Telugu News

చి”వరి”కి మద్దతుధర దక్కేనా…?-ప్రకటనలకే పరిమితమైన అధికారులు.

-క్వింటా రూ.1500కి ఇస్తారా అంటూ దళారుల బేరాలు. -ధాన్యపు కల్లాల్లో కన్నీరు పెడుతున్న రైతాంగం.

0

చి”వరి”కి మద్దతుధర దక్కేనా…?
-ప్రకటనలకే పరిమితమైన అధికారులు.
-క్వింటా రూ.1500కి ఇస్తారా అంటూ దళారుల బేరాలు.
-ధాన్యపు కల్లాల్లో కన్నీరు పెడుతున్న రైతాంగం.

(ములుగు జిల్లా ప్రతినిధి-విజయం న్యూస్):-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రైతు శ్రేయస్సు కోరి మద్దతు ధర దక్కాలని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే, మధ్య దళారుల వ్యవస్థతో అధికారులు, మిల్లర్ యాజమాన్యం రైతులను నిలువునా దోపిడీ చేస్తోంది.కాటేసే కాలానికి కనికరం లేదు. రైతుని ఆదుకోవాల్సిన అధికారులు కానరారు.
గుంట నక్కల మాటు వేసిన మిల్లర్లు దయ, జాలి, కనికరం చూపరు.దళారుల దోపిడీ ఏ అధికారి ఆపరు.అనునిత్యం వెంటాడుతున్న అప్పులు కంటిమీద కునుకు పడనియవు.దినదినగండంగా ఇన్ని ఇబ్బందుల మధ్య అందరికీ అన్నం పెట్టే అన్నదాత తన కడుపు నిండా పిడికెడు మెతుకులు తినే దారిలేక అల్లాడి పోతున్నాడు. సమస్యల సుడిగుండంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేక, అకాల వర్షాలు నుంచి కూడా కాపాడుకోలేక, అష్టదిగ్బంధనం కావడంతో నరక యాతన పడుతున్నాడు. ధాన్యపు రాశులు నడుమ కళ్ళల్లో కన్నీరు కారుస్తున్న రైతుల గోడు పట్టించుకునే నాధుడు ఎవరు…

రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం, రైతులు అధైర్యపడవద్దు. దళారులకు అమ్మి మోసపోకుండా మద్దతు ధరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే. అమ్ముకోవాలి.
– ప్రతిసారి రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు చెబుతున్నమాట.

దాన్యం తీసుకొని విక్రయ కేంద్రాల వెళితే కొనటం లేదయ్యా. ఇప్పటికె క్వింటాల కొద్ది తరుగుతో చితికిపోయిన రైతుకి రోజులు గడుస్తున్న మద్దతు దక్కే పరిస్థితి కనబడటం లేదు. పలుకుబడి ఉన్నోడికి ముందుగానే గోనె సంచులు అందుతున్నాయి. – ఓ రైతు ఆవేదన..

ములుగు జిల్లా వ్యాప్తంగా ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మిల్లర్లకు, దళారులకు వరంగా మారాయి. కొంతమంది రైతులు ఇబ్బందులు పడలేక తక్కువ ధరకే దళారులకు అమ్ముకొని కొంత సొమ్ము చేసుకున్నారు. ములుగు,పసర, గోవిందరావుపేట, వెంకటాపూర్, లక్ష్మీ దేవి పేట, నల్లగుంట, దుంపెళ్లి గూడెం, చల్వాయి, ఏటూరునాగారం ప్రాంతాలలో ప్రభుత్వం మద్దతు ధరకు అమ్ము కుందామని వేచి చూసిన రైతుల కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాయాల్సి వస్తుంది. మద్దతు ధర దేవుడెరుగు, కనీసం ధాన్యం కొంటాం అని చెప్పేవారు లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఎకరం, రెండు ఎకరాలు సాగు చేసిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మిల్లర్లు సైతం రాజకీయ పలుకుబడి ఉన్న బడా రైతులవి మాత్రం ఎటువంటి తరుగు లేకుండా దిగుమతి చేసుకుంటున్నారు.

ఈ పరిస్థితులలో సన్న చిన్న కారు రైతులు కాస్తోకూస్తో ధాన్యం అమ్ముకున్న మిల్లర్ల చేతిలో తరుగు రూపంలో బలవుతున్నారు. అన్నదాతలు అడుగడుగున దోపిడీకి గురవుతున్న నోరు విడిచి మా సమస్య ఇది అనే ఏ ఒక్క అధికారికి విన్నవించుకునే పరిస్థితి లేకుండా ఉంది. క్షేత్రస్థాయిలో రైతు సమస్యలు కళ్ళక్కట్టినట్టు కనబడుతున్న ఏ ఒక్క అధికారి కూడా నోరు మెదపడం లేదు. ఎక్కువగా తాలు, తేమ ఉంది. అందుకే కింటా కి 10 కేజీలు తరుగు తీస్తున్నాం.అందుకు ఇషమైతే ఇవ్వు లేకపోతే వెళ్ళిపో అని ఖరాఖండిగా చెబుతున్నారు.మిల్లర్ల ఆంక్షలు, తమ సమస్య చేసుకుందామని జిల్లా సివిల్ సప్లై అధికారులకు, వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులకు చరవాణి ద్వారా తెలియపరచాలని ప్రయత్నించిన వారు కనీసం ఫోన్ ఎత్తి రైతులకు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నరు.అధికారుల అలసత్వం, దళారుల దోపిడీ ,హమాలీల కొరత, వెరసి అన్నదాత నడ్డి విరుస్తున్నాయి అనే చెప్పాలి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం చోద్యం చూస్తూ ఉండిపోతున్నారు. ఖరీఫ్ లో పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసేది ఎన్నడోనని అన్నదాత ఆశగా ఎదురు చూస్తున్నాడు.తరుగు కోతతో విలవిలలాడుతున్న రైతాంగానికి ప్రభుత్వం మద్దతు ధర అందని ద్రాక్ష పుల్లన అనే విధంగా మిగిలి ఉంది.

also read :- గజ్జెల రామారావు కుటుంబానికి న్యాయం చేయాలి