ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న సీఎల్పీ బృందంను అడ్డుకున్న పోలీసులు
పోలీసులపై సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం
ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్తున్న సీఎల్పీ బృందంను అడ్డుకున్న పోలీసులు
== దుమ్ముగూడెం సమీపంలో అడ్డుకున్న పోలీసులు
== పోలీసులపై సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం
== సుమారు మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేలు
== పోలీసులకు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వివాదం
== హోరెత్తిన కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు, ఏర్పడిన ఉత్రిక్తత
== దుమ్ముగూడెం అడవిలో టెన్షన్ టెన్షన్
భద్రాచలం, బూర్గంపాడు, ఆగస్టు 16(విజయంన్యూస్)
గోదావరి పరివాహిక ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల పరిశీలన కోసం తెలంగాణ సీఎల్పీ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సీఎల్పీ ప్రాజెక్టుల బాట పట్టారు. సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పోడేం వీరయ్య, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో ప్రాజెక్టుల పరిశీలనకు తరలివెళ్లారు.ముందుగా మంగళవారం భద్రాచలంలోని రామయ్యను దర్శించుకున్న సీఎల్పీ, ఆ తరువాత భద్రాచలం దేవాలయం వద్ద ఉన్న ముంపుకు గురవుతున్న దుకాణాల వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టుల బాట పట్టింది.
== అడుగడుగున అడ్డంకులే
దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన సీఎల్పీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దుమ్ముగూడెం వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుపడ్డారు. భద్రాచలం కేకే ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరిన సీఎల్పీ బృందాన్ని నిలువరించే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ శాసనసభక్ష నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దుమ్ముగూడెం వెళ్లడం లేదని చెప్పి పోలీసుల కళ్ళు కప్పి దారిలో అడవి మార్గాన ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డగించారు. దారికి అడ్డంగా ట్రాక్టర్లు, పోలీస్ డిసిఎం వ్యాను, పోలీస్ వాహనాలను నిలిపి ఎక్కడికి అక్కడ సీఎల్పీ బృందం వాహనాలను అడ్డుకున్నారు. పోలీసుల నిర్బంధ వైఖరిని నిరసిస్తూ సీఎల్పీ బృందం దుమ్ముగూడెం మండలం భోజి గూడెం వద్ద రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్ళనీయడం లేదని ఎమ్మెల్యేలు పోలీసులను నిలదీశారు.
allso read- రోడ్డుపై బేటాయించిన సీఎల్పీ బృందం
పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు పోలీసులపై తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు దుమ్ముగూడెం పరిసర గ్రామాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఉన్నందున భద్రత కారణాల రిత్యా అక్కడికి అనుమతించడం లేదని ఏఎస్పీ రోహిత్ ఎమ్మెల్యేల వద్దకు వచ్చి చెప్పడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం సామాన్యులకు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ తెలంగాణలో ఇంత బలహీనంగా ఉందా అని ప్రశ్నించారు. సీఎల్పీ బృందం పర్యటన ఉంటుందని వారం రోజులు ముందుగా పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినప్పుడు ఎందుకు తమకు రక్షణ ఏర్పాటు చేయలేదని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మావోయిస్టుల సాకుతో దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రభుత్వ నియంతృత్వమే అని సీఎల్పీ నేత భట్టి మండిపడ్డారు. సీఎల్పీ బృందం దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శించడం వల్ల అక్కడ లోపాలు బయటపడతాయన్న భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో తమను అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల రక్షణ తమకేమీ అవసరం లేదని మా కార్యకర్తల రక్షణతోనే దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శిస్తామని చెప్పినప్పటికీ పోలీసులు ససేమిరా అంగీకరించలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకున్నది. allso read- తమ్మినేని కృష్ణయ్య హత్యపై కేసు నమోదు
దుమ్ముగూడెం సందర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఎసిపి రోహిత్ ఎమ్మెల్యేలకు చెప్పడంతో ప్రభుత్వ వైఖరి తీరును ఎండగడుతూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దుమ్ముగూడెం ఎందుకు వెళ్ళనివ్వరని ప్రశ్నించారు. అక్కడ జరుగుతున్న రహస్యం ఏందని నిలదీశారు. కచ్చితంగా దుమ్ముగూడెం వెళ్తామని భీష్మించడంతో పోలీసులు భారీగా మోహరించి అటువైపుగా వెళ్లకుండా కట్టడి చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు ప్రభుత్వానికి కేసీఆర్ కు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితి తలెత్తింది. ఆ తర్వాత పోలీసులు గుర్రాల బేలు గ్రామం మీదుగా దుమ్ముగూడెం తీసుకెళ్తామని చెప్పడంతో రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేలు వాహనాలు ఎక్కి ఆ గ్రామానికి రాగా అప్పటికే 500 మందికి పైగా పోలీసులు మోహరించి ఆ దారి గుండా వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రాజెక్టుల సందర్శన ముంపు గ్రామాల పరిశీలనకు పోలీసులు ససేమిరా అంగీకరించకపోవడంతో సిఎల్పీ బృందం తిరిగి భద్రాచలానికి చేరుకున్నది. ఆ తర్వాత సారపాక గ్రామపంచాయతీ లోని సుందరయ్య కాలనీ సందర్శించారు. allso read- పాడే మోసిన తుమ్మల
== సుభాష్ నగర్ కాలనీలో పర్యటించిన సీఎల్పీ బృందం
గోదావరి వరదతో ముంచేత్తిన భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీని సీఎల్పీ బృందం సందర్శించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు సీతక్క, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డిలకు అక్కడి ప్రజలు వరద ముంపుతో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిపారు. 70 అడుగుల ఎత్తున వరద రావడంతో పది రోజుల పాటు కట్టు బట్టలతోటి సత్రంలో తల దాచుకున్నామని, ఆహార పానీయాలు కూడా ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పునరావసం నుంచి నుంచి ఇంటికి వస్తున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు బాధితులు చెప్పారు.
