Telugu News

నవంబర్ 9న అల్లామా ఇక్బాల్ జయంతి

విశ్వకవి అల్లామా ఇక్బాల్ -విశ్వకవి అల్లామా ఇక్బాల్ ముహమ్మద్ ముజాహిద్

0

నవంబర్ 9న అల్లామా ఇక్బాల్ జయంతి

విశ్వకవి అల్లామా ఇక్బాల్

– ముహమ్మద్ ముజాహిద్

‘‘అమ్మా ఈ రోజు మన మేక పాలివ్వలేదా? ఈ రోజు పాలగ్లాసు ఇవ్వలేదేంటమ్మా? ’’

 

‘‘నాయనా ఈ రోజు మన మేక పక్కింటి వాళ్ల చేనులో పడి మేసింది. అందుకే ఈ రోజు ఆ పాలు నీకు త్రాపించడం కంటే నిన్ను పస్తులుంచడమే మంచిది. అక్రమంగా మన కడుపునింపుకోవడం పాపం నాయనా’’

తన కొడుకు పోషణలో ఆ తల్లి అన్నన్ని జాగ్రత్తలు తీసుకుంది కాబట్టే ఆ అబ్బాయి పెద్దయ్యాక మనదేశ పేరుప్రఖ్యాతల్ని ప్రపంచానికి చాటిచెప్పేంత విశ్వకవి అయ్యాడు. ‘సారే జహాఁసే అచ్ఛా హిందుస్తా హమారా’ అని ఈ రోజు మనం పాటుకుంటున్నామంటే ఆయన కలం మహత్యమే. ఈపాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆయనెవరో.

మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు రాఖేష్‌శర్మ రోదసిలో విహరిస్తుండగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భారతదేశం ఇప్పుడు ఎలా కనిపిస్తున్నది అని ప్రశ్నిస్తే ‘‘సారే జహాసె అచ్ఛా హిందూ సితా హమారా’’అని సమాధానం చెప్పాడట.

‘‘ఈ గీతం విన్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతుంది. బరోడా జైల్లోవున్నప్పుడు నేను ఎన్ని వందలసార్లు ఆ గీతాన్ని పాడుకొన్నానో చెప్పలేను’’ అన్నారు మహాత్మాగాంధీ. భారతదేశ ఔన్నత్యాన్ని, విశిష్టతను చాటేలా విశ్వకవి ముహమ్మద్ ఇక్బాల్ రాసిన ఈ గీతం ఇప్పటికీ చెక్కు చెదరకుండా వందకోట్ల భారతీయ నోళ్లలో నానుతూనే ఉంటుంది. 1877 నవంబర్ 9వ తేదీన జన్మించిన ఇక్బాల్‌కు గుండె లోతుల్లోంచి ఈ పాట ఎప్పుడు వచ్చిందో తెలుసా… ఇక్బాల్ పంజాబ్ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రాన్ని అధ్యయనంచేసి, లాహోర్ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకునిగా చేసేవాడు. 1904వ సంవత్సర కాలంలో లాహోర్ పట్టణంలో వై.యం.సి.ఏ. అనే ఒక సాంస్కృతిక సంస్థ వుండేది. లాహోర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థి లాల్‌హర్ దయాల్ ఈ సంస్థలో సభ్యుడుగా వుండేవాడు. అతనికి ఆ సంస్థ కార్యదర్శితో తగాదా రావడంతో తానే స్వయంగా ‘యంగ్‌మెన్స్ ఇండియన్ అసోసియేషన్’ అనే సంస్థని నెలకొల్పాలని సంకల్పించాడు. ఆ సంస్థ ప్రారంభోత్సవ సభకు తమ కళాశాల అధ్యాపకుడైన ఇక్బాల్‌ను అధ్యక్షునిగా ఆహ్వానించాడు. ఇక్బాల్ తన అధ్యక్షోపన్యాసాన్ని ఒక చక్కని పాటతో ప్రారంభించాడు. ఆ పాటే ‘‘సారే జహాసే అచ్ఛా హిందూ సితాహమారా. సుమారు నూరేళ్లు పైబడినా ఈ గీతం చెక్కుచెదరలేదంటే దీని వెనుక ఎంతటి పవిత్రమైన భావాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. విశ్వకవిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన 1877లో ఇప్పటి పాకిస్తాన్ సియాల్ కోట్ లో జన్మించారు. ఉర్దూ ప్రేమికులంతా ఆయన్ను అల్లమా ఇక్బాల్ గా పిలుచుకుంటారు. అల్లామా అంటే మహా పండితుడు అని అర్థం. లండన్‌లో బారిష్టర్ చేసిన తర్వాత జర్మనీ బెర్లిన్ విశ్వవిద్యాలయంలో ‘‘పర్షియన్ భాష- వేదాంతాల’’ మీద పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీని పొందారు. ఆక్ఫఫర్డ్ యూనివర్సిటీలో కొన్నాళ్లు ప్రొఫెసర్‌గాచేసి మ్యూనిచ్ విశ్వవిద్యాలయంలో ప్రాక్ పశ్చిమ సాహిత్యల తులనాత్మక పరిశీలన చేసి రెండవసారి పిహెచ్.డి పట్టాను పొందారు. ఇక్బాల్‌కు ఉర్దూ, పారశీ, ఇంగ్లీష్, సంస్కృతం మొదలైన భాషలలో లోతైన పాండిత్యం వుంది. ఆయన రచనలలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల అఖండ భారతదేశాన్ని ప్రతిబింబింపచేశారు. ఉర్దూ, పారశీక కవులెవ్వరూ దక్షిణ భారతదేశాన్ని వర్ణించినట్లులేదు. కానీ ఇక్బాల్ కావేరీ నదిని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధం వుండేది.

