ఖమ్మం పై సీఎం కేసీఆర్ గురి
== పదికి పది స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు
== త్వరలో ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
== మూడు రోజుల పాటు టూర్ ప్రోగ్రాం
== 5 నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరు
== సీఎం కెసీఆర్ సభా ప్రాంగణం స్థల పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నేతలు
== విజయవంతం చేసేందుకు భారీగా ఏర్పాట్లు
(కూసుమంచి-విజయంన్యూస్)
మూడవ సారి విజయం సాధించి హ్యాట్రిక్ విజయం స్వంతం చేసుకోవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.. అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాను టార్గెట్ గా తీసుకున్నారు.. కచ్చితంగా పదికి పది స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాపై గురిపెట్టారు. అందుకే అతిత్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు 5 నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొని వరాల జల్లు కురిపించనున్నారు.. అయితే సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు కావడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సహం ఉరకలేస్తుంది.. ఎన్నికల సమయంలో ప్రచార బహిరంగ సభలకు హాజరువుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే
ఇది కూడా చదవండి: బైలుదేరుతుండు కేసీఆర్ .. బేజారవుతండ్రు ప్రతిపక్షం
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేయగా, అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఫలితాలు ఉంటాయని షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని పొందాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగులేస్తున్న ఈ సందర్భంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్ పార్టీ మరింత జడ్ స్పీడ్ లో ప్రజల వద్దకు వెళ్లేందుకు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేస్తున్నారు. ఇప్పటికే ఒక వైపు మంత్రి కేటీఆర్, మరో వైపు మంత్రి హరీష్ రావు జోడెద్దుల వలే తెలంగాణ రాష్ట్రంలో విస్తృత్తంగా పర్యటిస్తుండగా ఎన్నికల సమయం అసన్నమవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా పర్యటించేందుకు సిద్దమైయ్యారు. ఈనెల 15 నుంచి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ప్రకటించిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాలో పర్యటించేందుకు సిద్దమైయ్యారు. అందులో భాగంగానే ఈనెల 15 నుంచి నవంబర్ 8 వరకు అన్ని జిల్లాలో బహిరంగ సభలను ఏర్పాటు చేయగా, 9న ఆయన పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్నారు. అందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ ను సీఎం కార్యాలయం నుంచి ప్రకటించారు.
== ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన
సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభలకు హాజరుకానున్నారు. ఈనెల 27 మధ్యాహ్నం 1 నుంచి 2గంటల వరకు పాలేరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్న సీఎం కేసీఆర్, నవంబర్ 1న మధ్యాహ్నం 1 నుంచి 2గంటల వరకు సత్తుపల్లి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఇల్లందులో పర్యటించనున్నారు. అలాగే నవంబర్ 5న మధ్యాహ్నం 1గంట నుంచి 2గంటల వరకు కొత్తగూడెం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఖమ్మం నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
ఇది కూడ చదవండి: సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?
మొత్తం 10 నియోజకవర్గాలో 5 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అంతేకాకుండా మూడు జనరల్ స్థానాల్లో ఆయన పర్యటిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు, అభ్యర్థులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు భారీ జనసమీకరణ పై ద్రుష్టి పెడుతున్నారు. గ్రామీణ స్థాయి నుంచి జనంను తరలించాలనే సంకల్పంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
== సభా వేదికలను పరిశీలిస్తున్న నేతలు
సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో సభా వేదికలను ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, ముఖ్యనాయకులు పరిశీలిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్ళచెరువులో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఆ సభా స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. అలాగే ఖమ్మంలో ఎస్ఆర్ బీజీఎన్ ఆర్ గ్రౌండ్, కొత్తగూడెం లో స్టేడియం, ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు పట్టణ కేంద్రంలో, సత్తుపల్లిలోని ఓ గ్రౌండ్ లో బహిరంగ సభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభా వేదికలను కూడా ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. సభావేదికలను సర్వం సిద్దం చేస్తున్నారు.
== జీళ్ళచెరువులో సభా వేదికను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు
పాలేరు నియోజకవర్గం, కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తారీఖున ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను పాలేరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది.. ఈ సందర్భంగా సభా ప్రాంగణాన్ని పరిశీలించిన నాయకులు కూసుమంచి మండలం మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు వేముల వీరయ్య,ఆసిఫ్ పాషా,నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు వున్నం బ్రహ్మయ్య,రూరల్ మండలం బెల్లం వేణుగోపాల్, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్,ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్ నాయక్, బోడ మంగిలాల్ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు ఓబిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జిల్లా నాయకులు మాలేడి వెంకన్న,మాజీ మండల పార్టీ అధ్యక్షులు చాట్ల పరశురాం, మీడియా అధ్యక్షులు వడ్త్యా బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: కామ్రెడ్లతో కాంగ్రెస్ దోస్తి..బీఆర్ఎస్ తో కుస్తి