ఖమ్మం రూరల్ లో భూ ‘గురి’విందలు….
== రూరల్ భూ”మాయ” లో భోక్తలెవరు…?
== నకిలీ మకిలీ ని కప్పిపుచ్చుతున్నరా…?
== తప్పుడు రిజిస్ట్రేషన్ ను బదిలీ తోనే సరిపెట్టారా …?
(పి వి నాగిరెడ్డి-పాలేరు ప్రత్యేక ప్రతినిధి-విజయంన్యూస్)
బ్రతికున్న భూమి యజమానులను చనిపోయినట్లుగా సృష్టించి, దత్తపుత్రుడి అవతారమెత్తి, నకిలీ ధృవపత్రాలతో భూమిని కాజేసిన ఘటనలో అసలు సూత్రధారులెవ్వరు, పోలీసులు చేసిన దర్యాప్తులో బయటకు వస్తున్న అంశాలేమిటి, నకిలీ మకిలీ నుండి అధికారులు కడిగేసే ప్రయత్నం చేస్కుంటున్నారా, అందుకే నాయబ్ తహసీల్దార్ ను బదిలీ చేసి సరిపెట్టేశారా.. అంటే విస్మయ పరిచే విషయాలు వెలుగులోకొస్తున్నాయి…తప్పుడు రిజిస్ట్రేషన్ మొత్తానికి రూపకర్తలు ఖమ్మం రూరల్ తహసీల్దారు కార్యాలయమేనని, ఆక్రమానికి కేంద్రబిందువుగా కధ నడిపింది కూడా అక్కడి నుంచేనని తెలుస్తుంది… పట్టాదార్ పాస్ పుస్తకాలు తీస్కెళ్ళని యజమానుల సమాచారం ఇచ్చిపుచ్చుకున్న వ్యవహారం మొదలు, రెండు సార్లు రిజిస్ట్రేషన్ నిర్వహించే వరకూ అంతా ఆ అధికారుల సమన్వయం, సహకారంతోనే జరిగినట్లు వెల్లడవుతుంది… అయితే నిజనిజాలు బహిర్గతం కావటానికి మరికొంత సమయం పట్టినా జరుగుతున్న పరిణామాలు మొత్తం కూడా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొన్నట్లే కనపడ్తుంది… రెండు చేతులు కలవకుండా తప్పట్ల తాళాలు రానట్లే, అధికారులు, రియల్ బ్రోకర్ల కలవకుండా ఇంతటి భూ మాయా ప్రపంచాన్ని సృష్టించటం అయ్యే పని కాదని సామాన్యుడు కూడా ఒప్పుకోనే అంశం… అయితే అసలు పాత్రధారులను విచారించిన పోలీసులు ముందుగా కొంతమందిని అదుపులోకి తీసుకుని, వారిచ్చిన సమాచారం తో మరో ఇద్దరినీ కూడ రిమాండ్ కు పంపారు.. కానీ విచారణ సందర్భంగా వెలుగు చూసిన అంశాలలో అసలు సూత్రధారులను ఎలా ఒడిసి పడతారో లేదా అధి’కారు”పార్టీ టార్గెట్ కు అనుకూలంగానే పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేసి, ఎవరి కళ్ళలో ఆనందం చూడాలనుకున్నారో చూసేసి, వారు సంతృప్తి చెందిన తరువాత దర్యాప్తు ను నిలిపేశారా అనేది వేచి చూడాలి… ఖమ్మం రూరల్ మండలం తనగంపాడు రెవిన్యూలో జరిగిన నకిలీ ధృవపత్రాల తప్పుడు రిజిస్ట్రేషన్ పై కధనం….
