాల రెన్యువల్ పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ టెర్మ రుణాలు 2111.77కోట్లు లక్ష్యానికి ఇప్పటి వరకు కేవలం 35.17% 742.72 కోట్లు అందించడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

వ్యవసాయ టెర్మ్ రుణాల పరిధిలో వచ్చే అంశాల పై వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు రైతులకు వివరించాలని కలెక్టర్ సూచించారు. సెప్టెంబర్ చివరి వరకు 4861 స్వశక్తి సంఘాలకు రూ.237 కోట్లు రుణాలు అందించామని, మెప్మా కింద 309 స్వశక్తి సంఘాలకు రూ.21.03 కోట్ల రుణాలు అందించామని అధికారులు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం 9310 సంఘాలకు రూ.337.99 కోట్ల రుణం అందించడం లక్ష్యంగా ఉందని, దీని సాధన కోసం ప్రణాళికాబ్దంగా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 573 స్వశక్తి సంఘాలు రూ.2.23 కోట్లు ఎన్.పీ.ఏ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలో రుణాల రికవరీ పై శ్రద్ధ వహించాలని, బ్యాంకర్లు సంబంధిత మహిళా సంఘాలకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు 2016-17 సంవత్సరానికి సంబంధించి 715 ఎస్సీ యూనిట్ల సబ్సిడి విడుదల అయినప్పటికి 693 మాత్రమే గ్రౌండ్ అయ్యాయని, 2017-18 సంవత్సరంలో 615 ఎస్సీ యూనిట్లు మంజూరైతే 536 గ్రౌండ్ అయ్యాయని కలెక్టర్ అన్నారు.

యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చుపాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు ప్రధానమంత్రి ఉపాథి కల్పన పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 129 ప్రాజేక్టులకు రూ.4 కోట్ల 41 లక్షల రుణ లక్ష్యానికి ఇప్పటి వరకు 73 ప్రాజేక్టులకు రూ.2 కోట్ల 77 లక్షల రుణం అందించామని , స్టాండప్ ఇండియా కింద 70 దరఖాస్తులు రూ.1.3 కోట్లు అందించామని, 412 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. జిల్లాలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 104.43 కోట్ల రుణ లక్ష్యానికి సెప్టెంబర్ చివరి వరకు 1684 మందికి రూ.100.37 కోట్ల రుణం అందించామని తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, ఆర్బీఐ ఎజిఎం అనిల్ కుమార్, డిడిఎం నాబార్డు అనంత్, వివిధ బ్యాంకు మేనేజర్లు , సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమీక్షలో పాల్గోన్నారు.