ఆండ్రిపాల్ అడవుల్లో ఎదురుకాల్పులు
తప్పించుకున్న మావోయిస్టులు...సంఘటన స్థలంలో పేలుడు సామాగ్రి స్వాధీనం
ఆండ్రిపాల్ అడవుల్లో ఎదురుకాల్పులు
– తప్పించుకున్న మావోయిస్టులు
– సంఘటన స్థలంలో పేలుడు సామాగ్రి స్వాధీనం
(భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో – విజయం న్యూస్)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఆండ్రిపాల్ అటవీ ప్రాంతంలో గురువారం మావోయిస్టులకు, పోలీసులకు నడుమ ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… భైరామ్‌గఢ్ ఏరియా కమిటీ మిలటరీ ఇంటెలిజెన్స్ ఇంచార్జి మోహన్ కడ్తీ ఆ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఆర్‌జీ పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి గాలిస్తుండగా మావోయిస్టులు అకస్మాత్తుగా డీఆర్‌జీ జవాన్ల మీదకు కాల్పులు జరపడంతో అప్రమత్తమై ఆత్మరక్షణార్థం జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. కొద్దిసేపు హోరాహోరీగా జరిగిన కాల్పుల అనంతరం జవాన్లధాటికి తట్టుకోలేక పొదలమాటున మావోయిస్టులు తప్పించుకొని పారిపోయారని పోలీసులు తెలిపారు. allso read –ఇద్దరు మావోయిస్టులు అరెస్టు
ఆ ప్రాంతంలో గాలించిన జవాన్లు ఘటనాస్థలి నుంచి టిఫిన్ బాంబులు, డిటోనేటర్లు, మావోయిస్టు సాహిత్యం, ఇతర రోజువారీ వినియోగ నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో అశాంతి సృష్టించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకంగా అభివృద్ధి వ్యతిరేక ర్యాలీలకు గ్రామస్తులను ప్రోత్సహించడంలో మోహన్ కార్తీ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. తాజాగా బంగోలీ ఘాట్‌లో జరిగిన ఘటనలో దొరికిన ఆధారాలతో ఈ విషయాలన్నీ బయటపడ్డాయని వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజాపూర్‌లో మావోయిస్టుల బృందం ప్రతి బ్లాక్‌లో ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతోందని
తెలిపారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఆ ప్రాంతంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు.