Telugu News

చలి పంజా

-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

0

చలి పంజా
-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
– కప్పెస్తున్న మంచు.. కలవరపెడుతున్న ఈదురుగాలులు.
— రోజంతా చలితో ఇబ్బందులు పడుతున్న జనం
– పొంచివున్న రోగాలు.. రాత్రి సమయంలో జరుగుతున్న ప్రమాదాలు
— జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
— డ్రైవర్లు అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలంటున్న అధికారులు

(హాజిపూర్- విజయం న్యూస్)
చలిపులి ప్రజలను వణికిస్తోంది.. ఒకవైపు ఈదురుగాలులు, మరో వైపు చల్లటి వాతావరణంతో జనంపై చలి పంజా విసురుతోంది.. దీంతో జనం వణికిపోతున్నారు.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లలో చలిపులి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు జంకుతున్నారు. ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ,మంచిర్యాల జిల్లా లలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు రాష్ట్ర లోనే అత్యల్ప కనిష్ఠ డిగ్రీల టెంపరేచర్‌ నమోదైంది. పగలు చలి తక్కువగా ఉన్నప్పటికీ రాత్రిళ్లు పరిస్థితి దారుణంగా ఉంటున్నది. ఇక, అటవీ ప్రాంతంలో మంచు కమ్మేస్తున్నది. ఉదయం ఎనిమిదైనా మంచుతెరలు తొలగిపోవడం లేదు. వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. ప్రజలు బయటకు వెళ్లాలంటే స్వెటర్లు, జర్కిన్లు ధరిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాపై చలి పంజా విసురుతున్నది. రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతూ రాత్రి ఉష్ణోగ్రతలు తగుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల్లోపు ఉన్నప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో పోల్చితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగానికి పైగా తగ్గుతున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఈరోజు 8.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యా యి. రాష్ట్రవ్యాప్తంగా ఇవే అత్యల్ప ఉష్ణోగ్రతలు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో దట్టమైన చలిగాలులు వీస్తున్నాయి. వీటికితోడు పొగమంచు దట్టంగా అలుముకుంటుండడంతో చలి తీవ్రమవుతున్నది. ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. డిసెంబర్ రెండవ వారంలోనే చలితీవ్రత ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. చలితీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల కారణంగా చలి, ఎండ తీవ్రత ఈ ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంటుంది. ప్రతి శీతాకాలంలో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇక్కడ తక్కువగా నమోదవుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉండడంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
8 నుంచి10 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అనారోగ్యాల బారినపడి ఇబ్బందులు పడుతున్నారు. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధు లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తుల ఇబ్బందులు వర్ణనాతీతం. పెరుగుతున్న చలి తీవ్రత నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వెచ్చని దుస్తులు, చలి మంటలు కాగుతూ రక్షణ పొందుతున్నారు. జిల్లాలో ప్రతి యేటా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో ఈ ప్రాంతంలో ఉన్ని దుస్తులు,స్వెట్టర్లు, బ్లాంకెట్లు, మఫ్లర్‌లకు డిమాండ్‌ ఎక్కువ ఉంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన వ్యాపారులు వెచ్చని నేస్తాలను ఇక్కడ విక్రయిస్తున్నారు. ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తులను కొనుగోలు చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 రోజుల క్రితంతో పోల్చితే గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో కొద్దిగా మార్పు మాత్రమే కనిపించింది. అయితే.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగానికి పడిపోవడంతో పాటు 8.2 డిగ్రీలకు చేరుకుంది. వారం రోజుల నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రతను పరిశీలిస్తే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని గిన్నెధరిలో ఈరోజు 8.2 , అదిలాబాద్ జిల్లా బీంపూర్ మండలం అర్లీ 9.1డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే చలి కాలం లో ఓ వైపు పొగ మంచు,మరో వైపు చలి వాతావరణం దట్టమైన అడవులు, జిల్లా లో ఉన్న వాతావరణం కాశ్మీర్,ఊటీ లాంటి ప్రదేశాలను తలపించేలా ఉన్నాయని జనం అంటున్నారు.

చలి కాలం పొంచివున్న రోగాలు
ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయి చలి తీవ్రత కారణంగా ఏర్పడే వాతావరణ మార్పులతో మానవులపై వ్యాదుల దాడి పొంచివుంటుందని వైద్యులు అంటున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్దులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరమని పేర్కొంటున్నారు.

చలికాలంలో న్యూమోనియా, డెంగ్యూ, స్వైన్‌ ఫ్లూ, చర్మ వ్యాధుల భారిన ఎక్కువగా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. శ్వాస కోఽశ వ్యాధులు, ఆయాసం ఎక్కువగా ఉన్నవాళ్లు చల్లటి గాలులకు తిరగక పోవడమే మంచిది. దుమ్ము, దూళీ, పొగ మంచులో బయటకు వెళ్లకుండా ఉండాలని కోరుతున్నారు. ప్రయాణాలు చేసేప్పుడు గాలి త్రీవత ఇబ్బందులకు గురిచేయనుంది. చలిగాలులు సోకడం ద్వారా రక్తనాళాలు మూసుకుపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చల్లగాలినుంచి రక్షణకు చెవులు, నోరు, ముక్కు కప్పిపుచ్చే విధంగా మాస్క్‌లు, స్వేట్టర్లు, మఫ్లర్లు ధరించడం ఎంతో మేలు. చలి ఎక్కువగా ఉంటే కరోనా వైరస్‌ కూడ విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో తేమ వైర్‌సకు శక్తిని ఇస్తుందని నిపుణుల అభిప్రాయం. టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలు కూడ తీవ్రమైతాయని అంటున్నారు. జలుబు, దగ్గు జ్వరం ఉంటే ఏమాత్రం అశ్రద్ద చేయకుండా వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరమని సూచిస్తున్నారు.

also read :-టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం పరిశీలన.