Telugu News

తెరాస, భాజపాలది రాజకీయ నాటకం

రైతులతో రెండు పార్టీలూ ఆడుకుంటున్నాయి

0

తెరాస, భాజపాలది రాజకీయ నాటకం

రైతులతో రెండు పార్టీలూ ఆడుకుంటున్నాయి

అప్పుల సొమ్ము ఖర్చయినా ప్రాజెక్టులు పూర్తికాలేదు

👉కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ధ్వజం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: యాసంగిలో వరి వేయొద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణలో వరి కొత్తగా సాగవడం లేదనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని హితవు పలికారు. రాజకీయాల కోసం తెరాస, భాజపా నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తులకొనుగోళ్లు, మార్కెటింగ్‌కు ప్రణాళికలు రూపొందించడం ప్రభుత్వ బాధ్యతని గుర్తుచేశారు.‘కేంద్రం కొనడంలేదు కాబట్టి..నేను కొనను’ అంటే ఎలాగని ప్రశ్నించారు. తెలంగాణ రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుట్‌బాల్‌ ఆడుతున్నాయని మండిపడ్డారు. ‘సీఎం కేసీఆర్‌ అవినీతి అంతా తెలుసు, ఆయన్ని జైలుకు పంపిస్తాం’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అంటున్నారు. ‘దమ్ముంటే టచ్‌ చేయ్‌’ అని కేసీఆర్‌ అంటున్నారు. ‘అలాంటప్పుడు టచ్‌ చెయ్‌, లేదంటే బడాయి మాటలైనా మానుకో’ అని సంజయ్‌కి హితవు పలికారు.

నదీ జలాల సమస్యపై ఇప్పుడా మాట్లాడేది?
రాయలసీమ ప్రాజెక్టు పేరుతో ఏపీ నీటి దోపిడీకి పాల్పడుతోందని, రోజుకు 11 టీఎంసీలు అక్రమంగా తరలించుకుపోతోందని భట్టి ఆరోపించారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే నాగార్జునసాగర్‌లోకి నీళ్లు రావని, శ్రీశైలంపై ఆధారపడిన తెలంగాణ ప్రాజెక్టులు ఎండిపోతాయన్నారు. ‘‘ఏడేళ్ల నుంచి నదీ జలాల సమస్య పరిష్కారం కావట్లేదని కేసీఆర్‌ ఇప్పుడు చెబుతున్నారు. మరి ఇన్నేళ్లు ఆయన ఏంచేశారు. అనేకసార్లు దిల్లీ వెళ్లినా నదీ జలాల విషయంలో ఎందుకు స్పష్టత తెచ్చుకోలేకపోయారో సీఎం సమాధానం చెప్పాలి’ అని భట్టి నిలదీశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం తీసుకొచ్చిన అప్పుల తాలూకూ సొమ్మంతా ఖర్చయిపోయినా ప్రాజెక్టులు పూర్తికాలేదని ఆరోపించారు. నాయకుల మధ్య అంతర్గత పోరు కాంగ్రెస్‌ను బలహీన పరుస్తోందని భట్టి అభిప్రాయపడ్డారు. ఇది ఎవరినో నిందించి వదిలేసేది కాదని, అభ్యర్థి ఎంపిక సమష్టి నిర్ణయమని స్పష్టం చేశారు