Telugu News

బహుజన రాజ్యమే మారోజు వీరన్న కల

సంఘటిత ఉద్యమాలు, పోరాటాలకు సిద్ధం కావాలి

0

బహుజన రాజ్యమే మారోజు వీరన్న కల
* ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో ఇది సాధ్యం
* సంఘటిత ఉద్యమాలు, పోరాటాలకు సిద్ధం కావాలి
* పలువురు వక్తల పిలుపు
ఖమ్మం మే 25(విజయం న్యూస్):

(ప్రతినిధి -పెండ్ర అంజయ్య)

శతాబ్దాల నుండి ఆధిపత్య కులాల కారణంగా బానిస బ్రతుకుల సంకేళ్ళలో మ్రగ్గుతున్న దళిత బహుజనుల విముక్తి , సాధికారత … బహుజన రాజ్యంతోనే సాధ్యమని వర్గ – కుల పోరాట సిద్ధాంత కర్త మారోజు వీరన్న కల , ఇది బహుజను లైనా ఎస్సీ , ఎస్టీ ,బీసీ , మైనార్టీ సంఘటిత పోరాటం తోనే సాధ్యమని , ఇందుకు బహుజనులు సంఘటిత ఉద్యమాలు , పోరాటలకు సిద్ధం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. శని వారం స్తానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో లంబాడి పోరాట హక్కుల పోరాట సమితి , నంగారా భేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతూ బద్రు నాయక్ అధ్యక్షతన మారోజు వీరన్న 25వ సంస్మరణ సభ జరిగింది. తొలుత మారోజు వీరన్న చిత్రపటం తో పాటు చిట్యాల ఐలమ్మ , సావిత్రిబాయి పూలే , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , ఫాతిమా షేక్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి , నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ప్రొఫెసర్ ప్రభంజన యాదవ్ మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలలో రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వెలమల నాయకత్వం విరాజిల్లుతున్న కాలంలో … పూలే ,అంబేద్కర్ ల భావజాలం మేరకు రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతాయి , సామాజిక ఉద్యమం తో పాటు రాజకీయ కార్యాచరణ వేదిక అవసరమని గ్రహించిన కాన్షిరాం చేసిన ప్రయోగం , మారోజు వీరన్న వర్గ _ కుల జమిలి సిద్ధాంతం బహుజన రాజ్యం ఎర్పాటు కూ అనేక ఉద్యమాలు , పోరాటాల కు దారి తీసాయి అన్నారు. ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలలో బహుజనులు నాయకత్వ శ్రేణిలో లేరని , దీనికి మన దేశంలో నెలకొన్న నిచ్చెన మెట్ల వ్యవస్థ , ఇంకా తొలగిపోని కుల ప్రభావం కారణమన్నారు. మారోజు వీరన్న కన్న ముందు అంబేద్కర్ ,అంబేద్కర్ కన్నా ముందు పూలే వీరి అందరికన్నా ముందు మరి ఎంతోమంది బహుజన రాజ్యం కోసం పోరాటాలు చేశారని , ఈ పోరాటాలు మునుముందు కూడా సాగుతాయని తెలిపారు. ఎప్పుడైతే దేశంలో బహుజన రాజ్యం స్థాపించబడుతుందో అప్పుడే మారోజు వీరన్న కల నెరవేరుతుందని దీనికోసం మనమంతా సంఘటిత ఉద్యమాలు తలపెట్టాలన్నారు. మారోజు వీరన్న సహచరులు కోలా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ కాలర్ మార్క్స్ , డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , గౌతమ బుద్ధుడు భావజాలం మేళవించి ,రూపొందించిన తన సిద్ధాంతంతో మారోజు వీరన్న బహుజన రాజ్యం కోసం కృషిచేసి అమరులయ్యారని , ఆయన ఆశయ సాధనకు ఆయన ప్రారంభించిన ఉద్యమాన్ని ఉదృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాధన కోసం వివిధ రకాల ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక నూ రూపొందించిన వీరన్న ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు మూడు కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని ఆనాడే వివరించిన విషయాన్ని గుర్తు చేశారు. కాబట్టి బహుజనులు తమ రాజ్యం కోసం బహుముకాలుగా సైదాంతిక పోరాటం తో పాటు అందుకు తగ్గిన కార్యచరణ తో ముందుకు కదలాలన్నారు. దొడ్డి కొమరయ్య చలనచిత్ర దర్శకుడు సేనాపతి మాట్లాడుతూ రాజ్యం ఎప్పుడు పేదల పక్షాన ఉండదని ,అలాగే పేదల తరఫున పోరాడే వాళ్లను హతమార్చుతుందని వివరిస్తూ , అందుకే దళిత , బహుజన రాజ్యం కోసం పాటుపడుతున్న మారోజు వీరన్న ను రాజ్యం హత్య చేసిందన్నారు . తన ఈ చిత్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో పాటు తెలంగాణ మలి దశ , మారోజు వీరన్న గురించి కూడా చూపుతామన్నారు. మనం మన బ్రతుకులు బాగుపడాలంటే తప్పనిసరిగా బహుజన రాజ్యం ఏర్పడాలని , అందుకు మారోజు వీరన్న చూపిన బాట లో మనం నడవాలి అన్నారు. ఐలమ్మ వారసురాలు చిట్యాల శ్వేత ఐలమ్మ , వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి మాట్లాడుతూ రాజ్యాంగం ఉండబట్టి మనం ఈ విధంగా జీవించగలుగుతున్నామని , ఆ రాజ్యాంగం లేకుంటే మనతోపాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కూడా చనిపోయినట్లేనని అన్నారు. నేడు కొందరు రాజ్యాంగాన్ని మారుస్తామని చెబుతున్నారని ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ వర్గాలు రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వీరనారీమణుల ఆశయ సాధన సమితి గౌరవ అధ్యక్షురాలు ఎస్కే . నజీమా మాట్లాడుతూ మారోజు వీరన్న చూపిన బాట మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆ బాటలో మన హక్కులను సాధించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ హక్కుల సాధన సమితి అధ్యక్షురాలు మారోజు సృజన , సఖి అడ్మిన్ సరిత , రిటైర్డ్ సీఐ పుల్లూరి నాగయ్య , మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సమ్రిన్ , వీర నారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడాల ఝాన్సీ , పగిడిపల్లి నాగేశ్వరావు , రవీందర్ నాయక్ ,అనిల్ ,జగదీష్ ,రమేష్ ,వీరన్న ,శ్రీనివాస్, పద్మచారి ,ఉష ,జ్యోతి, కృష్ణవేణి ,మురళి , రాంబాయమ్మ , పావని, మహాలక్ష్మి, జయ ,నాగమణి, శ్రావణి, రాము, హరి ,నాగరాజు, లలిత ,రమా దేవి , శోభన్ నాయక్ , తదితరులు పాల్గొన్న గా కరీంనగర్ నుంచి వచ్చిన ప్రజా గాయకుడు గజ్జల అశోక్ పాడిన తెలంగాణ పాటలు ఆకట్టుకున్నాయి.