ఇదికూడా చదవండి: కృషి వలుడు ‘రాయల’
ఖమ్మం రూరల్ మండలంలో సంచలనంగా మారిన తప్పుడు ధృవ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ ఘటనలో రెవెన్యూ అధికారులే సూత్రదారులు అనే విషయం వెలుగులోకి వస్తుంది… హైదరాబాద్ కు చెందిన పాలగాని గోవర్ధన రెడ్డి పేరుమీద ఉన్న 5.38 ఎకరాల ప్రైవేట్ భూమిని యజమాని, అతని భార్య చనిపోయినట్లుగా, వారికి వారసులు గా తామే అన్నట్లు దొంగ ధృవీకరణ పత్రాలు సృష్టించే విషయంలో వారికి రెవెన్యూ అధికారులు అండదండా గా నిలిచి మరీ తప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని కొనసాగించినట్లు తెలియ వచ్చింది… ఎంతో రహస్యంగా నిర్వహించిన ఈ దొంగ రిజిస్ట్రేషన్ వ్యవహారం అంతా ఇప్పుడు బట్టబయలయింది… దీంతో రెవెన్యూ అధికారులు, నిందితులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ, ఎవరికి వారు తమ ప్రమేయం లేదని తప్పించుకునే రీతిలో వ్యవహరించారు. ఈ క్రమంలో ముందస్తుగా తమ మీదకు రాకుండానే డిటీ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేసినంక కూడా అంతర్గతంగా మాట్లాడుకోవాలనే ఆలోచనా, ఓ రియల్టర్ పై పెద్దలకున్న ఆక్రోశం తో పోలీసులు పంచాయితీ పక్కకు పెట్టి కేసు నమోదు చేశారనే కొందరి ఆరోపణలు, నిందితులను చకచకా అరెస్టు చేయడం జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారంలో కీలకంగా రెవెన్యూ అధికారి, వ్యవహరించారని, మరికొందరు ఉద్యోగులు, సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.. దీంతో ఉన్నత స్థాయి అధికారులు కూడా శాఖాపరమైన అంతర్గత విచారణ నిర్వహించారు… ఈ క్రమంలో ఉన్నతాధికారులకు విస్తుపోయే విషయాలు తెలిసినట్లు, తప్పుడు ధృవపత్రాలు సృష్టించిన దగ్గర నుండి, రిజిస్ట్రేషన్ సజావుగా పూర్తైనంత వరకూ తహసీల్దార్ కార్యాలయం ప్రమేయం తోనే, వారి కనుసన్నల్లోనే అక్రమం జరిగినట్లు నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ అధికారులు, ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలిసినా, కేవలం డిటి కరుణశ్రీ బదిలీ తో సద్దుమణిగేలా ముగించేశారు. అయితే అసలు ఒక్క డిటీ నే ఈ అక్రమ తంతు పూర్తైనంత వరకూ అక్రమార్కులతో చేతులు కలిపిందా, ముందుగా ఈ వ్యవహారం ఎవరి వద్దకు వెళ్ళింది, తప్పుడు ధృవపత్రాలు సృష్టించాలన్న ఆలోచన ఎవరిది, వ్యవహారంలో రిపోర్టు ఇచ్చిన ఘనులెవ్వరు, తహశీల్దార్ లేని రోజే మొదటి రిజిస్ట్రేషన్ నిర్వహించారు, మొత్తంగా ఎంత ముడుపులు చేతులు మారాయి, ఎవరెవరికి ఎంతెంత ముట్టినాయి, పోలీసులు విచారణ ఏ దిశగా సాగింది, విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలేంటి అనేవీ కేవలం జవాబు లేని ప్రశ్నలు గానే మిగిలిపోతున్నాయి…
ఇదికూడ చదవండి: ప్రభుత్వ పాఠశాలలో కార్పోరేట్ విద్యనందిస్తాం: మంత్రి
రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చింది . ధరణి లోని లొసుగులను కూడా ఆసరా చేసుకొని రియల్ మాఫియా అక్రమాలకు పాల్పడుతోంటే, ఆ అక్రమాలకు వెన్నులా రెవిన్యూ శాఖ నిలుస్తోందనటంలో ఏ మాత్రం సందేహం లేదు . ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్ మండలంలో భార్య,భర్తలు ఇద్దరూ బ్రతికుండగానే వారిపేరుతో మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి.. లేని ఒక దత్తపుత్రుడిని తెరపైకి తెచ్చి అక్రమ రిజిస్ట్రేషన్లతో భూమిని కాజేసే కుట్రకు పాల్పడ్డారు. తనగంపాడు రెవెన్యూ గ్రామంలో మొత్తం 5.38 ఎకరాలను దర్జాగా దొంగ రిజిస్ట్రేషన్లతో దక్కించుకోనే క్రమంలో రెవెన్యూ శాఖలో పనిచేసే ఓ అధికారి సూత్రధారిగా వ్యవహరించగా.. సక్రమంగా పని చేసి పెట్టినందుకు ఆ అధికారి భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి…
