Telugu News

తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే: బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్

0

తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే: బండి సంజయ్

== కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాల్లేవ్*

== ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకే దళారులకు అమ్ముకునే దుస్థితి*

== వడ్లు అమ్మిన తరువాత డబ్బులు చెల్లిస్తారో కూడా తెలియని పరిస్థితి*

== మేనిఫెస్టో పవిత్ర గ్రంథమన్న కాంగ్రెస్ నేతలారా… వాటిని ఎందుకు అమలు చేయడం లేదు?*

== ఎకరాకు రూ.14 వేల చొప్పున వెంటనే బోనస్ ఇస్తారా? లేదా?*

== కేసీఆర్ స్కూల్లో కాంగ్రెస్ నేతలు ట్రైనింగ్ తీసుకున్నట్లుంది*

== ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రూ.2 లక్షల రుణమాఫీ డ్రామాలు*

== పంట నష్టపోతే పరిహారం నేటికీ అందని దుస్థితి*

== కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దొందూ దొందే…*

== బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్*

== సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బండి సంజయ్*

== 15 రోజులుగా వడ్లు రాశులు పోసినా ఎవరూ కొనడం లేదని వాపోయిన రైతులు*

== బోనస్ దేవుడెరుగు… ఎమ్మెస్పీ కంటే రూ.5 వందలు తక్కువగా దళారులకు అమ్మాల్సి వస్తోందని ఆవేదన*

== గతంలో కేటీఆర్ ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని పేర్కొన్న రైతులు… *

== ఇచ్చిన హామీలను నెరవేర్చని పార్టీలకు బుద్ది చెప్పాలని కోరిన బండి సంజయ్*

ఇది కూడా చదవండి:- నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్  కుట్ర : బండి

(కరీంనగర్,-విజయం న్యూస్)

సర్కార్ నిర్లక్ష్యంవల్లే కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడంవల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, వేలాది టన్నుల ధాన్యం తడిసి పోయిందన్నారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి విచ్చేసిన బండి సంజయ్ ఐకేపీ కేంద్రంలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకున్న రైతులను కలిశారు. వడ్ల కల్లాలను పరిశీలించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వడ్ల కొనుగోలు విషయంలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని ఏకరవు పెట్టారు. ‘’15 రోజులుగా వడ్లను ఇక్కడికి తెచ్చినం. కొనే నాథుడే లేడు. తేమ ఉందంటరు. కొనరు. క్వింటాలుకు 4 నుండి 5 కిలోల చొప్పున తరుగు తీస్తామంటున్నరు. వర్షం పడితే వడ్లపై కప్పడానికి టార్పాలిన్లు కూడా ఇయ్యలేదు. గన్నీ బ్యాగులు, రవాణా ఛార్జీల సంగతి దేవుడెరుగు. అసలు పట్టించుకునే నాథుడే లేడు. ఇదేమని అడిగితే కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారు’’అంటూ వాపోయారు. అన్ని ఇబ్బందులు భరించి వడ్లను అమ్ముదామంటే కనీస మద్దతు ధర కూడా చెల్లించడం లేదని, 17 నుండి 18 వందల రూపాయల కంటే ఎక్కువ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరం కోసం ఎవరైనా వడ్లను అమ్మితే… సకాలంలో డబ్బులు కూడా చెల్లించడం లేదని, 15 నుండి నెల రోజులకుపైగా ఎదురు చూడాల్సి వస్తోందన్నారు… రైతుల ఆవేదనను విన్ని బండి సంజయ్ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.. ముఖ్యాంశాలు…

రైతులకు బీఆర్ఎస్ పాలనలో ఏ విధమైన అన్యాయం జరిగిందో అంతకంటే ఎక్కువ మోసం కాంగ్రెస్ పాలనలో జరుగుతోంది. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీలన్నీ గాలికి ఎగిరిపోయాయి. కాంగ్రెస్ పాలనలోనూ అదే పరిస్థితి. పంట నష్టపోయి నెలలు అవుతున్నా… నయాపైసా సాయం అందలేదు. కాంగ్రెస్ నేతలు సైతం కేసీఆర్ స్కూలులోనే ట్రైనింగ్ తీసుకుని వచ్చి దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారు…

ఎన్నికల మేనిఫెస్టో తమకు బైబిల్, ఖరాన్, భగవద్గీతతో సమానమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని నమ్మించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు వాటి అమలు అతీగతి లేదు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసపు హామీలిస్తున్నారు.. జూన్ 4 నాటికి ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఆ మరుసటి రోజే రుణమాఫీ అమలు చేస్తామని ఎందుకు చెప్పడం లేదు? ఎంపీ ఎన్నికల తరువాత.. వెంటనే స్థానిక ఎన్నికలు నిర్వహించి ఓట్లు దండుకుని రూ. 2 లక్షల రుణమాఫీ హామీని పూర్తిగా గాలికి వదిలేయాలన్నదే కాంగ్రెస్ ఎత్తుగడ.

వీటితోపాటు రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల బోనస్ ఇస్తామన్నారు. ఆసరా పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామన్నారు. మహిళలకు నెలనెలా రూ.2500లు ఇస్తామన్నారు. ఇల్లు లేనోళ్లందరికీ జాగాతోపాటు రూ.5 లక్షల సాయం చేస్తామన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు.. బైబిల్, ఖురాన్, భగవద్గీతపై కాంగ్రెస్ కు నిజంగా చిత్తుశుద్ధి ఉంటే, ఆ పార్టీ నేతలకు పవిత్ర గ్రంథమైతే వెంటనే వాటిని అమలు చేయాలి.

అట్లాగే వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని హమీ ఇచ్చారు. వడ్లతోపాటు ఇతర పంటలకు బోనస్ ఇవ్వడానికి రూ. 5వేల కోట్ల నిధులు కావాలి. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లన్నీ కొనాలంటే ప్రభుత్వంపై రూ.700 కోట్ల భారం పడుతుంది. ఈ రెండు హామీల అమలు కోసం రూ.5700 కోట్ల నిధులు అవసరం. వాటినే ఖర్చు చేయకుండా రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు కోసం రూ.30 వేల కోట్లను విడుదల చేస్తామంటే నమ్మేదెవరు? కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే వడ్లకు బోనస్ ఇవ్వాలి. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేయాలి. అట్లాగే తడిసిన వడ్లను పూర్తిగా కనీస మద్ధతు చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి.

కాంగ్రెస్ హయాంతో పోలిస్తే నరేంద్రమోదీ ప్రభుత్వం కనీస మధ్దతు ధరను రెట్టింపు చేశారు. ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరాకు రూ.20 వేల దాకా రైతులపై భారం తగ్గిస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సబ్సిడీలన్నీ ఎత్తేసే ప్రమాదం ఉంది. కనీస మద్దతు ధర చెల్లించే పరిస్థితి కూడా ఉండదు. తద్వారా రైతులపై విపరీతమైన భారం పడే ప్రమాదం ఉంది. కాబట్టి రైతాంగం వాస్తవాలు ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా…