Telugu News

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం మే: పొంగులేటి

మధిర, ఎర్రుపాలెం ప్రచార సభల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి

0

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం మే: పొంగులేటి

– కేసీఆర్..12 సీట్లలో ఎలా గెలుస్తా అంటున్నావ్ ?
– ఈసారి పార్లమెంటుపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుద్ది
– కేంద్రం బిచ్చమేస్తోందా కిషన్ రెడ్డి..?
– మధిర, ఎర్రుపాలెం ప్రచార సభల్లో రెవెన్యూ మంత్రి పొంగులేటి
– మహిళలకు త్వరలోనే రూ.20వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తాం: భట్టి
– రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు

(మధిర/ఎర్రుపాలెం-విజయం న్యూస్):

రాష్ట్రంలో 12 స్థానాల్లో బీఆర్ ఎస్ గెలుస్తుందని కేసీఆర్ అంటున్నారని.. విజయం సాధించడం కాదు.. కనీసం డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి భారీ మెజారిటీని కాంక్షిస్తూ..గురువారం రాత్రి ఎర్రుపాలెం, మధిరలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రోడ్డు షో నిర్వహించి, ప్రధాన కూడళ్ళలో ప్రసంగించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలను విస్మరించారని, కనీసం బాగోగులు కూడా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు కర్ర చేతబట్టి… కపట నాటకాలు ప్రదర్శిస్తూ బస్సు యాత్ర చేస్తున్నారని, మళ్లీ కర్రు కాల్చి వాత పెట్టాల్సిందేనని అన్నారు.
*ఆయన ఇంకా తానే సీఎం అనుకుంటున్నాడేమో.. నోరా.. డ్రైయినేజా?*
కేసీఆర్ ఫాo హౌస్ మత్తులో ఉండి.. ఇంకా తానే ముఖ్యమంత్రి అని భ్రమలో ఊగుతున్నాడని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కపట ప్రేమతో ఖమ్మం వచ్చి ప్రజలతో మాయ మాటలు కలిపే కుట్ర చేస్తున్నాడని తెలిపారు. కేసీఆర్ నోరు తెరిస్తే అదొక డ్రైయినేజీ అని, అడ్డూ అదుపు లేకుండా విమర్శలు చేస్తున్నాడాని అన్నారు.
*ఇంకొక్క రోజే ఉంది.. ప్రజలారా మీరే కీలకం*
ఎల్లుండి శనివారంతో ప్రచారం ముగుస్తుందని, ప్రజలారా పల్లెల్లో ముమ్మర ప్రచారం చేయాలని, మీరే మంత్రులుగా మరింతగా కృషిచేసి రఘురాం రెడ్డికి భారీ మెజారిటీని అందించాలని కోరారు.
*పదేళ్లలో బీజేపీ.. గాడిద గుడ్డిచ్చింది*
బీజేపీ పదేళ్ల పాలనలో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి అన్నారు. కోట్లాది రూపాయల నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని, పన్నుల రూపంలో వేలాది కోట్ల రూపాయలు తీసుకుని.. నామమాత్రంగా రాష్ట్రాన్ని కేటాయించా రని తెలిపారు. మీరు ఏమైనా బిచ్చం వేస్తున్నారా..? అని ప్రశ్నించారు. రఘురాం రెడ్డి గెలిచాక.. ఎర్రుపాలెం లో శాతవాహన ఎక్స్ప్రెస్ ను నిలుపుదామని అన్నారు.
*మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తాం: డిప్యూటీ సీఎం భట్టి*
మహిళలందరూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా.. ఏడాదికీ రూ.20 వేల కోట్ల చొప్పున.. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక.. ఈ ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించారు. ఎర్రుపాలెంలో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని అన్నారు. వాటి రైతుల కోసం ఇందిరమ్మ డెయిరీ పనులు మొదలయ్యాయని అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొద్ది కాలంలోనే ఎంతో చేశామని అన్నారు. బీఆర్ఎస్ పాలకులు .. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని.. దాన్ని సరిదిద్దుతూ.. ఉద్యోగులకు వేతనాలు అందజేస్తూ.. ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికల్లో రఘురాం రెడ్డికి తనకంటే రెట్టింపు మెజారిటీ అందించాలని కోరారు.