Telugu News

కేటీఆర్ నోరు జాగ్రత్త: భట్టి విక్రమార్క

మంత్రి కేటీఆర్ కు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు

0

కేటీఆర్ నోరు జాగ్రత్త: భట్టి విక్రమార్క

== మంత్రి కేటీఆర్ కు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు

== రాహుల్ గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

== సభ్యత సంస్కారం మర్చిపోయి సంస్కారహీనుడిగా మాట్లాడకు

== పదవులను త్యాగం చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ

== ప్రజల కోసం బతుకుతున్న మహనీయుడు రాహుల్

== ఎర్రుపాలెం మండలంలో వీలేకర్ల సమావేశంలో కేటీఆర్ పై మండిపడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

(ఖమ్మంప్రతినిధి/ఎర్రుపాలెం-విజయంన్యూస్)

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పై మంత్రి కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని, మతిభ్రమించినట్లు వ్యవహరిస్తున్నాడని, మంత్రి కేటీఆర్ నోరు జాగ్రత్త, అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయని, మంత్రి కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. సోమవారం ఎర్రుపాలెం మండలంలో పర్యటించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ పై భద్రాద్రి ఎమ్మెల్యే ఫిర్యాదు

రాష్ట్ర మంత్రి కేటీఆర్ సభ్యత, సంస్కారం మర్చిపోయి సంస్కారహీనుడిగా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీపై  చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దేశానికి ప్రధానమంత్రిగా, కేంద్ర మంత్రిగా అయ్యేటువంటి అవకాశం ఉన్న ఆ పదవులను త్యాగం చేసిన గొప్ప మనిషి రాహుల్ గాంధీ అని గుర్తు చేశారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశం సమైక్యంగా ఉండాలని, జాతి విచ్ఛిన్నం కాకూడదని, ఆర్థికంగా, మతపరంగా విభజనతో దేశం రెండు భారతదేశలుగా ఉండకూడదని భారత్ జోడో యాత్రతో ప్రపంచమే ఆయనను చూసే విధంగా, దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. వ్యవసాయ పంట పొలాల్లోకి వెళ్లి కూలీలతో కలిసి రాహుల్ గాంధీ నాట్లు వేశాడు.  లారీలు ఎక్కి ట్రక్కు డ్రైవర్లతో ప్రయాణం చేసి వారి కష్టాలను తెలుసుకున్నాడు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తూ మెకానిక్ ల జీవితాలను తెలుసుకున్నారు. దేశంలో ఉన్న బడుగు బలహీనులను కలుస్తున్నారు. ప్రజలు పడుతున్న బాధలను నేరుగా తెలుసుకుంటున్నారని వివరించారు. పచ్చకామెర్లు ఉన్నవాళ్ళకు దేశం పచ్చగా కనబడినట్టు ఎప్పుడూ పబ్బులు, క్లబ్బుల గురించి ఆలోచన చేసే కేటీఆర్ కి వరి నాట్లు వేసే పంట పొలాలు పబ్బు లాగానే కనబడుతున్నాయా?.

ఇది కూడా చదవండి: పాలేరు ప్రజల ఓట్లను అమ్మేసిన ఎమ్మెల్యే: భట్టి

రాహుల్ గాంధీ మెకానిక్ ల తో మాట్లాడేది క్లబ్బు లాగా కనిపిస్తున్నదా?. దీనిని బట్టి కేటీఆర్ ఏప్రపంచంలో బతుకుతున్నాడో అర్థమవుతున్నదని ఎద్దేవా చేశారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఇలా మాట్లాడటం  వారి మానసిక స్థితిని తెలుపుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్బు, క్లబ్, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయాయని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని పబ్బు, క్లబ్, డ్రగ్స్ కేంద్రంగా మార్చిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని దుయ్యబట్టారు. పబ్బు, క్లబ్బు, డ్రగ్స్ నిర్వహణ వెనుక ఎవరున్నారో.. చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చి చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. ప్రజా సమస్యల కోసం నిత్యం పరితపిస్తున్న రాహుల్ ఆలోచనలను గమనిస్తే నాయకుడు ఎలా ఉండాలో అర్థం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ దేశంలో పేదలు, రైతులు, కార్మికులు బాగుపడాలని తపిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. అవినీతిలో కూరుకుపోయి అనేక కేసులు ఎదుర్కొంటూ ఢిల్లీకి వెళ్లి అమీత్ షాను కలిసి సెటిల్మెంట్ చేసుకున్నమీరు, దేశం కోసం పోరాటం చేస్తున్న మా నాయకుడు రాహుల్ గాంధీ పై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఈ దేశానికి హరిత విప్లవం, శ్వేత విప్లవం, కంప్యూటర్ రెవల్యూషన్ తీసుకువచ్చిన కుటుంబానికి చెందిన గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల అధ్యక్షుడు సుధాకర్, నర్సింహారావు, బోస్, బాషా, రెడ్డి,  నాయకులు హజరైయ్యారు.