ఇక్బాల్ మాతృమూర్తి ఆయన పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఎంతో పవిత్ర భావాలతో పెంచి పెద్దచేశారు. తన భర్త సంపాదన విషయంలో కాస్తంత అసంతృప్తిగా ఉండేవారు. ఆ సొమ్ము ధర్మసమ్మతం కాదని భావించేవారు. అలాంటి సంపదతో తన కొడుకును పోషించడం నచ్చలేదు ఆమెకు. ఎందుకంటే ఇక్బాల్ తండ్రి సంపాదనలో పరోక్షంగా వడ్డీ సొమ్ము కలిసేది. వడ్డీ సొమ్ము తినడం ఇస్లామ్ లో నిషిద్ధం. ఈ సొమ్ముతో తన కొడుకును పోషించడం ఆమెకు నచ్చలేదు. ఇక్బాల్ పుట్టగానే ఆమె గారు తన రొమ్ము పాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. తన బిడ్డ శరీరంలో ఒక్క చుక్క కూడా అధర్మ సంపాదనతో పోషించకూడదన్నదే ఆమె ఆలోచన. తన తండ్రి ద్వారా సంక్రమించిన బంగారు ఆభరణాలన్నింటినీ అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక మేకను కొనుగోలు చేశారు. ఆ మేక పాలను తన బిడ్డకు పట్టేవారు. ఆ పాలు త్రాగే ఇక్బాల్ పెద్దయ్యారు. ఆయన కవితలు సామాజిక దౌష్ట్యాలను ఎండగడతాయి. అవినీతిని నిరసిస్తాయి. దౌర్జన్యాలపై చెర్నాకోల ఝుళిపిస్తాయి. విప్లవం లేని జీవితం మృత్యువుతో సమానమన్నాడు. పేదలకు తిండి పెట్టలేని పొలాలను తగలబెట్టండి. మేల్కోండి పేదలారా… ధనికుల మెడలు పడగొట్టండి. బానిసల రక్తాన్ని పొంగించండి. ప్రజాస్వామ్య యుగం వస్తున్నది అని ఎలుగెత్తి చాటాడు. మానవత్వం, శాంతి, స్నేహభావం ఉండాలనే ఇక్బాల్ ఆదర్శాలు ఉన్నతమైనవి.