Telugu News

టీఆర్ఎస్, బీజేపీలకు స్వాతంత్రపై మాట్లాడే హక్కులేదు: భట్టి విక్రమార్క

విలేకర్ల సమావేశంలో మండిపడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

0

టీఆర్ఎస్, బీజేపీలకు స్వాతంత్రపై మాట్లాడే హక్కులేదు

== ఏనాడు పోరాటంలో పాల్గొనలేదు

== రాజకీయ లబ్దికోసం సెంటిమెంట్ రగిలిస్తున్నారు

== నాడు, నేడు ప్రజలకు అండగా ఉన్నది కాంగ్రెస్ ఒక్కటే

== విలేకర్ల సమావేశంలో మండిపడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఖమ్మంప్రతినిధి/మధిర, సెప్టెంబర్ 17(విజయంన్యూస్)

ఆనాడు జరిగిన తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యం లేని టిఆర్ఎస్ బిజెపిలు ప్రజల్లో సెంటిమెంటు రగిలించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మధిర క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో  తెలంగాణ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా భూమికోసం భుక్తి కోసం ఎట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటం గురించి చర్చ జరగాలని అన్నారు. దున్నేవాడికి భూమి కావాలన్న పోరాటం నుంచి భూమి హక్కు చట్టం ఎట్లా వచ్చింది? టెన్ ఎన్.ఎన్సీ యక్ట్ తీసుకొచ్చి భూమిపై హక్కు కల్పించి తొలుత పట్టాలు ఎవరు పంపిణీ చేశారన్న దానిపై చర్చ జరగాలని సూచించారు.

allso read- జాలుముడి కాలువను పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి

వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ సంవత్సరకాలం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఆనాడు రజాకర్ల సైన్యాన్ని అడ్డుపెట్టుకొని దేశముఖ్ లు జాగిర్దారులు, జమీందారులు ప్రజలపై జరిపిన  దాష్టీకాలు, దాడులు, అరాచకాలపై చర్చ జరగాలని తెలిపారు. ఆనాడు రైతులు కూలీలు ప్రజలను హింసించి ఎట్టి చాకిరి చేయించుకొని స్త్రీల మానాలను దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు ఎవరిని హింసించారు? ఎవరు పీడింపబడ్డారు? ఆనాడు గ్రామాల్లో ప్రజలు ఎవరిచేత ఇబ్బందులు పడ్డారో చర్చ జరిగితే మతోన్మాద శక్తులు వక్రీకరిస్తున్న చరిత్ర కాకుండా అసలైన చరిత్ర ప్రజలకు తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశముకులు, జాగిర్దారులు, జమీందారులు విధించిన భూమి శిస్తు పండించిన పంటకు సైతం ఎక్కువగా ఉండడంతో దున్నేవాడికే భూమి కావాలని ఆనాడు కమ్యూనిస్టులు సంఘాలు పెట్టి వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, శృతి మించిన విసునూరు రామచంద్ర రెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా భూమి కావాలని సంఘం నాయకులు ర్యాలీ తీస్తున్న క్రమంలో విసునూరు రామచంద్రారెడ్డి దొర రౌడీ మూకలు, ప్రైవేటు సైన్యం జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య అమరుడయ్యాడని అన్నారు. దున్నేవాడికే భూమి హక్కు కావాలని సంఘాలు పెట్టి పోరాడుతున్న కమ్యూనిస్టు నాయకులు దొడ్డి కొమరయ్య మరణం తర్వాత సాయుధ పోరాటం ద్వారానే న్యాయం జరుగుతుందని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిపారని తెలిపారు. ఆనాడు ఒక వైపు దున్నేవాడికి భూమి కావాలని దొరలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్న క్రమంలోనే నిజాం రాజ్యం నుంచి తెలంగాణకు స్వాతంత్రం కావాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి గాంధీ ఆలోచనలు ప్రచారం చేస్తూ స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రంధాల ఉద్యమం చేపట్టారని పేర్కొన్నారు. ఆనాటి కాంగ్రెస్ నాయకులు  సత్యాగ్రహంతో పాటు అనేక ఉద్యమాలు చేసి స్వాతంత్ర ఉద్యమాన్ని రగిలించారని, తెలంగాణలో నిజాం రాచరిక పరిపాలనలో పీడనకు గురవుతున్న ప్రజల బాధలు, దొరల ఆగడాలు, దాష్టీకాలు, దాడుల గురించి ఆనాటి ప్రధాని నెహ్రూ తో మాట్లాడి ఈ ప్రాంతానికి స్వరాజ్యం ఇవ్వాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు వేడుకున్నారని తెలిపారు.

allso read- ఖమ్మంరూరల్ సీఐ నీ తోలు తీస్తాం: కూనంనేని

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జనరల్ చౌదరి నాయకత్వాన ఆనాటి ప్రధాని నెహ్రూ తెలంగాణకు ఆర్మీ సైన్యాన్ని పంపించి 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజును లొంగదీసుకుని తెలంగాణకు స్వాతంత్రం కల్పించారని, దున్నేవారికి భూమి కావాలని కమ్యూనిస్టులు చేసిన పోరాట లక్ష్యాన్ని 1952లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నెరవేర్చారని పేర్కోన్నారు. ప్రజల లక్ష్యాలను చట్టబద్ధం చేస్తూ రైతులకు భూములపై హక్కులు కల్పిస్తూ భూమి హక్కు చట్టాన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఆనాడు గడీల పాలనలో జరిగిన రాచరిక దుర్మార్గపు చేష్టలు, జాగిర్దారులు జమీందారులు దేశముఖ్ లు ఎట్టి పేరు తోటి ప్రజలపై చేసిన దాడులు, అరాచకాలు, దాష్టీకాలు,  ఆకృత్యాలు

ఎంత భయంకరంగా ఉండేవో చర్చ జరగాలన్నారు. ఇలా చర్చలు జరగడం వల్ల ఆనాటి ప్రజల లక్ష్యాన్ని నెరవేర్చడానికి అద్భుతమైన చట్టాలు చేసుకుని ప్రజా సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుందని తెలిపారు. రాష్ట్రంలో అద్భుతమైన ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడి ప్రజా సంక్షేమ రాజ్యాన్ని నిర్మించడానికి ఈ చర్చలో వల్ల వచ్చిన ఫలితాలు దోహదపడతాయని అన్నారు.  దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 రోజును ఎలా జరుపుకుంటామో 1948 సెప్టెంబర్ 17ను కూడా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగానే జరుపుకొని మెరుగైన సమాజం కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 17 విమోచన కాదు.. తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు: రాయల