Telugu News

అజయ్ నీ వైఖరి మార్చుకో: పొంగులేటి అనుచరులు

దళిత యువకుడిని రోడ్డుపై చితకబాదడం ప్రజాస్వామ్యమా...?

0

అజయ్ నీ వైఖరి మార్చుకో: పొంగులేటి అనుచరులు

– తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదు

– దళిత యువకుడిని రోడ్డుపై చితకబాదడం ప్రజాస్వామ్యమా…?

– గత ప్రభుత్వాల్లో ఇలాంటి సంఘటనలు చూడలేదు

– భావ ప్రకటన చేసిన వారిపై దాడులు ఎంతవరకు సమంజసం

– విలేకరుల సమావేశంలో పొంగులేటి అనుచరులు

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్):

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఎంతో మంది మంత్రులను, కేంద్రమంత్రులను చూశాం…. కానీ పువ్వాడ అజయ్ కుమార్ లాంటి నియంత, రాచరికపు, అప్రజాస్వామిక మంత్రిని మేము ఎన్నడూ చూడలేదు. దళిత యువకుడు అని కూడా చూడకుండా నడిరోడ్డుపై వారి అనుచరులచే చితకబాదించడం ఎంత వరకు సమంజసం…. ఇప్పటికైనా అజయ్ నియంత వైఖరి మార్చుకోవాలి… తీరు మార్చుకోకపోతే రానున్న కాలంలో శీనన్న అభిమానుల తిరుగుబాటు తప్పదని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుచరులు మంత్రి అజయ్ కి హెచ్చరికలు జారీచేశారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గూటికి మట్టా దయానంద్

ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, రాష్ట్ర మహిళా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వూకంటి గోపాలరావు, డాక్టర్ కోటా రాంబాబు, విజయబాయి, మందడపు తిరుమలరావు తదితర నేతలు మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే…. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పొంగులేటి శీనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం లో జరిగిన  జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పాల్వంచ నుంచి ఖమ్మం వచ్చిన శీనన్న అభిమాని, దళిత యువకుడు చీకటి కార్తీక్ పై బీఆర్ఎస్ మూకలు దాడికి పాల్పడిన విషయం విధితమే. గత మూడు నాలుగు రోజుల క్రితం సామాజిక మాధ్యమం వేదిక గా భావ ప్రకటన చేసిన నేపథ్యంలో చీకటి కార్తీక్ ను నడిరోడ్డుపైనే హత్య చేసే ప్రయత్నం సదరు బీఆర్ఎస్ నాయకులు చేశారు. పోలీసులు ఉన్నప్పటికి వారి సమక్షంలోనే దాడి జరగడం శోచనీయం. ఏదో విధి నిర్వహణ చేయాలి కాబట్టి చేసి సదరు యువకుడిని పోలీసులు కాపాడి తీసుకెళ్లారే తప్ప ఆ తదుపరి కేసును స్వీకరించలేదు. నా పై హత్య ప్రయత్నం జరిగిందని వాపోతూ చీకటి కార్తీక్ ఫిర్యాదు చేస్తే కనీసం పోలీసులు కేసు నమోదు చేయకపోవడం బీఆర్ఎస్ అరాచకపు పాలనకు అద్దం పడుతుంది. వెంటనే కేసును సుమోటోగా స్వీకరించి దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

ఇది కూడా చదవండి: యువతా మేలుకో… రాజ్యాన్ని ఏలుకో: పొంగులేటి 

గతంలోనూ ఖమ్మం నగరానికి చెందిన దళిత యువకుడు తేళ్లూరి రామకృష్ణ, గిరిజన నాయకుడు బోడా శ్రావణ్ కుమార్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడితే ఇంతవరకు వారిపై చర్యలు శూన్యం. రోజురోజుకి శీనన్న ఎదుగుతున్న తీరును సహించలేకే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు జిల్లాలోని ఇతర బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దుశ్చర్యలను ప్రోత్సాహిస్తున్నారు. మా నాయకుడు పొంగులేటి శ్రీనన్న అన్నట్లు అధికారం ఎవడబ్బా సొత్తు కాదు అనే విషయాన్ని ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు గుర్తెరగాలి. మధిరలోనూ పొంగులేటి శీనన్న కార్యాలయం పై దుండగులు దాడి చేశారు. ఇది అమానుషం. మా నాయకుడు శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని భావించేవాడు…. ఆయన అడుగుజాడల్లో మేము కొనసాగుతున్నాం కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయ విమర్శలు మాత్రమే మేము చేస్తూ వస్తున్నాం. ఇది బీఆర్ఎస్ నేతలకు, మరీ ముఖ్యంగా మంత్రి అజయ్ కు మీడియా ముఖంగా చివరి హెచ్చరిక. ఇలాగే మీ తీరు కొనసాగితే శీనన్న అభిమానులు తిరుగుబాటు చేయకతప్పదు. ఆ తరువాత జరిగే సంఘటనలకు మేము బాధ్యత వహించలేమంటూ వారి ప్రసంగాలను ముగించారు.

ఇది కూడా చదవండి: రైతులంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు చిన్నచూపు: పొంగులేటి