అన్నింటా తెలంగాణ పట్ల కేంద్రం వివక్షే: నామా
== అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటులోనూ మళ్ళీ అదే తంతు
== ప్రజలు గమనిస్తున్నారు…కేంద్రానికి బుద్ధి చెప్పడం ఖాయం
== తెలంగాణా అభివృద్ధిని అడ్డుకుంటోన్న కేంద్రం
== కేంద్రం తీరు పట్ల నామ ఆసహనం
== కేంద్రంపై టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు మండిపాటు
న్యూఢిల్లీ/ ఖమ్మం, ఏప్రిల్ 5(విజయంన్యూస్):
అన్నింటా కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షతతో తెలంగాణా అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటోందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు చూడడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. కొత్తగా దేశంలో అణు రియాక్టర్లు నెలకొల్పే విషయంలో కూడా కేంద్రం తెలంగాణ పట్ల మళ్ళీ కుట్ర పూరితంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలా అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని నామ అన్నారు.
ఇది కూడా చదవండి: దేశానికి దిక్సూచి తెలంగాణ: నామా
లోక్ సభలో అణు రియాక్టర్లు గురించి కేంద్రాన్ని వివరాలు కోరితే బుధవారం కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారని, అది చూసి ఆశ్చర్యపోయామని అన్నారు. దేశంలో ఎక్కడైనా కొత్తగా అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారా? అని ప్రశ్నించడంతో పాటు దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి వివరాలు కోరగా, కేంద్రం స్పందించి, వివరాలు ఇచ్చిందని నామ పేర్కొన్నారు. దేశంలోని అణు విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేయబడుతున్న అణు విద్యుత్ దేశంలోని మొత్తం విద్యుత్ లో ఎంత శాతమని నామ ప్రశ్నించారు. పరమాణు వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని మరింతగా పెంచాలని కేంద్రం చూస్తుందా? అని ప్రశ్నించారు. కొత్త కేంద్రాలకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు లిఖితపూర్వకంగా చెప్పిన కేంద్రం తెలంగాణ విషయంలో మళ్ళీ మొండిచేయి చూపించిందని నామ పేర్కొన్నారు. కొత్తగా గుజరాత్, కర్నాటక, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం తో పాటు పరిపాలన పరమైన ఆమోదం తెలిపి, ఆర్థిక వనరులు మంజూరు చేయడం కూడా జరిగిందని నామ పేర్కొన్నారు. ఆ రాష్ట్రాలన్నీ గుర్తున్న కేంద్రానికి తెలంగాణ ఎందుకు కనపడలేదని నామ ప్రశ్నించారు. ప్రన్ధుతం ఉన్న వాటి సామర్ధ్యాన్ని 2031 నాటికి 6780 మెగావాట్ల నుంచి 22480 మెగావాట్లకు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పిన కేంద్రం తెలంగాణాను ఎందుకు విస్మరించిందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారని, రానున్న కాలంలో తగిన గుణపాఠం నేర్పడం ఖాయమని నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: లోక్ సభలో మహిళా బిల్లుపై చర్చకు నామ గట్టిపట్టు
అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రం ఈ విధంగా వ్యత్యాసాలు చూపించడమేమిటని నామ పేర్కొన్నారు.కాగా 2021 -22లో అణు రియాక్టర్లు ద్వారా 47112 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేశాయని, ఇది దేశంలో ఉత్పత్తి చేయబడిన విద్యుత్ లో 3.15 శాతముంటుందని కేంద్రం వెల్లడించిందని నామ నాగేశ్వరరావు తెలిపారు.