== అక్రమమిలా…
ఖమ్మం రూరల్ మండలం తనగంపాడు రెవిన్యూలో సర్వే నంబర్ 43, 44 పార్టులలో ఓ వ్యక్తి పేరిట 5.38ఎకరాల భూమి ఉంది. పట్టాదారుడు అందుబాటులో లేడనే విషయం అక్రమార్కులు తెలుసుకున్నారు. ఆ భూమి విలువ ప్రైవేట్ మార్కెట్లో ఎకరం సుమారు రూ. 30 లక్షల వరకు ఉండంటంతో దానిపై రియల్ మాఫియా కన్నుపడింది. రియల్ మాఫియా తమ కుట్రకోణంతో ఆ భూమిని కైవసం చేసుకునేందుకు తెరలేపారు. దీంతో అప్పటికే పలు చోట్ల రియల్ మాఫియాకు పెట్టుబడి పెట్టిన నేలకొండపల్లి ప్రాంతానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఎంచుకున్నారు. ఆ భూమి వివరాలును తెలియజేశారు. భూమి యజమాని చనిపోయాడని, అతడికి దత్త పుత్రుడు ఉన్నాడని నమ్మపలికి వ్యాపారితో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈలోగా అసలు యజమాని చనిపోయినట్టుగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించటమే కాకుండా, ఓ దత్తపుత్రుడు ఉన్నట్టుగా మరో వ్యక్తి పేరిట నకిలీ దత్తత ధృవపత్రాన్ని సృష్టించి.. ఆ దత్త పుత్రుడి ద్వారా ఆ 5.38 ఎకరాల భూమిలో నుంచి 4.06 ఎకరాల భూమిని రియల్టర్ తరపు వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఈ తంతంగమంతా రియల్ మాఫియాకు ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన సలహాతోనే పూర్తి చేశారని, ఈ విషయం ఎక్కడ బెడిసి కొట్టకుండా సజావుగా సాగేందుకు ఆ అధికారికి పెద్దమొత్తంలో ముడుపులను ముందస్తుగానే ముట్టజెప్పారని మండలం కోడై కూస్తోంది. ఇంతలో విషయం బయటకు పొక్కుతున్న విషయాన్ని గ్రహించి, సదరు అధికారే ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు…
ఇది కూడా చదవండి: గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది: మంత్రి
తహశీల్దార్ వేరే పనులలో ఉండగా, రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ను అందిపుచ్చుకున్న సదరు అధికారి, తన కింది స్థాయి అధికారిచే అప్పటికప్పుడు రిపోర్టు తయారు చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని, ఇది బయటకు పొక్కటంతోనే పోలీసులను ఆశ్రయించారు.. ఏమిటో జాగ్రత్తగా పరిశీలించి చేయాల్సిన రిజిస్ట్రేషన్ ను, గుట్టుగా పూర్తిచేసి చేతులు దులుపుకుందా మనుకున్న సమయంలో చేసిన తతంగం వెలుగులోకి వచ్చి సంచలనం మారింది. మండల తహశీల్దార్ గా ఉన్న అధికారి గతంలో పెండింగ్ పెట్టిన రిజిస్ట్రేషన్ ను ధరణి సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వర్తిస్తున్న డివ్యూటీ తహశీల్దార్ రిజిస్ట్రేషన్ చేయడంతో పలు అనుమానాలు రేకెత్తాయి…
== కేసు నమోదు…. విచారణ… *
