Telugu News

మాకు ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత: పొంగులేటి

రాష్ట్రాన్నే ఉద్దరించలేని మీరు దేశాన్ని ఉద్దరిస్తారా..?

0

మాకు ఏదైనా జరిగితే సీఎందే బాధ్యత: పొంగులేటి

– మీ పార్టీలో లేమని చెప్పి సెక్యూరిటీని తగ్గించారు

– మేమేమి పుట్టుకతో సెక్యూరిటీతో పుట్టలేదు

– మాకు ప్రాణహాని ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులే బాధ్యులవుతారు

– పింక్ కలర్ కప్పుకున్న రైతులకే నష్టపరిహారం ఇస్తారా…?

– రాష్ట్రాన్నే ఉద్దరించలేని మీరు దేశాన్ని ఉద్దరిస్తారా..?

 – టేకులపల్లి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ పొంగులేటి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

నాకు, నా మనుషులకు, నా కార్యకర్తలకు ఏదైనా జరిగిందంటే కచ్చింతగా ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని, మాకేం జరిగిన ఆ బాధ్యత సీఎం కేసీఆర్ దేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మీ పార్టీలో లేమని చెప్పి సెక్యూరిటీని తగ్గించారు.. మేమేమి పుట్టుకతో సెక్యూరిటీతో పుట్టలేదు… రాబోయే రోజుల్లో నాకు గానీ… నా అనుచర వర్గానికి గానీ జరగరానిది ఏదైనా జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీ ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నైతిక బాధ్యత వహించాలని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి సింహం..సింగిల్ గానే వస్తుంది: స్వర్ణకుమారి 

టేకులపల్లి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన పొంగులేటి శీనన్న… కోరం కనకన్న ల క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ తనకు గానీ తనతో పాటు ఉన్న గిరిజన, దళిత నాయకులకు గానీ తన అనుచర వర్గానికి గానీ పొరపాటున ఏదైనా ప్రాణహాని లాంటి ఇబ్బందులు తలెత్తితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులు రోజుల తరబడి నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నా వారిని కనికరించడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పింక్ కలర్ కప్పుకున్న రైతులకు మాత్రమే నష్టపరిహారం ఇస్తారా అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్నే ఉద్దరించలేని సీఎం పార్టీ పేరు మార్చి దేశాన్ని ఉద్దరించడానికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందు టేకులపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీకి విశేషణ ఆదరణ లభించింది.

క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం మండలంలోని టేకులపల్లి, శాంతినగర్, చుక్కాలబోడు, కుంటల, రామచంద్రుని పేట, మురుట్ల, పాతర్లగడ్డ, బండవారిగుంపు, బోడు, బోడు కొత్తగూడెం, కొప్పురాయి, ఒడ్డుగూడెం, బర్లగూడెం, జంగాలపల్లి తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆర్ధిక సాయాలను అందించారు. పలు శుభకార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు.

== శీనన్నకు పూలవర్షం

టేకులపల్లి మండలంకు చేరుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అక్కడ అభిమానులు పూలవర్షం కురిపించారు. సుమారు 100మీటర్ల దూరం పాటు పూలతో వర్షంకురిపించగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరికి అభివాదం చేస్తూ, అందర్ని అప్యాయంగా పలకరిస్తూ ముందుకు కదిలారు. జై శీనన్న, జైజై శీనన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, తెల్లం వెంకట్రావు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ పార్టీ గెలుచుడే ఉండది:పొంగులేటి