Telugu News

“దళితబంధు” రాజకీయ ఎత్తుగడేనా..?

రేగా రాజకీయ వ్యూహంలో భాగమా?

0
“దళితబంధు” రాజకీయ ఎత్తుగడేనా..?
★రేగా రాజకీయ వ్యూహంలో భాగమా?
★దళిత విలేకరులకు న్యాయం
 జరిగేనా..?
★నియోజకవర్గంలో దళితబంధు పై విస్తృత ప్రచారం…
మణుగూరు అక్టోబర్ 18 (విజయం న్యూస్):
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దళిత విలేకరులకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయం ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు, చాలా చోట్ల రేగా కాంతారావు చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గంలో దళిత విలేకరులు మాకు కూడా దళిత బంధు అమలు చేయాలని క్యాంపు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేశారు. కొందరు శాసనసభ్యులు హామీ ఇవ్వగా మరికొందరు తిరస్కరించినట్లు సమాచారం. అయితే రేగా చేసిన ప్రకటన ఎంతవరకు నెరవేరుతుందొనని పలువురు చర్చించుకుంటున్నారు.
★ దళిత బంధు రాజకీయ ఎత్తుగడేనా..?
పినపాక నియోజకవర్గం లో గత సార్వత్రిక ఎన్నికల్లో రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీపై అత్యధిక మెజార్టీతో గెలుపొంది అనంతరం అభివృద్ధి పేరుతో గులాబీ గూటికి చేరి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ప్రభుత్వ విప్ పదవులను అందుకున్నారు. అయినా ఆయన అనుచరులు చేస్తున్న ఇసుక మాఫియా, భూదంద, ప్రైవేటు సెటిల్మెంట్లపై  పెద్ద ఎత్తున వార్తలు వచ్చేసరికి ఆయనపై ఒక్కసారిగా అవినీతి ఆరోపణలు ఎక్కువ   రావడంతో వాటిపై నియోజకవర్గంలోని విలేకరులు పెద్ద ఎత్తున వార్తలు రాస్తుండడంతో వారిని నిలువరించేందుకు “దళిత బంధు” పథకాన్ని విలేకరులకు ప్రకటించడం తో ఆయన వ్యతిరేక వర్గం చర్చించుకుంటున్నారు. అంతేకానీ విలేకర్లకు ఈ పథకం అమలు కాదని గంటాపదంగా పలువురు చర్చించుకుంటున్నారు. రేగా కాంతారావుకు ఓ ప్రధాన విలేకరి అనుచరుడుగా ఉండి ఎత్తుగడలు పన్నారని తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో ఓ దళిత విలేకరి భూదందపై వార్తలు రాస్తే సదరు వ్యక్తిని ఎమ్మెల్యేకు పిఆర్ఓ గా పనిచేసే ఒకరు ఇలాంటి వార్తలు పత్రికల్లో రావడంతో ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నారని ఆయన 45  మందికి దళిత బంధు ఇస్తానని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం పై వ్యతిరేక వార్తలు రాస్తున్నారని ఎందుకు ఈ గోలంతా మనకు అనుకూలంగా ఉండే విలేకరులకే ఈ పథకం ఇద్దామని అంటున్నారని ఓ ప్రధాన విలేఖరి చెప్పగానే వార్తలు రాసిన వ్యక్తిని బెదిరించాడట.. దీంతో చాలామంది విలేకరులు స్థానిక ఎమ్మెల్యే పై వార్తలు రాయకుండా ఇలాంటి ఎత్తుగడలు పన్నారని. తేట తెల్లం  అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
★ రేగా ప్రకటనతో కొత్తగా పుట్టుకొస్తున్న విలేకరులు…
దళిత విలేకరులకు దళిత బంధు పథకాన్ని రాగా కాంతారావు ప్రకటించడంతో విలేకరి వృత్తిని పక్కకు పెట్టినవారు విలేఖరి అయితే దళిత బంధు వస్తుందనే ఆశతో చాలామంది కొత్తవారు ఈ  మార్గాన్నే ఎంచుకుంటున్నారు. దీంతో పైరవీల కోసం సీనియర్ పాత్రికేయులను స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి ఈ అవకాశాన్ని మాకు కూడా అమలు చేయాలంటూ క్యాంపు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. చివరకు ఈ దళిత బంధు పథకం ఎంత మంది విలేకరులకు దక్కుతుందోనని వేచి చూడాలి.