నకిలీ ధ్రువపత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఈ నెల 2న రూరల్ పోలీస్టేషన్లో డిప్యూటీ తహశీల్దార్ ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఆ ఫిర్యాదులో ఖమ్మంరూరల్ మండలం తనగంపాడు. రెవెన్యూ పరిధిలోని పాలగాని కోదండరామిరెడ్డి పేరిట 5.38 ఎకరాల భూమి ఉందని, ఆయన 2021 ఏప్రిల్ 9న చనిపోయాడని, ఆయన భార్య పద్మావతి గతేడాది ఫిబ్రవరి 12న మరణించారని పేర్కొన్నారు. వారికి వారసులేవరు లేరని, వారి కర్మకాండలను తానే చేశానని, తాను పద్మావతి చెల్లెలి కుమారుడినని, వారి ఆస్తులకు తానే వారసుడిని అని రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం మేడిపల్లికి చెందిన ఓ వ్యక్తి గతేడాది అక్టోబరు 26న వారసత్వ నమోదుకు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. వారి పేరిట తనగంపాడు రెవెన్యూలో ఉన్న భూమిని తనపేర మార్చాలంటూ కోదండరామిరెడ్డి, పద్మావతికి చెందిన నకిలీ మరణ ధ్రువపత్రాలు ధరఖాస్తుకు జతపరిచారు. విచారణ అనంతరం మార్చి 10న నిరంజన రెడ్డి, పోడేటి నాగేశ్వరరావు, ముత్తినేని వీరయ్య, ఐనాల రామారావు, కాసాని వెంకటేశ్వర్లు అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ ఐదుగురిలో నేలకొండపల్లికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ముత్తినేని వీరయ్య చౌదరి, రూరల్ మండలం, గూడూరుపాడు గ్రామానికి చెందిన పోడేటి నాగేశ్వరరావులను రూరల్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి సైతం తీసుకున్నారు. ఈ నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహరంలో మరి కొంతమందిని అరెస్టు చేయాల్సి ఉన్నందునే పూర్తి సమాచారం రాబట్టేందుకు వీరిని కస్టడీకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు… ఆ తరువాత ఈ కేసుతో సంబంధమున్న మరో ఇద్దరినీ కూడా రిమాండ్ కు పంపారు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు పంటకు గిట్టుబాటు ధర: సంభాని
కేసును కొన్ని ప్రత్యేక పరిస్థితులలో విచారణ మొదలుపెట్టిన పోలీసులు పూర్తి వాస్తవాలను, సంబంధమున్న అధికారులను కూడా అదుపులోకి తీసుకుంటారని అనుకున్నా, అక్కడి తోనే దర్యాప్తు ఆపేసి ఊరుకున్నారా అనేది తెలియ రాలేదు.. ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి ప్రత్యేకంగా ఈ కేసును దర్యాప్తు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ దర్యాప్తు సందర్భంగా అత్యంత విశ్వసనీయ సమాచారం, కేసుతో ముడిపడిన అధికారుల హస్తం బయటకు వచ్చినట్లు తెలిసింది… కేసులో నిందితులుగా అక్రమ రిజిస్ట్రేషన్ తో నష్టపోయిన రియల్ వ్యాపారి, ఆది నుండి ఎవరెవరి ప్రమేయం ఈ అక్రమ రిజిస్ట్రేషన్ కోసం ఉందొ, యే యే అధికారికి ఏ సమయంలో ఎంత ముట్టచెప్పారో పూసగుచ్చినట్లు దర్యాప్తు అధికారికి చెప్పినట్లు తెలిసింది.. అయినా మరి ఆ శాఖాధికారులపై చర్యలు ఉంటాయా, అక్రమాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేసిన పోలీసులు, ఆయా అధికారులను కూడా అరెస్ట్ చేసి అవకాశముందా, లేదంటే కేవలం ఉన్నతాధికారులకు వారి ప్రమేయంపై నివేదిక సమర్పించి సరిపుచ్చుతారా అనేది తెలియాల్సి ఉంది.. అయితే శాఖాపరమైన అంతర్గత విచారణ కూడా నిర్వహిస్తున్న సందర్భంలో తహశీల్దార్ కార్యాలయం ఆధికారులకు కూడా కీలక పాత్రగా తేలినట్లు, అందుకే ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయం నాయబ్ తహశీల్దార్ కరుణశ్రీ ని బదిలీ చేసినట్లు, వారిపై శాఖాపరమైన కఠిన చర్యలకు కూడా జిల్లా అధికారులు పూనుకుంటూన్నట్లు సమాచారం. అయితే ప్రజలలో మాత్రం పెద్దల ప్రమేయమున్న ఇలాంటి కేసులు కథ కంచి చేరేనా అనే సంశయం మాత్రం మెండుగా ఉంది… కోసమెరుపేమిటంటే ఇప్పటికి కూడా ఆ భూమికి సంబంధించిన యజమానులు ఎవ్వరూ కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఫిర్యాదు చేయక పోవడం గమనార్హం…