Telugu News

ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఘర్షణ

కమీషన్ దారుడిపై రైతులుదాడి

0

ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఘర్షణ

== కమీషన్ దారుడిపై రైతులుదాడి

== పైసలు తీసుకుని మిర్చిపంటను ఇవ్వకపోవడంతో రైతును ప్రశ్నించిన కమీషన్ దారుడు

== మాటమాట పెరిగి ఘర్షణగా మారిన పంచాయతీ

== ఆగిపోయిన కొనుగోలు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ లో ఒక్కటైన మిర్చిమార్కెట్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. ఎర్రబంగారంగా మారిపోయిన మిర్చి యార్డ్ లో సమస్యల బంగారంగా మారింది.. కమీషన్ దారులకు, రైతులకు మధ్య ఎదో రకమైన వాధనలు, గొడవలు, ఘర్షణలు తరుచు జరుగుతూనే ఉన్నాయి.. గత కొద్ది సంవత్సరాల క్రితం మిర్చిమార్కెట్ లో ఘర్షణ చోటు చేసుకోగా రైతులకు బేడిలు వేసి జైలుకు పంపించిన ఘటన ఎంత సంచలనంగా మారిందో మనందరికి తెలిసింది.. అంతటి పెద్ద ఘటన జరిగిన తరువాత కూడా ఖమ్మం మార్కెట్ లో గొడవలు తగ్గుముఖం పడతాయంటే పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.. అదే తరహాలో శనివారం ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఘర్షణ జరిగింది. కమీషన్ దారుడికి, రైతుకు మధ్య జరిగిన గొడవ కాస్త మార్కెట్ యార్డ్ కు చుట్టుకుంది.

ఇదికూడా చదవండి: ఏసీబీ చిక్కిన హెచ్ఎం ఎం శ్రీలత

రైతులు, కమీషన్ దారుడి మధ్య వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీయడంతో కమీషన్ దారుడిపై రైతులు దాడి చేశారు. దీంతో మార్కెట్ లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల రంగప్రవేశంతో సమస్య సద్దుమనిగినప్పటికి ఖమ్మం మార్కెట్ శనివారం కొనుగోలు నిలిపివేసే పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే అప్పు ఇచ్చిన తన వద్దకు రాకుండా వేరే కమీషన్ దారుడి వద్దకు ఎందుకు వెళ్లావని ప్రశ్నించిన కమిషన్ దారుడికి, రైతుకు మధ్య గొడవ జరిగింది. ఈఘటన ఖమ్మం మిర్చి మార్కెట్ లో శనివారం చోటుచేసుకుంది.  ఖమ్మం రురల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన ధర్మసోత్ మదన్ అనే రైతు వడ్డే వెంకటేశ్వర్లు అనే కమీషన్ దారుడి వద్ద పంట వచ్చినప్పుడు మీకు పంటను అమ్ముతానని అప్పు తీసుకున్నాడు. శనివారం మదన్ తన  మిర్చిని మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ఈ మిర్చిని వెంకటేశ్వర్లు వద్దకు తీసుకెళ్లకుండా వేరే కమీషన్ దారుడి వద్దకు తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు తన వద్ద తీసుకున్న డబ్బు విషయమై రైతు మదన్ ను అడిగాడు. ఈవిషయమై మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది. మిర్చిని తన వద్దకు తీసుక రాకుండా వేరే కమిషన్ మార్చంట్ వద్దకు ఎలా వెలతావు అని కమీషన్ దారుడు వెంకటేశ్వర్లు రైతును ప్రశ్నిస్త్తాడు. దీంతో రైతుకు, కమీషన్ దారుడికి మాటామాటపెరిగింది. కమీషన్ దారుడు నోరు జారడంతో రైతు  కమీషన్ దారుడిపై పిడిగుద్దులతో దాడి చేస్తాడు. అంతే కాకుండా కొంత మంది రైతులు, మదన్ గ్రామస్థులు  తోడు అవ్వడంతో కమీషన్ దారుడ్ని మార్కెట్లో తరుముకుంటు కొట్టారు.

ఇది కూడా చదవండి: నేను తలుచుకుంటే..? అడుగుపెట్టగలవా రేవంత్ :రేగా

విషయం తెలుకున్న త్రీ టౌన్ పట్టణ పోలీసులు రైతు, కమిషన్ మార్చంట్‌ను స్టేషన్‌కు తరలించారు. కమీషన్ దారుపై దాడి చేయడం అమానుషమని, మార్కెట్లో కొనుగోళ్లు నిలిపివేయాలని కమీషన్ వ్యాపారుల ఆందోళనకు దిగారు. దీంతో చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత కల్పించుకొని ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి పోలీస్ స్టేషన్ లో క్షమాపణ చెప్పించారు.  కమిషన్ దారులు ఎన్నో అవస్థలు పడి రైతులను ఆదుకుంటూ వ్యాపారం నిర్వహిస్తుంటే కొందరు రైతులు కాలం కలిసి రాక వేసిన పంట చేతికి రాక నష్టాలు బారిన పడడంతో ఎవరికి చెప్పుకోలేక వారి అసహనాన్ని కమిషన్ దారులపై చూపిస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కానీ రైతులు మాత్రం అందుకు భిన్నంగా చెబుతున్నారు.. జెండా పాటకంటే తగ్గించి పంటను కొనుగోలు చేస్తున్నారని, మరీ ముఖ్యంగా ముందుగానే అప్పు ఇచ్చారని వడ్డీతో తీసుకుంటూనే, చాలా అగ్గువ ధరకే పంటను తీసుకుంటున్నారని, తద్వారా రైతును తీవ్రంగా మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జెండా పాటకంటే ఎందుకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ ధరల తగ్గింపుపై ఎవరు మాట్లాడటం లేదని, ఎవరైనా రైతులు గట్టిగా నిలదిస్తే దాడులు చేస్తున్నారని లేదంటే పంట నాణ్యత పేరుతో పంటను కొనుగోలు చేయకుండా కమీషన్ దారులందరు కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ధర తగ్గుదల పెరుగుదల అనేది ఎవరి చేతిలో ఉండదని మార్కెట్ కు రైతులు తీసుకువచ్చే పంట నాణ్యతతో ఉంటే గిట్టుబాటు ధర పలికే అవకాశం ఉందని కమీషన్ దారులు చెప్పడం గమనర్హం. ఇదేమి గమనించకుండా కొంతమంది రైతులను వ్యాపారుల్లోని ఓవర్గం ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే విధంగా చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. మార్కెట్లో మరల ఈ విధమైన ఘటనలు చోటు చేసుకోకుండా పాలకవర్గం, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: డెస్క్ జర్నలిస్టులు.. వర్కింగ్ జర్నలిస్టులే