allso read- టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య..ఎందుకోసమంటే..?
== కేసీఆర్ వచ్చింది దేనికోసం? : భట్టి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి వరద ముంపు ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించడానికి వచ్చి తమ సుభాష్ నగర్ కాలనీకి రాలేదని ఆ కాలనీవాసులు సీఎల్పీ బృందానికి తెలిపారు. భద్రాచలంలో సుభాష్ నగర్ కాలనీ వరద ముంపునతో పూర్తిగా మునిగిపోయిందని, ఆ విషయం తెలిసినప్పటికీ సీఎం కేసీఆర్ తమ కాలనీకి రాకుండా భద్రాచలానికి ఎందుకు వచ్చినట్లు అని అన్నారు. సీఎం కేసీఆర్ భద్రాచలం కి వచ్చింది వరద బాధితుల గోడు వినడానికా? లేక గోదావరి పూజలు చేయడానికా? టిఆర్ఎస్ మంత్రులు జిల్లా అధికారులు కూడా సుభాష్ నగర్ వైపు కన్నెత్తి చూడలేదని విలపిస్తూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. భద్రాచలం ముంపు సమస్య, కరకట్ట ఎత్తు నిర్మాణానికి సాంకేతిక నిపుణుల కమిటీ వేయాలని అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపిస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారికి భరోసా ఇచ్చారు.
== రూ. 45 కోట్లు ఏం చేశారో అడగండి
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో భద్రాచలం కరకట్ట నిర్మాణం మరమత్తులు ఎత్తుకోసం 2014 ముందు 45 కోట్లు రూపాయలు మంజూరు చేశామని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ తెలిపారు. ఆ నిధులను ఎందుకు ఖర్చు పెట్టలేదు టిఆర్ఎస్ నాయకులను మంత్రులను నిలదీయాలని సుభాష్ నగర్ కాలనీవాసులకు పిలుపునిచ్చారు. ఇసుక ర్యాం
పు వద్ద నుంచి నెల్లిపాడు వరకు సుమారు 300 మీటర్ల దూరం చేయకుండా వదిలివేయడం వల్లే బ్యాక్ వాటర్ తో సుభాష్ నగర్ కాలనీ ముంపునకు గురవుతున్నదని ఈ ప్రభుత్వానికి తెలియకపోవడం అవివేకం అన్నారు. భద్రాచలంలోనే ఉండి జిల్లా మంత్రి అజయ్ ఎందుకు కాలనీకి రాలేదు టిఆర్ఎస్ నాయకులను ప్రజాప్రతినిధులను నిలదీయమన్నారు.
== ఎమ్మెల్యేనే ఆదుకున్నడు.
వరద ముంపునతో తీవ్ర ఇబ్బందులు పడిన సుభాష్ నగర్ కాలనీవాసులను ఎమ్మెల్యే పొడెం వీరయ్య దగ్గరుండి ఆదుకున్నారని కాలనీవాసులు సీఎల్పీ బృందానికి తెలిపారు. ఎమ్మెల్యే నిత్యవసర ఆహార వస్తువులు సరుకులను తమ కాలనీవాసులకు సొంత నిధులతో పంపిణీ చేశాడని వివరించారు.
== సీతారామచంద్రస్వామి ఆలయంలో సిఎల్పీ బృందం పూజలు
గోదావరి వరద మంపు ప్రాంతాలు, ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిన సీఎల్పీ బృందం మంగళవారం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించారు. ఆలయ అధికారులు వేద పండితులు పూర్ణకుంభంతో కాంగ్రెస్ శాసనసభక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, శ్రీధర్ బాబు, ,సీతక్క కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డిలకు స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సిఎల్పి బృందం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయ ఈ ఓపై సీఎల్పీ ఆగ్రహం
శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎమ్మెల్యే శ్రీధర్ బాబులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎల్పీ బృందం ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు అధికారుల రిసీవింగ్ విధానం, ఆలయంలో వేద పండితులు చేయాల్సిన పూజల విధానంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించడంతో ఇదేమి పద్ధతిని ఆలయ ఈవో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉన్న వారు వస్తే ఇదే విధంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. వివక్షత తీరు మార్చుకోవాలని మందలించారు.